Earthquake in Uttarkashi : ఉత్తరకాశీలో భూకంపం.. నేపాల్‌లో భూ ప్రకంపనలు
19 December 2022, 8:16 IST
Uttarkashi Earthquake today : నేపాల్‌లో ఆదివారం రాత్రి, ఉత్తరకాశీలో సోమవారం తెల్లవారుజామున భూకంపాలు నమోదయ్యాయి. ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
నేపాల్‌లో భూకంపం
Earthquake in Nepal : నేపాల్‌లో మరోమారు భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 4.5గా నమోదైంది. ఈ విషయాన్ని ఎర్త్‌క్వేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ నేపాల్ వెల్లడించింది.
ఖాట్మాండుకు పశ్చిమాన, 50కి.మీల దూరంలోని ధండింగ్ జిల్లా కేంద్రంగా ఆదివారం రాత్రి 10:53 గంటలకు భూకంపం సంభవించింది. ఖాట్మాండూతో పాటు పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు నమోదయ్యాయి. అయితే.. భూకంపం తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది.
నేపాల్ కేంద్రంగా తరచూ భూకంపాలు నమోదవుతున్నాయి. ఈ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తూ ఉంటారు.
ఉత్తరకాశీలో భూ ప్రకంపనలు..
Uttarkashi Earthquake today : సోమవారం తెల్లవారుజామున ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 3.1గా నమోదైంది.
నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలాజీ ప్రకటన ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున 1:50 గంటలకు.. ఉత్తరకాశీకి 24 కి.మీల దూరంలో భూమికి 5కి.మీల దిగువన భూ ప్రకంపనలు నమోదయ్యాయి.
"3.1 తీవ్రతతో ఉత్తరకాశీలో 19-12-2022 1:50ఏఎంకు భూకంపం సంభవించింది. భూమికి 5కి.మీల దిగువన భూకంపం వచ్చింది," అని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలాజీ ట్వీట్ చేసింది.
Earthquake in Uttarkashi today : ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం నమోదుకాలేదు.
ఉత్తరాఖండ్‌లో తరచూ భూప్రకంపనలు వెలుగులోకి వస్తున్నాయి. నవంబర్ 6న.. ఉత్తరాఖండ్‌లోని టెహ్రీ ప్రాంతంలో భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టార్ స్కేలుపై 4.5గా నమోదైంది.
ప్రపంచవ్యాప్తంగా..
Earthquak in Texas latest updates : ప్రపంచవ్యాప్తంగా భూకంపాల ఘటనలు పెరిగిపోతున్నాయి. అమెరికా టెక్సాస్‌లో కొన్ని రోజుల క్రితమే భూకంపం సంభవించింది. టెక్సాస్ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన భూకంపాల్లో ఒకటిగా దీనిని పరిగణిస్తున్నారు. చమురు ఉత్పత్తి కేంద్రాలు అధికంగా ఉండే పశ్చిమ టెక్సాస్ ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగించింది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చున్నారు.
స్థానిక కాలమానం ప్రకారం.. శుక్రవారం సాయంత్రం 5:35 గంటలకు.. భూకంపం సంభవించింది. మిడ్‌ల్యాండ్ ప్రాంతానికి ఉత్తర-వాయువ్యం వైపు 14 మైళ్ల దూరంలో భూమికి 8కి.మీల దిగువన భూ ప్రకంపనలను గుర్తించినట్టు యూఎస్ జీయోలాజికల్ సర్వే ప్రకటన విడుదల చేసింది. రిక్టార్ స్కేల్‌పై దాని తీవ్రత 5.4గా నమోదైంది. టెక్సాస్ చరిత్రలో ఇది 4వ అతిపెద్ద భూకంపం అని నేషనల్ వెథర్ సర్వీసెస్ పేర్కొంది.
ఈ భూకంపం తర్వాత.. మూడు నిమిషాలకు.. 3.3 తీవ్రతతో మళ్లీ భూ ప్రకంపనలు నమోదైనట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.