Telangana Govt : గుడ్ న్యూస్ - ఆ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి రూ. లక్ష ఆర్థిక సాయం - కొత్త స్కీమ్ ప్రారంభం
Rajiv Gandhi Civils Abhayahastam Scheme: తెలంగాణ ప్రభుత్వం మరో స్కీమ్ ను పట్టాలెక్కింది. శనివారం 'రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం' పథకాన్ని ప్రారంభించింది.
Rajiv Gandhi Civils Abhayahastam Scheme: సివిల్స్ కు ప్రిపేర్ అయ్యే వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్థిక తోడ్పాటును అందించేందుకు ‘రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ను శనివారం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజాభవన్‌లో ప్రారంభించారు.
సివిల్స్ ప్రిలిమ్స్‌కు ఎంపికైన అభ్యర్థుల కోసం ఉద్దేశించిన స్కీమ్ ఇది. ఈ పథకం కింద ఎంపికైన పేద అభ్యర్థులకు ఒక లక్ష రూపాయల మేర ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు. సింగరేణి సంస్థ ద్వారా ఈ స్కీమ్ ను అమలు చేయనున్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగిందన్నారు. త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందన్న ఆయన… నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని చెప్పారు. అందుకే అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని చెప్పారు. అంతకుముందు సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన రాష్ట్ర అభ్యర్థులతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు.
జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం - సీఎం రేవంత్
“గత పదేళ్లలో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగింది. యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని మార్పులు చేశాం. గ్రూప్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వాహించాం... డీఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయి. నిరుద్యోగుల ఇబ్బందులను గుర్తించి గ్రూప్2 పరీక్ష వాయిదా వేశాం. ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే. పకడ్బందీ ప్రణాళికతో పరీక్షలు సమర్ధవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టనున్నాం. ఇక నుంచి ప్రతీ ఏటా మార్చ్ లోగా అన్ని శాఖలలో ఖాళీల వివరాలు తెప్పించుకుంటాం. జూన్ 2లోగా నోటిఫికేషన్ వేసి డిసెంబర్ 9లోగా నియామక ప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటాం" అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సింగరేణి సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గ్రూప్ 1 అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్
గ్రూప్-1 (మెయిన్స్) పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ ప్రకటించింది. ఉచిత శిక్షణ పొందాలనుకునే అభ్యర్థులు తమ దరఖాస్తును www.tgbcstudycircle.cgg.gov.in లో సమర్పించాలి.
75 రోజులపాటు నిర్వహించే శిక్షణ ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని నైపుణ్యాభివృద్ది శిక్షణ కేంద్రం (టీజీ బీసీఈఎస్‌డీటీసీ) డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శిక్షణ పొందాలనుకునే అభ్యర్థులు తమ దరఖాస్తును www.tgbcstudycircle.cgg.gov.in లో సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.
గ్రూప్-1 మెయిన్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసే అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.5 లక్షల్లోపు ఉండాలి. రోల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఉచిత శిక్షణకు అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఉచిత శిక్షణకు ఎంపికైన వారికి శిక్షణా కాలంలో నెలకు రూ.5000 ఉపకార వేతనం (బుక్ ఫండ్, రవాణా సహా) అందజేస్తారు.
గ్రూప్-1 మెయిన్స్ ఉచిత శిక్షణ హైదరాబాద్ సైదాబాద్‌లోని టీజీ బీసీ స్టడీ సర్కిల్ (రోడ్ నెం: 8, లక్ష్మీనగర్), ఖమ్మంలోని టీజీ బీసీ స్టడీ సర్కిల్‌లో అందజేస్తారు. మరింత సమాచారం కోసం అభ్యర్థులు ఈ 040-24071188 నెంబర్ సంప్రదించవచ్చు.
xతెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. మెయిన్స్కు 1:50 రేషియోలో అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. మొత్తం 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. మరోవైపు ఇప్పటికే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైంది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. గ్రూప్-1 మెయిన్స్ లో ఆరు పేపర్లు ఉంటాయి.