NEET UG 2024: సెంటర్ల వారీగా నీట్-యూజీ ఫలితాలను వెల్లడించండి: ఎన్టీఏకు సుప్రీంకోర్టు ఆదేశం
NEET UG 2024: అభ్యర్థుల వివరాలను వెల్లడించకుండా నీట్-యూజీ ఫలితాలను కేంద్రాల వారీగా ప్రకటించాలని ఎన్టీఏను సుప్రీంకోర్టు ఆదేశించింది. నీట్ యూజీ 2024 అవకతవకలపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలను వెలువరించింది.
NEET UG 2024: నగరాల వారీగా, కేంద్రాల వారీగా నీట్-యూజీ 2024 ఫలితాలను జులై 20 మధ్యాహ్నం 12 గంటల్లోగా ప్రకటించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ను సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. ఫలితాలను వెల్లడించే సమయంలో విద్యార్థుల వివరాలను బహిర్గతపర్చవద్దని స్పష్టం చేసింది. నీట్ యూజీ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ నెల 22న వాదనలు పునఃప్రారంభం
పరీక్ష నిర్వహణ మొత్తం ప్రక్రియ పవిత్రతకు భంగం కలిగించిందనే నిర్ధారణకు వస్తేనే నీట్ యూజీని రద్దు చేసి, మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశిస్తామని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. మే 5న జరిగిన ప్రతిష్టాత్మక పరీక్షలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై రద్దు, పునఃపరిశీలన, కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ నెల 22న వాదనలు పునఃప్రారంభించనుంది. ప్రశ్నాపత్రం లీక్ కావడం, రద్దు, పునఃపరిశీలన సహా పరీక్ష నిర్వహణలో భారీ అవకతవకలు జరిగాయన్న తమ వాదనను నిరూపించాలని అభ్యర్థుల తరఫు న్యాయవాదిని ధర్మాసనం కోరింది.
పాట్నా, హజారీబాగ్ లకే పరిమితం
ప్రశ్నాపత్రం లీకేజీ పాట్నా, హజారీబాగ్ లకే పరిమితమైనట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని, గుజరాత్ లోని గోద్రాలో కూడా లీకేజీ జరిగి ఉండవచ్చని కోర్టు అభిప్రాయపడింది. పాట్నా, హజారీబాగ్ లలో ప్రశ్నాపత్రాలు లీక్ కాగా, గోద్రాలో కొందరు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను నింపేందుకు పరీక్ష నిర్వహించిన వ్యక్తి డబ్బులు తీసుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.
'టెలిగ్రామ్'లో ప్రశ్నాపత్రం లీక్
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ 'టెలిగ్రామ్'లో ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందనే వాదనలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నీట్-యూజీ పిటిషన్లకు ముందు లిస్ట్ చేసిన కేసులను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ‘‘మేము ఈ రోజు కేసును ప్రారంభిస్తాము. లక్షలాది మంది యువ విద్యార్థులు దీని కోసం ఎదురు చూస్తున్నారు’’ అని వ్యాఖ్యానించింది. పేపర్ లీకేజీ వ్యవస్థాగతంగా జరిగిందని, మొత్తం పరీక్షపై ప్రభావం చూపిందని నిరూపించాలని పిటిషనర్లను ధర్మాసనం కోరింది. నీట్-యూజీ 2024 (NEET UG 2024)ను రద్దు చేయాలని, మళ్లీ పరీక్ష నిర్వహించాలని, అవకతవకలపై దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణను జూలై 18వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
23.33 లక్షల మంది విద్యార్థులు
14 విదేశాలతో సహా 571 నగరాల్లోని 4,750 కేంద్రాల్లో మే 5న 23.33 లక్షల మంది విద్యార్థులు నీట్ యూజీ (NEET UG) పరీక్ష రాశారు. గతంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లలో కేంద్రం, ఎన్టీఏ ఈ పరీక్షను రద్దు చేయడం ప్రతికూలమని, పెద్ద ఎత్తున గోప్యత ఉల్లంఘనకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేనప్పుడు లక్షలాది మంది నిజాయితీపరులైన అభ్యర్థులను తీవ్రంగా దెబ్బతీస్తుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ తదితర సంబంధిత కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ (NEET UG)ను ఎన్టీఏ నిర్వహిస్తుంది.