No snowfall in Gulmarg : గుల్మార్గ్లో కనిపించని 'మంచు'- కశ్మీర్‌కు ఏమైంది?
09 January 2024, 9:34 IST
- No snowfall in Gulmarg : శీతాకాలం అంటే ముందుగా గుర్తొచ్చే కశ్మీర్ గుల్మార్గ్లో డ్రై స్పెల్ నడుస్తోంది! అక్కడ సరిగ్గా మంచు కురవడం లేదు. ఇది పర్యాటకులు, వ్యాపారులను ఇబ్బంది పెడుతోంది.
గుల్మార్గ్లో కనిపించని 'మంచు'- కశ్మీర్‌కు ఏమైంది?
No snowfall in Gulmarg : శీతాకాలం అంటే ప్రకృతి ప్రేమికులకు ముందుగా గుర్తొచ్చే ప్రాంతం.. 'కశ్మీర్'. వింటర్లో మంచు దుప్పటిలో కూరుకుపోయి.. కశ్మీర్ లోయ అందాలు మరింత పెరుగుతాయి. ఈ సమయంలోనే టూరిస్ట్ ప్రాంతాలు పర్యాటకులతో కళకళలాడిపోతూ ఉంటాయి. వీటిల్లో ముఖ్యమైనది.. గుల్మార్గ్. శీతాకాలంలో ఈ ప్రాంతం అందాలు రెట్టింపు అవుతాయి. అందరి బకెట్ లిస్ట్‌లో కచ్చితంగా ఉండే పేరు ఈ గుల్మార్గ్. అలాంటి గుల్మార్గ్లో ప్రస్తుతం మంచు కురవడం లేదు! శీతాకాలం సగం గడిచిపోయినా.. అక్కడ ఈసారి ఇప్పటికీ హిమపాతం సరిగ్గా లేకపోవడం.. అటు పర్యాటకులను, ఇటు టూరిజంపై ఆధారపడి జీవిస్తున్న వ్యాపారులను కలవరపెడుతోంది.
గుల్మార్గ్లో మంచు కురవడం లేదు..!
గుల్మార్గ్లో ప్రస్తుతం డ్రై స్పెల్ కొనసాగుతోంది. మంచు కురువక.. అక్కడి ప్రకృతి ప్రదేశాలు వెలవెలబోతున్నాయి. పర్యాటకంపై ఈ ఎఫెక్ట్ ఇప్పటి వరకు పడలేదు కానీ.. ఇదే కొనసాగితే రానున్న రోజుల్లో కష్టాలు తప్పవని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Gulmarg snowfall news today : "గుల్మార్గ్లో ఎక్కడా మంచు కనిపించడం లేదు. కశ్మీర్ లోయలోని అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఎఫెక్ట్ ప్రస్తుతం టూరిజంపై లేదు. కానీ మంచు ఎంత త్వరగా కురుస్తే అంత మంచిది. లేకపోతే రానున్న రోజుల్లో పర్యటకుల సంఖ్య పడిపోవచ్చు," అని గుల్మార్గ్ టూరిజం అసిస్టెంట్ డైరక్టర్ జావైద్ ఉర్ రెహ్మాన్ తెలిపారు.
కశ్మీర్ టూరిజంలో గుల్మార్గ్కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎల్ఓసీకి అతి సమీపంలో ఉండే ఈ ప్రాంతం.. పీర్ పంజల్ పర్వతాల కిందకు వస్తుంది. కప్ షేప్‌లో ఉండే ఈ లోయ.. అనేక ప్రకృతి అందాలకు నెలవు. 2023లో 1.65 మిలియన్ మంది పర్యటకులు గుల్మార్గ్ని సందర్శించారు. ఇదొక రికార్డ్. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో.. మంచు సరిగ్గా పడకపోవడం భయపెడుతోంది.
Gulmarg snowfall latest news : మరోవైపు.. ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు ఆ ప్రాంతంలో నేషనల్ వింటర్ గేమ్స్ జరగాల్సి ఉంది. మంచు సరిగ్గా లేకపోతే.. వింటర్ స్పోర్ట్స్‌తో పాటు స్కీయింగ్ వంటి అడ్వెంచర్ స్పోర్ట్స్‌కి ఇబ్బందులు వస్తాయి.
ఎల్ నీనో ప్రభావం వల్లే..!
కశ్మీర్లో శీతాకాలం అంటే కఠినంగానే ఉంటుంది. ఉష్ణోగ్రతలు దారుణంగా పతనమైపోతాయి. మరీ ముఖ్యంగా.. 40 రోజుల వింటర్ పీరియడ్, అతి కఠినంగా ఉంటుంది. దీనిని.. చిల్లా-ఐ-కలాన్ అని పిలుస్తారు. డిసెంబర్ 21న ఈ చిల్లా-ఐ-కలాన్ ప్రారంభమైంది. జనవరి 31 వరకు ఉంటుంది. అయితే.. ఎల్ నీనో ఎఫెక్ట్ కారణంగానే ఈసారి సరిగ్గా మంచు కురవడం లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
No snowfall in Kashmir : "గత 3-4 ఏళ్లల్లో కశ్మీర్లో శీతాకాలం చాలా తొందరగా ప్రారంభమైంది. కానీ ఈసారి ఆలస్యమైంది. అందుకే ఇంకా.. అనుకున్నంత స్థాయిలో మంచు కురవడం లేదు. జనవరి 16 వరకు ఇదే పరిస్థితులు కొనసాగొచ్చు. ఎల్ నీనో ఇందుకు కారణం. నవంబర్ నుంచి ఈ ప్రాంతాన్ని ఎల్ నీనో ఇబ్బంది పెడుతోంది. జనవరి చివరి వరకు ఎఫెక్ట్ ఉండొచ్చు. అయితే.. ఎల్ నీనో వచ్చిన ప్రతిసారి డ్రై స్పెల్ కనిపించలేదు. 2022లో, 2018లో, 2015లో ఎల్ నీనో ఎఫెక్ట్ పడింది. కానీ అప్పుడు మంచు బాగానే కురిసింది. ఈసారి మాత్రమే ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి," అని శ్రీనగర్ వాతావరణ విభాగం డైరక్టర్ ముఖ్తర్ అహ్మద్ తెలిపారు.