PM Modi meets Zelensky: ‘రష్యా - ఉక్రెయిన్ యుద్ధం అత్యంత అమానవీయం’: జెలెన్ స్కీ తో ప్రధాని మోదీ
PM Modi meets Zelensky: జీ 7 (G7) సదస్సులో పాల్గొనడానికి జపాన్ వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కలిశారు. ఈ మర్యాదపూర్వక భేటీ సందర్భంగా రష్యా - ఉక్రెయిన్ యుద్ధంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
PM Modi meets Zelensky: ప్రపంచంలోని ముఖ్యమైన దేశాల అధినేతలు సమావేశమవుతున్న జీ 7 (G7) సదస్సును తమ వాదనను వినిపించే వేదికగా ఉపయోగించుకోవడం కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ జపాన్ వెళ్లారు. అక్కడ ఆయన భారత ప్రధాని మోదీని కలిశారు. ఫ్రాన్స్, యూఎస్, యూకే, బ్రెజిల్.. తదితర దేశాల అధినేతలతో జెలెన్ స్కీ సమావేశం కానున్నారు. మరోవైపు, జీ 7 (G7) సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పలు దేశాల అధినేతలతో కీలకమైన ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అమెరికా, బ్రిటన్, జపాన్, ఇటలీ, జర్మనీ, కెనడా, ఫ్రాన్స్ సభ్య దేశాలుగా ఉన్న ఈ జీ 7 (G7) సదస్సుకు భారత్ పరిశీలక హోదాలో హాజరవుతోంది.
PM Modi meets Zelensky: రష్యా ఉక్రెయిన్ యుద్ధం అమానవీయం
ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ప్రారంభించిన తరువాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ని భారత ప్రధాని మోదీ నేరుగా కలవడం ఇదే మొదటిసారి. ఈ ఇద్దరు నేతలు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తరువాత పలుమార్లు ఫోన్ లో, వర్చువల్ గా మాట్లాడుకున్నారు. కానీ నేరుగా ఈ జీ 7 (G7) సదస్సు సందర్భంగానే కలుసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ… రష్యా , ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కేవలం ఆ రెండు దేశాలకే కాకుండా, మొత్తం ప్రపంచానికే సవాలుగా మారిందని మోదీ వ్యాఖ్యానించారు. ‘‘ఈ యుద్ధం చాలా పెద్ద సమస్య. ప్రపంచ దేశాలపై ఇది పెను ప్రతికూల ప్రభావం చూపుతోంది’’ అని మోదీ అన్నారు. అలాగే, ఈ యుద్ధం అత్యంత అమానవీయమైనదని పేర్కొన్నారు. ‘‘ఇది ఒక రాజకీయ అంశమో లేక ఆర్థిక పరమైన అంశమో కాదు.. ఈ యుద్ధం మానవీయతకు సంబంధించినది. మానవ విలువలకు సంబంధించినది’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో మోదీ సమావేశమైన విషయాన్ని భారత ప్రధాన మంత్రి కార్యాలయం నిర్ధారించింది.