Mumbai Rains : భారీ వర్షాలకు అల్లకల్లోలంగా ముంబై.. రుతుపవనాలు రాక ముందే!
10 June 2024, 9:45 IST
Mumbai rain alert : ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు రాక ముందే.. వర్షాలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
రుతుపవనాలు రాక ముందే.. ముంబైలో భారీ వర్షాలు
Mumbai rains : నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వకముందే.. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి.. ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి ముంబై మహా నగరం అల్లకల్లోలంగ మారింది. రానున్న కొన్ని రోజుల పాటు.. వర్షాలతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో గంటకు 62-87 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది.
సోమవారం సైతం రానున్న కొన్ని గంటల్లో.. ముంబై, థానే, రాయ్‌గఢ్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
ఆదివారం నగరంలో కురిసిన భారీ వర్షానికి ముంబై అస్తవ్యస్థంగా మారింది. అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్డు మీద ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. ఫలితంగా.. ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Mumbai rain today : ఆదివారం రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు గంట వ్యవధిలో నగరంలో ఏకంగా 55-77 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తెలిపింది. తూర్పు శివారు ప్రాంతాల్లో 28-40 మిల్లీమీటర్లు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో 48-77 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని స్పష్టం చేసింది.
వర్షపాతం వివరాలు (మిల్లీమీటర్లలో) రాత్రి 11 గంటల నుంచి 12 గంటల వరకు:
బ్రిటానియా స్టార్మ్ వాటర్ పంపింగ్ స్టేషన్ - 77; జి సౌత్ వార్డు- 73; ఎఫ్ సౌత్ వార్డు- 71; ఎన్.ఎం.జోషి మార్గ్ మునిసిపల్ స్కూల్- 70; వర్లీ ఫైర్ స్టేషన్ - 69; బి వార్డు- 55
Mumbai weather news : తూర్పు శివారు: వీణా నగర్ మున్సిపల్ స్కూల్- 40; మిథా నగర్ మున్సిపల్ స్కూల్- 39; ములుంద్ ఫైర్ స్టేషన్- 32; పస్పోలి పొవాయ్ మున్సిపల్ స్కూల్- 31; గవనప్డా ఫైర్ స్టేషన్- 28
పశ్చిమ శివారు: ఎరంగల్ మునిసిపల్ స్కూల్- 79; మలాడ్ డిపో- 64; గద్దర్బంద్ పంపింగ్ స్టేషన్-59, పాలి చింబాయి మున్సిపల్ స్కూల్-55, సుపారీ ట్యాంక్ మున్సిపల్ స్కూల్-54, కే ఈస్ట్-48' అని బీఎంసీ తెలిపింది.
Monsoon in mumbai : నైరుతి రుతుపవనాలు రాక ముందే.. ముంబైలో ఈ స్థాయిలో వర్షాలు కురుస్తుండటం విశేషం. సాధారణంగా.. జూన్ 13, 14 తేదీల్లో రుతుపవనాలు ముంబైలోకి ప్రవేశిస్తాయి. కానీ ఈసారి రెండు రోజుల ముందే.. అంటే మంగళవారమే ముంబైని రుతుపవనాలు తాకుతాయని ఐఎండీ వెల్లడించింది. మహారాష్ట్రలోని పలు ప్రాంతాలు, మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు ఆదివారమే రుతుపవనాలు విస్తరించాయి.
గత సంవత్సరం అరేబియా సముద్రంలో బిపర్జోయ్ తుఫాను కారణంగా జూన్ 24న ముంబైలోకి ప్రవేశించాయి నైరుతి రుతుపవనాలు.
“ముంబైలో ఉరుములు, మెరుపులతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, 51 నుంచి 75 శాతం మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రాయ్‌గఢ్, రత్నగిరి వంటి పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సింధుదుర్గ్, దాని పొరుగు జిల్లా కొల్హాపూర్‌కు రెడ్ అలర్ట్ జారీ చేశాము. చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి,” అని ఐఎండీ అధికారులు తెలిపారు.
ముంబై ఏక్యూఐని పర్యవేక్షించడంలో బీఎంసీకి సహాయపడటానికి క్లీన్ ఎయిర్ యాక్షన్ హబ్‌ని ఏర్పాటు చేసిన వాతావరణ సంస్థ.. మెట్రోపాలిట్ సిటీకి ఎల్లో అలర్ట్, సింధుదుర్గ్‌లో భారీ వర్షాలకు రెడ్ అలర్ట్, రత్నగిరికి ఆరెంజ్ అలర్ట్, పాల్ఘఢ్, థానే, ముంబై, రాయ్‌గఢ్‌లకు ఆదివారం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మరోవైపు ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ రోజు ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.