Monsoon 2024 : ఈసారి సాధారణ వర్షపాతం- కానీ.. ఆ రాష్ట్రాల్లో మాత్రం..
Monsoon 2024 : 2024 రుతుపవనాలు సాధారణంగా ఉంటాయని స్కైమెట్ వెల్లడించింది. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం లోటు వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది.
Monsoon 2024 in India : ఇండియాలో భానుడి భగభగలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఇప్పుడే మొదలైన వేసవి కాలం.. ఎప్పుడు ముగుస్తుందా అని ఆలోచిస్తున్నారు. వీటన్నింటి మధ్య.. ప్రముఖ ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్.. కాస్త ఉపశమనాన్ని కలిగించే వార్తను చెప్పింది. ఈ ఏడాది రుతుపవనాల ప్రభావం సాధారణంగా ఉంటుందని వెల్లడించింది.
రుతుపవనాల ప్రభావం సాధారణం..!
జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉండే రుతుపవనాలు.. భారత దేశానికి చాలా కీలకం. పైగా.. గతేడాది చాలా ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. ఇక ఇప్పుడు.. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణంగా ఉంటాయన్నది సానుకూల విషయం. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో వర్షాలు అధికంగా కురుస్తాయని స్కైమెట్ చెప్పింది. కానీ.. బిహార్, పశ్చిమ్ బెంగాల్లో మాత్రం లోటు వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది.
Monsoon in India : "దక్షిణ, వాయువ్య, ఈశాన్య భారత రాష్ట్రాల్లో వర్షాలు బాగా పడతాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో అధిక వర్షపాతం నమోదవుతుంది. కానీ బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, పశ్చిమ్ బెంగాల్లో లోటు వర్షపాతం నమోదవ్వొచ్చు. రుతుపవనాలు పీక్ దశలో ఉన్నా.. ఈ ప్రాంతాల్లో వర్షాలు పెద్దగా పడకపోవచ్చు," అని స్కైమెట్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇక రుతుపవనాల ప్రారంభంలో ఈశాన్య భారతంలో తక్కువ వర్షాలు పడతాయని స్కైమెట్ చెప్పుకొచ్చింది. మొత్తం మీద చూసుకుంటే.. రుతుపవనాల లాంగ్ పీరియడ్ యావరేజ్ (ఎల్పీఏ) 102శాతంగా ఉంటుందని పేర్కొంది.
Heatwave in Telangana : "నిన్నటి వరకు ఇబ్బంది పెట్టిన ఎల్ నినో.. లా నినోగా మారుతోంది. లా నినో ఉన్నప్పుడు.. రుతుపవనాల ప్రభావం అధికంగా ఉంటుంది. పైగా.. ఎల్ నినో నుంచి లా నినోకు వాతావరణ మారుతున్నప్పుడు.. బాగా వర్షాలు పడతాయని రికార్డులు కూడా చెబుతున్నాయి. కానీ రుతుపవనాల ప్రారంభంలో మాత్రం పెద్దగా వర్షాలు పడకపోవచ్చు," అని స్కైమెట్ ఎండీ జతిన్ సింగ్ తెలిపారు.
ఇక 2024 రుతుపవనాల ప్రభావంపై భారత వాతావరణశాఖ (ఐఎండీ) ఏం చెబుతుందో వేచి చూడాలి. త్వరలోనే రుతుపవనాలపై ఐఎండీ ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.
తీవ్ర వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి..
Heatwave in Andhra Pradesh : ఇక వేసవి విషయానికొస్తే.. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒడిశ, పశ్చిమ్ బెంగాల్‌లోని గంగా నది తీర ప్రాంతం, ఝార్ఖండ్, విదర్భ, ఉత్తర కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం, యానాం, రాయలసీమ, తెలంగాణలో హీట్‌వేవ్ పరిస్థితి పెరుగుతుందని తెలుస్తోంది. రానున్న ఏడు రోజుల పాటు తీర ప్రాంతాలున్న రాష్ట్రాల్లో వడగాల్పులు తీవ్రమవుతాయని ఐఎండీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికరులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావొద్దని సూచిస్తున్నారు.
సంబంధిత కథనం