Child marriages : వరదలకు భయపడి.. బాల్య వివాహాలు చేస్తున్నారు- ప్రజల దయనీయ స్థితి!
16 August 2024, 11:24 IST
- Monsoon brides in Pakistan : పాకిస్థాన్లో బాల్య వివాహాలు పెరుగుతున్నాయి. దీనికి కారణం వాతావరణ మార్పులు. వరదలకు తట్టుకోలేక చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డలకు పెళ్లి చేస్తున్నారు. ఆ డబ్బుతో బతుదెరువును సాగిస్తున్నారు.
పాకిస్థాన్లో బాల్య వివాహాలు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి!
పాకిస్థాన్లో గత కొంతకాలంగా తగ్గుముఖం పడుతున్న బాల్య వివాహాలు, మళ్లీ ఆందోళకర సమస్యగా మారాయి.. ఇందుకు కారణం.. వరదలు, వాతావరణ మార్పులు! అదేంటి? అనుకుంటున్నారా? దీని వెనుక ఒక బాధాకరమైన కథ, ప్రజల దయనీయ స్థితి ఉంది. అసలు విషయం ఏంటంటే..
వరదలు వస్తుంటే బాల్య వివాహాలు చేస్తున్నారు..
పాకిస్థాన్లో జులై- సెప్టెంబర్ మధ్యలో వచ్చే రుతుపవనాలు దేశానికి చాలా కీలకం. లక్షలాది మంది రైతులు ఈ రుతుపవనాలపై ఆధారపడుతుంటారు. పాకిస్థాన్ ఆహార భద్రత కూడా ఈ రుతుపవనాలపైనే ఆధారపడి ఉంటుంది. కాగా ఇటీవలి కాలంలో పాకిస్థాన్ వాతావరణ మార్పులపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ మార్పుల కారణంగా ప్రకృతి విపత్తులు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. వరదలు, కొండచెరియలు విరిగిపడుతున్న ఘటనలు ప్రజలను భయపెడుతున్నాయి.
2022లో పెను ప్రకంపనలు సృష్టించిన వరదల నుంచి పాకిస్థాన్లోని ఎన్నో ప్రాంతాలు ఇంకా కోలుకోలేదు. ఆస్తితో పాటు భారీ పంట నష్టంతో రైతులు, వ్యవసాయంపై ఆధారపడే కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి.
ఈ పరిణామాల మధ్య పాకిస్థాన్లో బాల్య వివాహాలు పెరిగిపోతున్నాయి. దీనికి 'మాన్సూన్ బ్రైడ్' అని పేరు పెట్టారు. కుటుంబాన్ని పోషించలేక చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పెద్దవారితో పెళ్లి చేయించేస్తున్నారు. వారు ఇచ్చే డబ్బులతో బతుకుదెరువును సాగిస్తున్నారు. పాకిస్థాన్లో పేద రైతుల దయనీయ పరిస్థితికి ఇది అద్దంపడుతోంది.
దాదు జిల్లాలోని మల్లాహ్ అనే గ్రాహమంలో 2023 రుతుపవనాల సమయం నుంచి ఇప్పటివరకు 45మంది చిన్నారులకు బాల్య వివాహాలు జరిగాయి. పేదరికం నుంచి బయటపడేందుకు ఇది తప్ప తమకు వేరే ఆప్షన్ కనిపించడం లేదని బాలికల తల్లిదండ్రులు బాధపడుతున్నారు.
"2022 వరదలకు ముందు పరిస్థితులు ఇలా ఉండేవి కావు. కష్టపడి పని చేసి, సంపాదించుకనే వాళ్లము. వ్యవసాయం చేసుకునే వాళ్లము. కానీ ఇప్పుడు మా పరిస్థితి బాగోలేదు," అని ముల్లాహ్ గ్రామస్థుడు మీడియాకు చెప్పాడు.
మరోవైపు డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకుంటున్న వారి ఆర్థిక పరిస్థితులు కూడా దయనీయంగానే ఉన్నాయి. ఫలితంగా పుట్టింటి కష్టాల నుంచి బయటపడ్డామని సంతోషించే వెళుతున్న వధువులకు మెట్టినింటిలో మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయి.
"నాకు 14ఏళ్ల వయస్సులో పెళ్లి జరిగింది. నా భర్త, నా తల్లిదండ్రులకు రూ.2.5లక్షల వరకు ఇచ్చాడు. కానీ అది అప్పుగా తీసుకున్న డబ్బు! అది కట్టడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి," అని ఓ బాలిక చెప్పింది.
"పెళ్లి తర్వాత లిప్స్టిక్, మేకప్ కిట్, బట్టలు, సామాన్లు వస్తాయనుకున్నా. కానీ పరిస్థితులు బాగాలేవు," అని ఆమె చెప్పింది. ఈ 16ఏళ్ల బాలికకు ఇప్పుడు ఒ ఆరు నెలల బిడ్డ కూడా ఉంది.
పాకిస్థాన్లో బాల్య వివాహాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మహిళలు పెళ్లి చేసుకుని వయస్సు 16-18 మధ్యలో ఉంటుంది. కానీ చాలా మందికి దాని కన్నా ముందే పెళ్లి జరిగిపోతోంది.
"పాకిస్థాన్లో బాల్య వివాహాలు 18శాతం పెరుగుతాయని అంచనాలు ఉన్నాయి. ఇది 5ఏళ్ల ప్రోగ్రెస్ని తుడిచిపెట్టేస్తుంది," అని 2022 వరదల తర్వాత యూనిసెఫ్ ఒక నివేదికలో వెల్లడించింది.
పాకిస్థాన్లో బాల్య వివాహాలను అడ్డుకునేందుకు పలు ఎన్జీఏలు యాక్టివ్గా కృషిచేస్తున్నాయి. కానీ అవి ఎంత వరకు ఫలితాల్ని ఇస్తాయో, ఎన్జీఓలు ఎంత కాలం వరకు బాల్య వివాహాలను అడ్డుకోగలవు అనేది ప్రశ్నార్థకంగా మారింది.