IMD weather : మే నెలలో.. తెలంగాణ, ఆంధ్రపై హీట్‌వేవ్ ప్రభావం ఎక్కువే!
29 April 2023, 6:20 IST
IMD weather : మే నెలకు సంబంధించిన ఔట్‌లుక్‌ను విడుదల చేసింది ఐఎండీ. దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో హీట్‌వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.
కొంచెం ఎండ.. కొంచెం వాన- మే నెలలో దేశం పరిస్థితి ఇది!
IMD weather : మే నెల వస్తోందంటే చాలు.. భానుడి భగభగల గుర్తు తెచ్చుకుని ప్రజలు భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణశాఖ (ఐఎండీ) కీలక అప్డేట్ ఇచ్చింది. వాయువ్య- పశ్చిమ- మధ్య భారతంలో మే నెలలో సాధారణం లేదా సాధారణం కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఫలితంగా హీట్‌వేవ్ ప్రభావిత ప్రాంతాల్లో జీవిస్తున్న లక్షలాది మంది ప్రజలకు ఉపశమనం కలుగుతుందని పేర్కొంది. అదే సమయంలో.. భారీ ఉష్ణోగ్రతలు కనిపించని ప్రాంతాల్లో మాత్రం హీట్‌వేవ్ ప్రభావం ఈసారి ఎక్కువగానే ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు.. మే నెలకు సంబంధించిన ఔట్‌లుక్‌ను విడుదల చేసింది.
IMD weather forecast in May 2023 : ఐఎండీ ప్రకారం.. వాయువ్యం, పశ్చిమ- మధ్య భారతంలో వర్షపాతం.. సాధారణం లేదా సాధారణం కన్నా ఎక్కువగా నమోదవుతుంది. తూర్పు, తూర్పు- మధ్య, ఈశాన్య, ద్వీపకల్పం (పెనున్సులార్)లోని ప్రాంతాల్లో హీట్‌వేవ్.. సాధారణం కన్నా ఎక్కువ రోజులు ఉంటుంది. మేలో బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తూర్పు ఉత్తర్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాలు, తూర్పు మధ్య ప్రదేశ్, తెలంగాణ, గుజరాత్ తీర ప్రాంతాల్లో హీట్‌వేవ్ ప్రభావం ఎక్కువగా ఉండనుంది.
ఇదీ చదవండి :- Ayurvedic Remedies : ఎండతో చర్మం ఎర్రగా, దురదగా మారితే.. ఇలా చేయండి
"మే నెలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉంటాయి. ఈసారి మాత్రం వాయువ్య, పశ్చిమ- మధ్య భారతంలో ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉండొచ్చు. ఈ ప్రాంతాల్లో హీట్‌వేవ్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు," అని ఐఎండీ డైరక్టర్ ఎం మోహపాత్ర తెలిపారు.
హీట్ ఇండెక్స్..
Heatwave in India 2023 : 'హీట్ ఇండెక్స్'ను తొలిసారిగా లాంచ్ చేసింది భారత వాతావరణశాఖ. తేమ, ఉష్ణోగ్రతల కారణంగా మానవ శరీరంలో ఎలా ఫీల్ అవుతోంది అన్నది ఈ హీట్ ఇండెక్స్ చెబుతుంది. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా.. ఈ 'ఫీల్స్ లైక్' డేటాను ఐఎండీ ప్రతి రోజు విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. ఫలితంగా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండటానికి వీలవుతుందని అభిప్రాయపడుతోంది.ఈ విషయాన్ని ఎర్త్ సైన్సెస్ మినిస్ట్రీ సెక్రటరీ ఎం రవిచంద్రన్ తెలిపారు.