తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Modi Ukraine : ఆగస్ట్​లో ఉక్రెయిన్​కి మోదీ- యుద్ధవిచ్ఛిన్న దేశంలో తొలి పర్యటన!

PM Modi Ukraine : ఆగస్ట్​లో ఉక్రెయిన్​కి మోదీ- యుద్ధవిచ్ఛిన్న దేశంలో తొలి పర్యటన!

Sharath Chitturi HT Telugu

27 July 2024, 8:07 IST

google News
    • PM Modi Ukraine visit : ప్రధాని మోదీ త్వరలో ఉక్రెయిన్​లో పర్యటించనున్నట్టు సమాచారం. ఆగస్ట్​లో ఆయన ఉక్రెయిన్​కి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీతో ప్రధాని మోదీ..
ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీతో ప్రధాని మోదీ.. (PTI)

ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీతో ప్రధాని మోదీ..

యుద్ధవిచ్ఛిన్న దేశమైన ఉక్రెయిన్​లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నట్టు సమాచారం. ఆగస్ట్​ 23న ఆయన ఉక్రెయిన్​కి వెళ్లనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2022లో ఉక్రెయిన్​పై రష్యా దండయాత్ర మొదలైనప్పటి నుంచి మోదీ ఆ దేశానికి వెళుకుండటం ఇదే తొలిసారి!

ఇటలీలో జరిగిన జీ7 సదస్సులో భాగంగా ప్రధాని మోదీ- ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీలు కలుసుకున్న కొన్ని రోజులకే ఈ వార్త బయటకు రావడం గమనార్హం. పైగా మోదీ ఇటీవలే రష్యా వెళ్లి, ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ని కలిసిన విషయం తెలిసిందే.

2024 లోక్​సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీ మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉక్రెయిన్​లో పర్యటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని మోదీ అంగీకరించినట్టు, త్వరలో ఉక్రెయిన్​కి వెళ్లనున్నట్టు సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

భారత్​కు రష్యా చిరకాల మిత్రదేశం. కానీ రష్యా- ఉక్రెయిన్​ యుద్ధాన్ని మోదీ వ్యతిరేకిస్తూ వచ్చారు. 2022 సెప్టెంబర్​లో పుతిన్​తో జరిపిన ద్వైపాక్షిక చర్చల సమయంలోనూ ఉక్రెయిన్​ విషయాన్ని ప్రస్తావించారు. ఇది యుద్ధం చేయాల్సిన సమయం కాదని పుతిన్​కి చెప్పారు. యుద్ధాన్ని ముగించాలని పిలుపునిచ్చారు. మోదీ చర్యల పట్ల అప్పట్లో ప్రపంచ దేశాధినేతల నుంచి ప్రశంసలు లభించాయి.

ఇక ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీతోనూ మోదీ ఎప్పటికప్పుడు టచ్​లో ఉంటున్నారు. ఈ ఏడాది మార్చ్​లో జెలెన్​స్కీతో ఆయన ఫోన్​లో సంభాషించారు. భారత్​- ఉక్రెయిన్​ భాగస్వామ్యం బలోపేతానికి చర్చలు జరిపారు. తాము యుద్ధానికి వ్యతిరేకమని, శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రతిపాదించారు. ఇందుకోసం ఏం చేయడానికైనా, ఏ విధంగా సాయపడటానికైనా సిద్ధమని మోదీ అన్నారు.

యుద్ధం మొదలైనప్పటి నుంచి భారత ప్రభుత్వం ఒకటే వైఖరిని అవలంభించింది. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని, యుద్ధాన్ని ఆపేయాలని రష్యాకు విజ్ఞప్తి చేస్తూ వచ్చింది.

రష్యా-ఉక్రెయిన్​ యుద్ధం..

రష్యా ఆక్రమణలను భరించలేక నాటో చేరాలని ఉక్రెయిన్​ నిర్ణయించుకుంది. ఈ పరిణామాల మధ్య 2022 ఫిబ్రవరిలో, దేశ భద్రత పేరుతో ఉక్రెయిన్​పై రష్యా యుద్ధాన్ని ప్రకటించింది. సరిహద్దును దాటుకుని వెళ్లిన రష్యా సైనికులు, ఉక్రెయిన్​లో విధ్వంసం సృష్టించారు. వాస్తవానికి రష్యా చాలా బలమైన దేశం. ఉక్రెయిన్​పై సునాయాసంగా ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందని భావించింది. కానీ రష్యా దాడిని ఉక్రెయిన్​ అనూహ్య రీతిలో ప్రతిఘటించింది. శక్తికి మించి పోరాటం చేస్తూ వస్తోంది. కానీ రెండేళ్లు గడిచినా రష్యా ఉక్రెయిన్​ యుద్ధానికి ముగింపు పడకపోవడం సర్వత్రా ఆందోళనకు గురుచేస్తోంది. యుద్ధానికి పరిష్కారం ఏంటి? అన్నది అంతుచిక్కడం లేదు.

తదుపరి వ్యాసం