Monsoon session: పార్లమెంట్లో కొనసాగుతున్న వాయిదాల పర్వం
19 July 2022, 13:28 IST
- Parliament Monsoon Session : పార్లమెంట్ సమావేశాలు మరోమారు వాయిదా పడ్డాయి. విపక్షాల నిరసనల మధ్య ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది.
పార్లమెంట్లో కొనసాగుతున్న వాయిదాల పర్వం
Parliament Monsoon Session : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. విపక్షాల ఆందోళనల మధ్య తొలిరోజైన సోమవారం మొత్తానికే వాయిదా పడగా.. మంగళవారం కూడా అదే పరిస్థితి నెలకొంది. ద్రవ్యోల్బణం, జీఎస్టీ రేట్ల పెంపుపై విపక్షాల నినాదాల మధ్య రాజ్యసభ, లోక్‌సభ మధ్యహ్నం 2గంటల వరకు వాయిగా పడ్డాయి.
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగానూ ఎంపీలు నిరసనలకు దిగారు. 'నిబంధనల ప్రకారం ప్లకార్డులు.. సభ లోపలికి తీసుకురాకూడదు,' అంటూ లోక్‌సభను వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా.. ఆహార ఉత్పత్తులు, ప్రభుత్వ సేవలన్నింటిపైనా జీఎస్టీ విధించాలన్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. పార్లమెంట్ ప్రాంగణంలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ధర్నాలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతలు పాల్గొన్నారు. కె.కేశవ రావు, లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావుతో పాటు ఇతర లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో ధర్నాకు దిగారు.
సోమవారం మొదలైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. ఆగస్టు 12తో ముగియనున్నాయి. ఈ దఫా సమవేశాలు.. కీలకంగా మారాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఫలితలు ఈ దఫా వర్షాకాల సమావేశాల్లోనే ఉండనున్నాయి. వీటితో పాటు.. మొత్తం మీద 32 బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది.
శ్రీలంకపై అఖిలపక్ష సమావేశం..
Sri Lanka crisis : శ్రీలంక సంక్షోభంపై మంగళవారం సాయంత్రం అఖిలపక్ష సమావేశం జరగనుంది. శ్రీలంక పరిణామాలపై భారత దేశ వైఖరి, ఆర్థిక సాయం వంటి చర్యలపై విపక్షాలకు విదేశాంగమంత్రి జై శంకర్, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వివరించనున్నారు.
శ్రీలంకను కుదిపేస్తున్న ఆర్థిక సంక్షోభం విషయంలో భారత్ జోక్యం అవసరమని డిఎంకే, అన్నాడీఎంకే నేతలు డిమాండ్ చేసిన నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది కేంద్రం.