Mumbai Times tower : ముంబై టైమ్స్ టవర్‌లో భారీ అగ్ని ప్రమాదం
06 September 2024, 9:46 IST
- ముంబై లోయర్ పరేల్‌లోని కమలా మిల్ కాంపౌండ్‌లో ఉదయం 6.30 గంటలకు మంటలు చెలరేగాయని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
ముంబై టైమ్స్ టవర్‌లో అగ్ని ప్రమాదం
ముంబైలోని ఏడు అంతస్తుల వాణిజ్య భవనం టైమ్స్ టవర్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లోయర్ పరేల్‌లోని కమలా మిల్ కాంపౌండ్‌లో శుక్రవారం ఉదయం 6.30 గంటలకు మంటలు చెలరేగాయని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు తెలిపారు.
అగ్నిమాపక సిబ్బంది దీనిని లెవల్ 2 (మేజర్) అగ్ని ప్రమాదంగా వర్గీకరించి తొమ్మిది ఫైరింజన్లు, ఇతర అగ్నిమాపక వాహనాలను సంఘటనా స్థలానికి పంపించారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు.
14 అంతస్తుల వాణిజ్య భవనం వెనుక భాగంలో 3వ అంతస్తు నుంచి 7వ అంతస్తు వరకు ఉన్న ఎలక్ట్రిక్ డక్ట్కి మంటలు అంటుకున్నట్లు అధికారులు తెలిపారు.
మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక సిబ్బంది కృషి చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలోకి వెళ్లాయి.
టైమ్స్ టవర్‌లో అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు చెబుతున్నారు.
ఇదీ చూడండి:- IIT Bombay: 8,000 మంది ఐఐటియన్లకు ఉద్యోగాల్లేవు.. రూ. 4 లక్షలకు పడిపోయిన కనీస వార్షిక వేతనం
ముంబైలో అగ్ని ప్రమాదాలు తరచూ వార్తల్లో నిలిస్తున్నాయి. డిసెంబర్ 29, 2017న అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో కమలా మిల్స్ కాంపౌండ్‌లోని మోజోస్ బిస్ట్రో రెస్టారెంట్‌కు మంటలు వ్యాపించిన ఘటనను ఇంకా అక్కడి ప్రజలు మర్చిపోలేదు. నాడు.. 14 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
రెస్టారెంట్ల యజమానులు, వాటి ఉద్యోగులు, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు, మిల్లు యజమానులు సహా మొత్తం 14 మందిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.
2017 అగ్నిప్రమాదం కేసులో నమోదైన కమలా మిల్స్ కాంపౌండ్ యజమానులు రమేష్ గోవాని, రవి భండారీలను ముంబై సెషన్స్ కోర్టు 2020 నవంబర్ 10న నిర్దోషులుగా ప్రకటించింది.
నిందితులందరిపై మహారాష్ట్ర ఫైర్ ప్రివెన్షన్ అండ్ లైఫ్ సేఫ్టీ మెజర్స్ యాక్ట్ 2006లోని సంబంధిత నిబంధనల ప్రకారం హత్యానేరం కింద అభియోగాలు మోపారు.
నాలుగు ఫైరింజన్లు, ఒక మొబైల్ ఫైర్ టెండర్ (ఎంఎఫ్టీ), ఒక క్విక్ రెస్పాన్స్ వెహికల్ (క్యూఆర్వీ), ఒక ఏరియల్ వర్క్ ప్లాట్ఫామ్ (ఏడబ్ల్యూటీటీ), రెండు జెట్ ట్యాంకులు (జేటీ), ఒక టర్న్ టేబుల్ లాడర్ (టీటీఎల్) ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి 26న ముంబైలోని ఓ వాణిజ్య కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించిగా 37 మందిని రక్షించారు. శాంతాక్రూజ్ వెస్ట్‌లోని ఆప్షన్స్ కమర్షియల్ సెంటర్ లో సాయంత్రం 5.22 గంటలకు అగ్నిప్రమాదం జరిగినట్లు ముంబై అగ్నిమాపక దళానికి (ఎంఎఫ్ బీ) ఫోన్ వచ్చింది.
రెండు బేస్మెంట్ లెవల్స్, గ్రౌండ్ ఫ్లోర్, రెండు- పై అంతస్తుల వరకు విస్తరించి ఉన్న వాణిజ్య భవనంలోని రెండో అంతస్తులో విద్యుత్ వైరింగ్, ఇన్స్టాలేషన్లకు మాత్రమే మంటలు పరిమితమయ్యాయి.
ముంబై భవనాలకు అగ్ని ప్రమాదంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించే విధంగా చూసుకోవాలని అభిప్రాయపడుతున్నారు.