తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Indonesia Earthquake: భూకంపాన్ని జయించిన ‘ఆరేళ్ల బాలుడు’.. రెండు రోజులు శిథిలాల కిందే.. ఎలా బయటపడ్డాడంటే..

Indonesia Earthquake: భూకంపాన్ని జయించిన ‘ఆరేళ్ల బాలుడు’.. రెండు రోజులు శిథిలాల కిందే.. ఎలా బయటపడ్డాడంటే..

24 November 2022, 10:50 IST

google News
    • Indonesia Earthquake: ఇండోనేసియా భూకంపం నుంచి ఆరేళ్ల బాలుడు బయటపట్టాడు. సుమారు 48 గంటల పాటు శిథిలాల కింద చిక్కుకొని సురక్షితంగా ఉన్నాడు. సహాయక సిబ్బంది అతడిని బయటికి తీశారు. ఈ ప్రక్రియ ఎలా సాగిందంటే..
భూకంపాన్ని జయించిన ‘ఆరేళ్ల బాలుడు’
భూకంపాన్ని జయించిన ‘ఆరేళ్ల బాలుడు’ (REUTERS)

భూకంపాన్ని జయించిన ‘ఆరేళ్ల బాలుడు’

Indonesia Earthquake: ఇండోనేసియాను భీకర భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతతో వచ్చిన ఈ ప్రకృతి వైపరీత్యం ఆ దేశాన్ని తీవ్రంగా నష్టపరిచింది. ముఖ్యంగా వెస్ట్ జావా కకావికలమైంది. సియాంజూర్ (Cianjur) నగరంలో వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ భూకంప దుర్ఘటనలో మృతుల సంఖ్య 271కు పెరిగింది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఓ ఆరు సంవత్సరాల బాలుడు ఈ భూకంపాన్ని జయించాడు. శిథిలాల కిందే రెండో రోజులు ఉన్నాడు. సురక్షితంగా బయటపడ్డాడు. ఈ వివరాలను అక్కడి అధికారులు వెల్లడించారు.

‘అద్భుతంలా అనిపిస్తోంది’

Indonesia Earthquake: సియాంజూర్ నగరంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాలను తొలగించే పనిలో చాలా మంది నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే ఆరు సంవత్సరాల వయసు ఉన్న అజ్కా (Azka) అనే బాలుడిని సహాయక సిబ్బంది గుర్తించారు. అతడిని సురక్షితంగా బయటికి తీశారు. “అజ్కా జీవించే ఉన్నాడని మేం గుర్తించగానే.. నాతో పాటు అందరి కళ్లు చెమ్మగిల్లాయి” అని సహాయక చర్యలు చేస్తున్న స్థానిక వలంటీర్ జెక్సెన్ కొలిబూ చెప్పారు. “ఈ ఘటన నన్ను చాలా కదిలించింది. నాకు ఇదో అద్భుతంగా అనిపిస్తోంది” అని అన్నారు.

సియాంజూర్ లో కుప్పకూలిన ఓ ఇంట్లో నుంచి అజ్కాను బయటికి తీస్తున్న వీడియో బయటికి వచ్చింది. ఆ అబ్బాయి నీలం రంగు చొక్కా, ట్రౌజర్ వేసుకున్నాడు.

శిథిలాల కింద అజ్కా జీవించి ఉన్నాడని చూడగానే.. అక్కడి సిబ్బంది ఎంతో జాగ్రత్తగా వాటిని తొలగించారు. ఏ మాత్రం గాయాలు కాకుండా ఆ బాలుడిని కాపాడగలిగారు. ఈ ఫుటేజ్‍ను జావాలోని బొగేర్ డిస్ట్రిక్ అధికారులు విడుదల చేశారు.

బాలుడి తల్లి మృతి

Indonesia Earthquake: అయితే భూకంపంలో అజ్కా తల్లి మృతి చెందారు. ఆ బాలుడు దొరికే కొద్ది గంటల ముందే ఆమె మృత దేహాన్ని గుర్తించారు. మరోవైపు ఆ బాలుడి నానమ్మ కూడా చనిపోయారని కొలిబు పేర్కొన్నారు.

శిథిలాల కింద బాలుడు 48 గంటలు ఇలా..

Indonesia Earthquake: ఇళ్లు కుప్పకూలిన సమయంలో అజ్కాపై గోడ పడకుండా.. మరో గోడ అడ్డుగా కూలింది. దీంతో శిథిలాల కింద కాస్త గ్యాప్ ఏర్పడింది. ఆ చిన్న ప్లేస్‍లోనే అజ్కా ఉన్నాడు. అందులోనూ ఆ సమయంలో అతడు బెడ్‍పై ఉన్నాడు. బాలుడి దగ్గర దిండు కూడా ఉంది. కాంక్రీట్ స్లాబ్‍కు.. అజ్కాకు మధ్య కేవలం 10 సెంటీమీటర్ల గ్యాప్ మాత్రమే ఉంది. ఈ విషయాలను సహాయ చర్యల్లో పాల్గొన్న కొలిబు చెప్పారు. శిథిలాల కింద ఎంతో చీకటి, వేడి ఉన్నా.. గాలి వెళ్లేందుకు మాత్రం సరిపోయిన సందు ఉండిందని చెప్పారు.

శిథిలాల నుంచి బయటికి వచ్చిన సమయంలోనూ అజ్కా స్పృహలోనే ఉన్నాడు. ఏడ్వలేదని కూడా అక్కడి వారు చెప్పారు. “48 గంటల తర్వాత కూడా అతడు జీవించి ఉంటాడని ముందుగా మేం ఊహించలేదు. ఇది తెలిసి ఉంటే అంత కంటే ముందు రోజే శిథిలాలను తొలగించే వాళ్లం. నేను వాలంటీర్ గా మారి చాలా సంవత్సరాలైంది. కానీ ఎప్పుడూ ఇలాంటిది చూడలేదు. ఇలాంటి సమయాల్లో భావోద్వేగానికి గురి కాకుండా ఉండగలమా?” అని జెస్కెన్ కొలిబు అన్నారు.

తదుపరి వ్యాసం