నీట్ యూజీ పరీక్షలో సామూహిక మాల్‌ప్రాక్టిస్ జరగలేదు.. టెలిగ్రామ్ వీడియో ఫేక్ : సుప్రీం కోర్టుతో కేంద్రం-no mass malpractice in neet exam centre to supreme court iit madras report on neet ug 2024 exam paper leaked ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  నీట్ యూజీ పరీక్షలో సామూహిక మాల్‌ప్రాక్టిస్ జరగలేదు.. టెలిగ్రామ్ వీడియో ఫేక్ : సుప్రీం కోర్టుతో కేంద్రం

నీట్ యూజీ పరీక్షలో సామూహిక మాల్‌ప్రాక్టిస్ జరగలేదు.. టెలిగ్రామ్ వీడియో ఫేక్ : సుప్రీం కోర్టుతో కేంద్రం

Anand Sai HT Telugu
Jul 11, 2024 06:02 AM IST

NEET UG 2024 Exam : కేంద్ర ప్రభుత్వం NEET-UG 2024 రీటెస్ట్ డిమాండ్‌ను వ్యతిరేకిస్తుంది. పేపర్ లీక్‌లో కేవలం 47 మంది అనుమానితులేనని NTA ధృవీకరిస్తోంది. సామూహిక మాల్ ప్రాక్టిస్ జరగలేదని సుప్రీం కోర్టుకు కేంద్రం చెప్పింది.

సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టు

NEET-UG 2024 పునఃపరీక్ష చేయాలనే డిమాండ్‌కు వ్యతిరేకంగా IIT-మద్రాస్ నుండి వచ్చిన సమగ్ర నివేదిక అభ్యర్థుల అవకతవకలు, అక్రమ ప్రయోజనాల ఆరోపణలను కొట్టివేసిందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ను సమర్పించింది. ఐఐటీ-మద్రాస్ డేటా విశ్లేషణలోని కీలకాంశాలను ప్రస్తావించింది. పరీక్షా ప్రక్రియ సమగ్రతను, దాని పవిత్రతను నిర్ధారించడానికి తీసుకున్న చర్యలను కేంద్రం నొక్కిచెప్పింది.

ఇదే విషయానికి మద్దతు ఇస్తూ.. నీట్‌ను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కూడా అత్యున్నత న్యాయస్థానంలో విడిగా అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఇప్పటివరకు కేవలం 47 మంది అభ్యర్థులు, అంటే పాట్నాలో 17 మంది, గోద్రాలో 30 మంది మాత్రమే అనుమానితులుగా ఉన్నారని స్పష్టం చేసింది. పేపర్ లీక్, OMR షీట్‌లకు సంబంధించిన అక్రమాలు.. గురువారం విచారణ సందర్భంగా ఐఐటీ మద్రాస్ నివేదికలోని ఫలితాలపై ఆధారపడతామని కూడా ఎన్టీఏ కోర్టుకు తెలిపింది.

మే 4న టెలిగ్రామ్‌లో లీక్ అయిన నీట్-యూజీ పరీక్ష పేపర్ ఫోటోను చూపించే వీడియో నకిలీదని ఏజెన్సీ పేర్కొంది. 'టెలిగ్రామ్ ఛానెల్‌లోని చర్చలు సభ్యులు వీడియోను నకిలీగా గుర్తించారని సూచిస్తున్నాయి. లీక్ గురించి తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించడానికి టైమ్‌స్టాంప్ మార్చారు. సోషల్ మీడియాలో వ్యాఖ్యలు, చర్చలు వీడియోలోని చిత్రాలు మార్చారు. తేదీని ఉద్దేశపూర్వకంగా సవరించారు. స్క్రీన్‌షాట్‌లు వీడియోలో చేసిన క్లెయిమ్‌ల కల్పితంగా ఉన్నాయి.' అని అఫిడవిట్ పేర్కొంది.

కేంద్రం అఫిడవిట్ ప్రకారం.. ఉన్నత విద్యా శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ, NEET-UG 2024 ఫలితాల సవివరమైన డేటా విశ్లేషణను నిర్వహించవలసిందిగా ఐఐటి-మద్రాస్‌ను అభ్యర్థించింది. అనుమానిత కేసులను గుర్తించి, అత్యుత్తమ పనితీరు కనబరిచిన అభ్యర్థులు ఎంతమంది ఉన్నారని అంచనా వేసింది.

IIT-మద్రాస్ అసాధారణ విషయాలను గుర్తించడానికి 2023, 2024కి సంబంధించి టాప్ 140,000 ర్యాంక్‌లను సమగ్రంగా విశ్లేషించింది. ఈ విశ్లేషణ మాల్‌ప్రాక్టీస్ కారణంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులకు కలిగిన ప్రయోజనాలను చూపుతున్నాయో లేదో గుర్తించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్రం తెలిపింది.

అయితే జూలై 10 నాటి విశ్లేషణ నివేదికలో సామూహిక మాల్‌ప్రాక్టీస్ లేదా ఎక్కువ మంది అభ్యర్థులు లబ్ధి పొందుతున్నట్లు ఎలాంటి సూచనలు వెల్లడించలేదు. అధిక మార్కుల అనేవి వివిధ నగరాలు, కేంద్రాలలో స్థిరంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.

'సామూహిక మాల్‌ప్రాక్టీస్‌కు సంబంధించిన సూచనలేవీ లేవని లేదా అభ్యర్థులకు అసహజ స్కోర్‌లకు దారితీసే లబ్ది చేకూర్చడం లేదని విశ్లేషణ చూపిస్తుంది. విద్యార్థులు పొందిన మార్కులలో మొత్తం పెరుగుదల ఉంది. ఈ పెరుగుదల నగరాలు, కేంద్రాలలో కనిపిస్తుంది. సిలబస్‌లో 25 శాతం తగ్గింపు దీనికి కారణమని చెప్పవచ్చు. అధిక మార్కులు పొందిన అభ్యర్థులు చాలా నగరాలు, చాలా కేంద్రాలలో ఉన్నారు. దుర్వినియోగానికి ఆస్కారం చాలా తక్కువగా ఉంది.' అని అఫిడవిట్ పేర్కొంది.

భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలకు అనుగుణంగా అఫిడవిట్ సమర్పించారు. ఈ అఫిడవిట్ పునఃపరీక్ష సమస్యను నొక్కి చెప్పింది. వనరుల వృథా, అకడమిక్ క్యాలెండర్‌కు అంతరాయం కలిగించడం, లక్షలాది మంది నిజాయితీగల విద్యార్థుల కెరీర్ అవకాశాలకు నష్టం వాటిల్లకుండా చేసేందుకు కేంద్రం చూస్తుంది. తప్పు చేసిన వారిని సమర్థవంతంగా గుర్తించగలరా అనేది చూడాల్సి ఉంది.

WhatsApp channel

టాపిక్