Crime news: వడాపావ్ కోసం ఆగితే.. రూ. 5 లక్షల విలువైన నగలు పోయాయి.. ముంబై లో వృద్ధ దంపతుల విషాదం-man steals gold jewellery worth rs 4 9 lakh as pune couple stops to eat vada pav ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News: వడాపావ్ కోసం ఆగితే.. రూ. 5 లక్షల విలువైన నగలు పోయాయి.. ముంబై లో వృద్ధ దంపతుల విషాదం

Crime news: వడాపావ్ కోసం ఆగితే.. రూ. 5 లక్షల విలువైన నగలు పోయాయి.. ముంబై లో వృద్ధ దంపతుల విషాదం

Sudarshan V HT Telugu
Aug 31, 2024 07:25 PM IST

Mumbai Crime news: ముంబైలో ఒక జంట బ్యాంక్ లోని తన నగలు విడిపించుకుని, స్కూటర్ పై ఇంటికి వస్తూ, దార్లో వడాపావ్ తిందామని ఆగారు.వారి నుంచి ఇద్దరు దొంగలు రూ.4.95 లక్షల విలువైన నగలను అపహరించారు. దంపతులు బ్యాంకు నుంచి తిరిగి వస్తుండగా బస్టాప్ సమీపంలో ఈ చోరీ జరిగింది.

వడాపావ్ కోసం ఆగితే.. రూ. 5 లక్షల విలువైన నగలు పోయాయి..
వడాపావ్ కోసం ఆగితే.. రూ. 5 లక్షల విలువైన నగలు పోయాయి..

Mumbai Crime news: హడప్సర్ లో ఓ వృద్ధ దంపతుల నుంచి గుర్తుతెలియని ఇద్దరు దొంగలు రూ.4.95 లక్షల విలువైన 190 గ్రాముల ఆభరణాలను అపహరించారు. బాధితులు బ్యాంక్ లో తనఖా పెట్టిన బంగారు ఆభరణాలను రుణం చెల్లించి, తిరిగి తీసుకువెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

వడాపావ్ కోసం..

షెవాలేవాడి ప్రాంతంలోని పీఎంపీఎంఎల్ బస్టాప్ సమీపంలో మధ్యాహ్నం 3.45 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంజరిలోని వైట్ ఫీల్డ్ సొసైటీకి చెందిన దశరథ్ ధమానే (69), ఆయన భార్య జయ శ్రీ గురువారం ఒక జాతీయ బ్యాంకులో తనఖా ఉన్న తమ 190 గ్రాముల బంగారు నగలను విడిపించుకుని స్కూటర్ పై ఇంటికి తీసుకువెళ్తున్నారు. ఇంటికి తిరిగి వస్తుండగా దారిలోని ఒక చాట్ భండార్ వద్ద వడాపావ్ తిందామని ఆ దంపతులు ఆగారు. వడాపావ్ కోసం ఆ బండి వద్దకు వెళ్లిన ధమానే తన భార్యను స్కూటర్ వద్దనే ఉండమని కోరాడు.

డబ్బు పడిపోయిందని చెప్పి..

ఆ సమయంలో ముసుగు ధరించిన ఓ వ్యక్తి జయశ్రీ వద్దకు వచ్చి ‘మీ డబ్బు అక్కడ నేలపై పడి ఉంది’ అని చూపించాడు. దాంతో ఆమె ఆ డబ్బులు తీసుకోవడానికి అక్కడికి వెళ్లింది. ఈ లోగా ఆ స్కూటర్ సమీపంలో నిల్చున్న మరో వ్యక్తి స్కూటర్ లో నుంచి నగలను ఉంచిన బ్యాగును తీసుకుని పరారయ్యాడు. వడాపావ్ తీసుకుని తిరిగి వస్తున్న దశరథ్ ధమానే ఇది చూసి ‘దొంగ.. దొంగ. పట్టుకోండి’ అని అరిచాడు. కానీ, ఆ దొంగ క్షణాల్లో మాయమయ్యాడు.

పోలీసు కేసు

దీనిపై దశరథ్ ధమానే దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హడాప్సర్ పోలీసులు నిందితుడి కోసం గాలింపు ప్రారంభించారు. నిందితుడిని గుర్తించడానికి సిసిటివి ఫుటేజీని పరిశీలిస్తున్నారు. రెండు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టామని హడాప్సర్ పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని నిందితులపై బీఎన్ఎస్ సెక్షన్ 303(2), 3(5) కింద కేసు నమోదు చేశారు.

వైరల్ గా సీసీటీవీ ఫుటేజ్

దొంగతనానికి సంబంధించిన సీసీటీవీ పుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఆమె వాహనం వెనుక భాగంలో ఏదో చూస్తుండగా తెల్ల చొక్కా ధరించిన ఓ వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతుండగా జయశ్రీ అతన్ని గమనించి సహాయం కోసం అరవడం మొదలుపెడుతుంది. ఈ వీడియో షేర్ చేసినప్పటి నుండి, ఆరు లక్షలకు పైగా వ్యూస్ సంపాదించింది. ఈ పోస్ట్ పై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఇది దురదృష్టకరమని కొందరు, ఆ దంపతులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిందని మరి కొందరు కామెంట్స్ చేశారు.

Whats_app_banner