NEET PG : ‘నిస్సహాయ స్థితిలో మోదీ’- ప్రధానిపై రాహుల్ గాంధీ ఫైర్..
23 June 2024, 10:38 IST
- Rahul Gandhi attacks Centre : నీట్ పీజీ వాయిదా నేపథ్యంలో కేంద్రంపై, ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు రాహుల్ గాంధీ. దేశ భవిష్యత్తును కాపాడాలన్నారు.
రాహుల్ గాంధీ..
NEET PG postponed : నీట్ పీజీ 2024 వాయిదా పడిన నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ. పేపర్ లీక్ రాకెట్, ఎడ్జ్యుకేషన్ మాఫియా ముందు.. మోదీ నిస్సహాయ స్థితిలో నిలబడ్డారని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుకు బీజేపీ ప్రభుత్వం చాలా ప్రమాదకరం అన్నారు.
"ఇప్పుడు నీట్ పీజీ పరీక్ష వాయిదా పడింది! నరేంద్ర మోదీ పాలనలో విద్యా వ్యవస్థ ఎలా నాశనం అయ్యిందో చెప్పేందుకు ఇది మరొక ఉదాహరణ," అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ.
"ఏం జరిగినా నిశ్సబ్దంగా చూస్తూ ఉండిపోతరు మోదీ. ఇప్పుడు.. పేపర్ లీక్ రాకెట్, ఎడ్జ్యుకేషన్ మాఫియా ముందు నిస్సహాయంగా ఉండిపోయారని స్పష్టమైంది. ఆయన ప్రభుత్వం.. విద్యార్థుల భవిష్యత్తుకు పెను ప్రమాదం. దేశ భవిష్యత్తును మనం రక్షించాలి," అని రాహుల్ గాంధీ అన్నారు.
Rahul Gandhi on NEET PG : ఆదివారం జరగాల్సిన నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ నీట్ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు శనివారం రాత్రి ఓ ప్రకటన ద్వారా తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. పరీక్ష తేదీని త్వరలో వెల్లడిస్తామని స్పష్టం చేసింది.
"తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకుని.. పోటీ పరీక్షల సమగ్రతను కాపాడేందుకు, నీట్ పీజీని పూర్తిస్థాయిలో అసెస్ చేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అంందుకే.. పరీక్షను వాయిదా వేస్తున్నాము," అని సంబంధిత ప్రకటన వెల్లడించింది.
నీట్ యూజీ 2024 చుట్టూ తీవ్ర స్థాయిలో వివాదం నెలకొంది. అంతేకాదు.. యూజీసీ-నెట్ పరీక్ష ప్రశ్నాపత్రం డార్క్ నెట్, టెలిగ్రామ్ లలో చలామణి అయినట్లు తేలడంతో ప్రభుత్వం దానిని గత వారం రద్దు చేసింది.
నీట్‌లో అవకతవకలపై సీబీఐ దర్యాప్తు..
NEET UG paper leak : నీట్ యూజీ 2024పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పోటీ పరీక్షల్లో అవకతవకలపై విమర్శలు ఎదుర్కొంటున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) చీఫ్‌ను తొలగించడం, సంస్థ పనితీరును సమీక్షించడానికి ఒక ప్యానెల్ ఏర్పాటు చేయడం, నీట్-యూజీ అవకతవకలపై దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించడం వంటి పలు నిర్ణయాలను శనివారం ప్రకటించింది.
అంతేకాదు.. పేపర్ లీక్‌కు సంబంధించి ఒక కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. శుక్రవారం అమల్లోకి వచ్చిన ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్ 2024 ప్రకారం.. పేపర్ లీక్‌లకు బాధ్యులుగా తేలినా, ఆన్సర్ షీట్‌ని టాంపర్ చేశారని రుజువైనా.. సంబంధిత వారిపై 3ఏళ్ల శిక్ష పడుతుంది. తీవ్రత బట్టి దీనిని 5ఏళ్ల వరకు పొడగించవచ్చు. పైగా.. ఇవన్నీ నాన్-బెయిలెబుల్ నేరాలుగా పరిగణిస్తారు.
పేపర్ లీక్ వ్యవహారం తెలిసినా, అధికారులకు సమాచారం ఇవ్వన్ని ఎగ్జామినేషన్ సర్వీస్ ప్రొవైడర్లకు.. తాజా చట్టం ప్రకారం రూ. 1 కోటి వరకు జరిమానా పడుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.