NEET UG Result 2024: సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. కేంద్రాల వారీగా నీట్ యూజీ ఫలితాలను వెల్లడించిన ఎన్టీఏ
20 July 2024, 21:12 IST
NEET UG Result 2024: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం నీట్ పరీక్ష ఫలితాలను తమ అధికారిక వెబ్ సైట్ exams.nta.ac.in/NEET/, neet.ntaonline.in లలో పోస్ట్ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వివిధ నగరాల్లోని పరీక్ష కేంద్రాల వారీగా ఎన్టీఏ ఈ ఫలితాలను విడుదల చేసింది.
కేంద్రాల వారీగా నీట్ యూజీ ఫలితాలు
NEET UG Result 2024: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) శనివారం వివిధ నగరాల్లోని పరీక్షకేంద్రాల వారీగా నీట్ యూజీ ఫలితాలను తన అధికారిక వెబ్సైట్ exams.nta.ac.in/NEET/, neet.ntaonline.in లలో ప్రచురించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎన్టీఏ ఈ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఏడాది నీట్ యూజీ పరీక్షను 2024 మే 5న నిర్వహించగా, 2024 జూన్ 4న ఫలితాలు విడుదలయ్యాయి. విదేశాల్లోని 14 నగరాలతో సహా 571 నగరాల్లోని 4,750 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు సుమారు 24 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.
జూన్ 23న రీ టెస్ట్
మళ్లీ 2024 జూన్ 23న ఎంపిక చేసిన నీట్ యూజీ (NEET UG) అభ్యర్థులకు రీ టెస్ట్ నిర్వహించగా, 2024 జూన్ 30న ఫలితాలు వెలువడ్డాయి. ఈ పరీక్షకు లీకేజీ జరిగిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు రాసిన మొత్తం 1,563 మంది అభ్యర్థులు హాజరయ్యారు. జూన్ 4న ఫలితాలు వెల్లడైన అనంతరం.. నీట్ యూజీ పరీక్ష నిర్వహణలో పేపర్ లీకేజీ, అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా, పలు కేంద్రాల్లో సమయం వృథాను భర్తీ చేసేందుకు అభ్యర్థులకు గ్రేస్ మార్కులు కేటాయించడంతో సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. భారతదేశంలోని ఆరు కేంద్రాల్లో, పరీక్ష షెడ్యూల్ కంటే ఆలస్యంగా ప్రారంభం కావడం వల్ల ఆ పరీక్ష కేంద్రాల్లో పరీక్ష రాసిన విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చారు. ఇది కూడా వివాదాస్పదమైంది. అనంతరం, ఈ గ్రేస్ మార్కులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆ గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది అభ్యర్థులకు ఆప్షనల్ రీటెస్ట్ నిర్వహించాలని ఎన్టీఏను ఆదేశించింది.
సుప్రీంకోర్టు ఆదేశాలు.
ఈ నేపథ్యంలో, రెండు రోజుల క్రితం, అభ్యర్థుల వివరాలు వెల్లడించకుండా, పరీక్ష కేంద్రాల వారీగా నీట్ యూజీ ఫలితాలను ప్రచురించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇతర చోట్ల పరీక్ష రాసిన వారి కంటే ఆరోపణలు ఎదుర్కొన్న కేంద్రాల్లో హాజరైన అభ్యర్థులకు ఎక్కువ మార్కులు వచ్చాయో లేదో తెలుసుకోవడం కోసం సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఫలితాలను విడుదల చేయాలని ఎన్టీఏను సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఎన్టీఏ అభ్యర్థన మేరకు శనివారం మధ్యాహ్నం వరకు గడువు ఇచ్చింది. దాంతో, శనివారం మధ్యాహ్నం ఆ ఫలితాలను ఎన్టీఏ వెల్లడించింది.
రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి.
- ముందుగా ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ లైన exams.nta.ac.in/NEET/, లేదా neet.ntaonline.in లలో ఒకదాన్ని ఓపెన్ చేయండి.
- హోమ్ పేజీలో కనిపిస్తున్న నీట్ యూజీ రిజల్ట్ 2024 లింక్ పై క్లిక్ చేయండి.
- లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయండి.
- సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
- మీ రిజల్ట్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
- ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం హార్డ్ కాపీని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి.