NEET UG 2024 row: ‘నీట్ యూజీలో గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థుల ర్యాంక్స్ ను సమీక్షిస్తాం’: ఎన్టీఏ డీజీ-neet ug 2024 row grace marks awarded may be revised says nta dg subodh singh ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Neet Ug 2024 Row: ‘నీట్ యూజీలో గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థుల ర్యాంక్స్ ను సమీక్షిస్తాం’: ఎన్టీఏ డీజీ

NEET UG 2024 row: ‘నీట్ యూజీలో గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థుల ర్యాంక్స్ ను సమీక్షిస్తాం’: ఎన్టీఏ డీజీ

HT Telugu Desk HT Telugu
Jun 08, 2024 04:01 PM IST

NEET UG 2024 row: నీట్ యూజీలో గ్రేస్ మార్కులపై సమీక్ష జరుపుతామని, గ్రేస్ మార్కులు పొందిన నీట్ అభ్యర్థుల ఫలితాలను సవరించే అవకాశం ఉందని ఎన్టీఏ డీజీ సుబోధ్ సింగ్ తెలిపారు. అయితే, ఇది నీట్ యూజీ అడ్మిషన్ ప్రక్రియపై ప్రభావం చూపబోదని వివరించారు.

నీట్ యూజీలో గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థుల ర్యాంక్స్ పై సమీక్ష
నీట్ యూజీలో గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థుల ర్యాంక్స్ పై సమీక్ష

NEET UG 2024 row: నీట్ యూజీ 2024 ఫలితాల్లో కొందరికి అనూహ్యంగా ఎక్కువ మార్కులు రావడంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నారు. ఈ నిరసనల నేపథ్యంలో, 1,500 మందికి పైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను సమీక్షించడానికి విద్యాశాఖ నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ అధ్యయనం అనంతరం, గ్రేస్ మార్కులు పొందిన ఆ 1500 లకు పైగా ఉన్న విద్యార్థుల ఫలితాలను సవరించే అవకాశం ఉందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) శనివారం తెలిపింది.

వారం రోజుల్లో నిర్ణయం

యూపీఎస్సీ మాజీ చైర్మన్ నేతృత్వంలోని కమిటీ వారం రోజుల్లో తన సిఫారసులను సమర్పిస్తుందని, అనంతరం, గ్రేస్ మార్కులు పొందిన అభ్యర్థుల ఫలితాలను సవరించవచ్చని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్ తెలిపారు. గ్రేస్ మార్కులు ఇవ్వడం వల్ల పరీక్ష అర్హత ప్రమాణాలపై ప్రభావం పడబోదని, ప్రభావిత అభ్యర్థుల ఫలితాల సమీక్ష అడ్మిషన్ ప్రక్రియపై ప్రభావం చూపదని ఆయన తెలిపారు.

పరీక్ష పేపర్ లీక్ కాలేదు

‘‘ప్రతి విషయాన్ని పారదర్శకంగా విశ్లేషించి నీట్ యూజీ 2024 ఫలితాలను ప్రకటించాం. మొత్తం 4,750 కేంద్రాల్లో 6 కేంద్రాలకే ఈ సమస్య పరిమితం అయింది. అలాగే, 24 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కాగా, అందులో 1,600 మంది విషయంలోనే సమస్య ఉంది. దేశవ్యాప్తంగా ఈ పరీక్ష సమగ్రతకు భంగం వాటిల్లలేదు. ఏ పరీక్ష కేంద్రంలో కూడా పేపర్ లీకేజీ జరగలేదు’’ అని ఎన్ టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. ‘‘ప్రశ్నాపత్రాలు సక్రమంగా పంపిణీ చేయకపోవడంతో సుమారు ఆరు కేంద్రాల్లో సుమారు 16 వందల మంది అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. తమకు తక్కువ సమయం లభించిందని ఆ పరీక్షా కేంద్రాల్లో నీట్ యూజీ (Neet UG) రాసిన విద్యార్థులు ఆరోపించారు’’ అని సింగ్ తెలిపారు.

మళ్లీ పరీక్ష పెట్టాలి

కొందరు విద్యార్థులకు గ్రేస్ మార్క్స్ పేరిట మార్కులను పెంచడంపై నీట్ యూజీ 2024 రాసిన ఇతర విద్యార్థులు మండిపడ్తున్నారు. మళ్లీ నీట్ యూజీ 2024 పరీక్షను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఏ ఫిర్యాదుల పరిష్కార కమిటీని ఏర్పాటు చేసిందని సింగ్ తెలిపారు. ‘‘ఆరు కేంద్రాలకు చెందిన సుమారు 1,600 మంది అభ్యర్థుల టైమ్ లాస్ వివరాలను ఆ కమిటీ పరిశీలించింది. 2018లో అమలు చేసిన విధివిధానాలు, సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా వారు పలు సిఫార్సులు చేశారు. దాని ఆధారంగానే కాంపెన్సేటరీ మార్కులు ఇచ్చా. దానిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి’’ అన్నారు.

ఒకే పరీక్ష కేంద్రంలోని ఆరుగురికి టాప్ ర్యాంక్స్

మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ (Neet UG) లో గ్రేస్ మార్కుల వల్ల ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు సహా 67 మందికి టాప్ ర్యాంక్స్ వచ్చాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

Whats_app_banner