Ukraine Russia War : పెను విషాదం.. ఆ థియేటర్ పై దాడిలో 300 మంది మృతి..!
26 March 2022, 7:03 IST
- ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రలో ఇదో పెను విషాదం.. కొద్దిరోజుల కిందట మారియుపోల్ లోని ఓ థియేటర్ పై రష్యా దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 300 మంది మృతదేహాలను బయటికి తీసినట్లు ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు.
థియేటర్‌పై రష్యా దాడిలో 300 మంది మృతి!
ఉక్రెయిన్‌లో రష్యా దండయాత్ర కొనసాగుతూనే ఉంది. గత 10 రోజలు కిందట మారియుపోల్‌లో 1300 మందికి పైగా తలదాచుకున్న డ్రామా థియేటర్ పై రష్యా బాంబు దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఆ భవనం పూర్తిగా నేలమట్టమైన సంగతి తెలిసిందే. అయితే ఇందులో కనీసం 300 మందికి పైగా దుర్మరణం పాలైనట్టు ఉక్రెయిన్ అధికార వర్గాలు తెలిపాయి.
‘‘చాలా మంది చిన్నారులు ఈ థియేటర్‌లోనే ఆశ్రయం పొందుతున్నారు. వారిని కాపాండేందుకు ‘చిల్డ్రన్’ అని రష్యన్ భాషలో బోర్డు కూడా పెట్టాం. ఆకాశం నుంచి చూసినా కనిపించేలా ఏర్పాటు చేశాం. అయినా వారి సేనలు దారుణంగా ఈ శిబిరంపై దాడులకు దిగాయి’’ అని ఉక్రెయిన్ పార్లమెంటుకు చెందిన మానవ హక్కుల కమిషనర్ లుడ్మిలా డెనిసోవా వాపోయారు.
మరోవైపు యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. తినేందుకు తిండి దొరక్క స్థానిక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. శవాలను తీసుకెళ్లేవారు కూడా లేకపోవడంతో మారియుపోల్ తరహాలో సామూహిక ఖననాలు జరుగుతున్నాయి. కొందరు శిథిలాల మధ్య బూడిదలో తిరుగుతూ తమవారి కోసం, ఆహారం కోసం వెతుకుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఇక గత నెల 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ప్రారంభమవ్వగా.. 28వ తేదీ నుంచి మారియుపోల్ నగరంపై వరుస దాడులు కొనసాగాయి. గత వారానికి మారుయుపోల్ నగరం 90 శాతానికి పైగా ధ్వంసమైంది.
టాపిక్