తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  North Korea Drones: ఉత్తర కొరియా అమ్ముల పొదిలో మరో అస్త్రం.. ‘ఆత్మాహుతి డ్రోన్స్’

North Korea drones: ఉత్తర కొరియా అమ్ముల పొదిలో మరో అస్త్రం.. ‘ఆత్మాహుతి డ్రోన్స్’

Sudarshan V HT Telugu

15 November 2024, 18:31 IST

google News
  • North Korea drones: యుద్ధ క్షేత్రంలో తమ డ్రోన్ ఆయుధ సామర్ధ్యాన్ని పెంచుకునే దిశగా ఉత్తర కొరియా అడుగులు వేస్తోంది. సాయుధ దళాలకు తోడు డ్రోన్ సామర్థ్యాలను మెరుగుపరచడం కోసం కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఆత్మాహుతి డ్రోన్ల ప్రదర్శనను ఇటీవల నిర్వహించింది.

ఉత్తర కొరియా ఆత్మాహుతి డ్రోన్స్
ఉత్తర కొరియా ఆత్మాహుతి డ్రోన్స్ (AFP)

ఉత్తర కొరియా ఆత్మాహుతి డ్రోన్స్

North Korea drones: ఉత్తర కొరియా తాజా ఆత్మాహుతి డ్రోన్ల ప్రదర్శనను ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పర్యవేక్షించారు. ఉక్రెయిన్ తో యుద్ధంలో రష్యా సాయుధ దళాలకు సాయంగా ఉత్తర కొరియా ఇటీవల తన సైన్యాన్ని మోహరించింది. నలుపు రంగు లెదర్ జాకెట్ ధరించిన కిమ్.. కుర్చీ నుంచి లేచి డ్రోన్లు ఆకాశంలోకి ఎగరడాన్ని వీక్షించినట్లు ప్యాంగ్యాంగ్ ప్రభుత్వ మీడియా శుక్రవారం తెలిపింది. ఈ కార్యక్రమంలో ఉత్తర కొరియా కనీసం మూడు వేర్వేరు డ్రోన్ మోడళ్లను ప్రదర్శించిందని ప్రభుత్వ-మీడియా ఫోటోలను సమీక్షించిన సైనిక నిపుణులు తెలిపారు.

మూడు వేర్వేరు మోడల్స్

ఆ మూడు వేర్వేరు డ్రోన్ మోడళ్లలో రష్యన్లు ఉపయోగించే రాన్చెట్ 3ని పోలిన పెద్ద ఎక్స్-వింగ్ మోడల్ ఒకటి కాగా, మరొకటి చిన్న ఫిక్స్డ్ వింగ్ డ్రోన్ అని సైనిక నిపుణుడు యాంగ్ యూకే తెలిపారు. మరొకటి దీర్ఘశ్రేణి దాడులు చేయగల పెద్ద "థియేటర్-స్థాయి" డ్రోన్ అని వివరించారు. ఈ డ్రోన్లు వివిధ స్థాయిల్లో పేలుడు పదార్ధాలను మోసుకు వెళ్లి, ఆత్మాహుతి డ్రోన్స్ (suicide drones) గా దాడులకు పాల్పడగలవని తెలిపారు.

అటాక్ డ్రోన్ల కీలక పాత్ర

ఉక్రెయిన్, మధ్యప్రాచ్యంలో జరిగిన యుద్ధాల్లో అటాక్ డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి. ఈ మానవ రహిత వాహనాలు ప్రాణాంతక దాడులకు పాల్పడుతున్నాయి. దక్షిణ కొరియా, అమెరికాలతో సాంకేతిక అంతరం దృష్ట్యా ఉత్తర కొరియా వంటి నగదు కొరత ఉన్న దేశానికి ఇవి సాపేక్షంగా చౌకైన మరియు మరింత ప్రభావవంతమైన ఎంపికను సూచిస్తాయి. సాయుధ దళాల డ్రోన్ సామర్థ్యాలను మెరుగుపర్చాలని కిమ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అమెరికా, యూరోప్ దేశాల ఆంక్షల వల్ల రష్యా మినహా ఉత్తర కొరియాకు డ్రోన్ సరఫరాదారుగా నిలిచేందుకు ఏ దేశం కూడా ముందుకురావడం లేదు. ఈ పరిస్థితుల్లో సొంతంగా అటాక్ డ్రోన్ల లైనప్ ను కలిగి ఉండడం ఉత్తర కొరియాకు అత్యవసరం.

భారీగా ఉత్పత్తి..

ఉత్తర కొరియా నియంత పాలకుడు కిమ్ డ్రోన్ ప్రదర్శనలో పాల్గొని, అటాక్ డ్రోన్స్ ను భారీగా ఉత్పత్తి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైన్యాలకు డ్రోన్లు అత్యవసరంగా మారాయని కిమ్ జోంగ్ ఉన్ (kim jong un) అన్నారు. వాటిని స్ట్రైకింగ్ పవర్ లో భాగంగా ఉపయోగించుకోవడం సులువేనని ఆయన అన్నారు. గత ఏడాది కాలంగా రష్యా, ఉత్తర కొరియా దేశాల మధ్య సైనిక బంధం బలపడింది. ప్యాంగ్యాంగ్ కు లేని ఆయుధ పరిజ్ఞానాన్ని మాస్కో అందించగలదు. ఉక్రెయిన్ తో పుతిన్ చేస్తున్న యుద్ధానికి (russia ukraine) ఉత్తరకొరియా మందుగుండు సామగ్రి, క్షిపణులు, దళాలను పంపుతోంది.

తదుపరి వ్యాసం