Monsoon Session : నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
మరికాసేపట్లో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆగష్టు 12 వరకు జరిగే సమావేశాల్లో 34 బిల్లుల్ని సభ ముందుకు రానున్నాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా ఈ సమావేశాల్లోనే జరుగుతాయి. సమావేశాల తొలిరోజు ఎంపీలు రాష్ట్రపతి ఎన్నికల ఓటు హక్కును వినియోగించుకుంటారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో 32 బిల్లులు సభ ముందుకు రానున్నాయి. సమావేశాల తొలి రోజు రాష్ట్రపతి ఎన్నిక నిర్వహించనుండగా, ఆగష్టు 6న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అగ్నిపథ్‌లకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని విపక్షాలు ఇప్పటికే ప్రకటించాయి. దీంతో పాటు రూపాయి మారక విలువ తగ్గడం, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, ఈడీ, సీబీఐలతో విపక్షాలపై దాడులు, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. అటు ప్రభుత్వం కూడా రోజుకు కనీసం రెండు బిల్లుల్ని పార్లమెంటులో ప్రవేశపెట్టాలని బీజేపీ సర్కారు భావిస్తోంది. 24 కొత్త బిల్లులతో పాటు ఉభయసభల్లో పెండింగ్‌లో ఉన్న 8 బిల్లుల్ని నెగ్గించుకోవాలని సర్కారు యోచిస్తోంది.
పార్లమెంటు సమావేశాల్లో దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్రాన్ని నిలదీయాలని విపక్షాలు భావిస్తున్నాయి. అటవీ హక్కుల చట్టం 2006ను నిర్వీర్యం చేయడంపై ఎన్డీఏ మిత్ర పక్షాల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేంద్రం మాత్రం అన్ని బిల్లులపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెబుతోంది. పార్టీలతో చర్చించకుండా 14బిల్లుల్ని సభలో ప్రవేశపెట్టేందుకు సిద్ధం చేయడాన్ని విపక్షాలు తప్పు పడుతున్నాయి. సమావేశాల నిర్వహణ 14రోజులకు పరిమితం చేయడంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పార్లమెంటు సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమస్యల్ని పరిష్కరించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. వరద ముంపు జిల్లాలకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు జిఎస్టీ నష్టపరిహారం కాలపరిమితి మరో ఐదేళ్లకు పెంచాలని ఏపీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు పార్లమెంటులో టీడీపీ బలం గణనీయంగా పడిపోయింది లోక్‌సభలో ముగ్గురు ఎంపీలున్న టీడీపీకి రాజ్యసభలో ఒక్కరే మిగిలారు. అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ మొక్కుబడిగా వ్యవహరిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది.
టాపిక్