తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Maharashtra Elections : మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమి సీట్ల పంపకాలు ఫైనల్.. అత్యధిక స్థానాల్లో బరిలోకి కాంగ్రెస్!

Maharashtra Elections : మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమి సీట్ల పంపకాలు ఫైనల్.. అత్యధిక స్థానాల్లో బరిలోకి కాంగ్రెస్!

Anand Sai HT Telugu

23 October 2024, 13:01 IST

google News
    • Maharashtra Elections : మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రతిపక్షంలో మహా వికాస్ అఘాడి (MVA) కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన (UBT), శరద్ పవార్ ఎన్సీపీ (SP) ఉన్నాయి. ఈ పార్టీల మధ్య సీట్ల పంపకాలు కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తోంది.
మహావికాస్ అఘాడీ కూటమి
మహావికాస్ అఘాడీ కూటమి

మహావికాస్ అఘాడీ కూటమి

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమిలో సీట్ల కేటాయింపుపై చర్చలు తుది దశకు చేరుకున్నాయి. శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే), శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ), కాంగ్రెస్‌లతో కూడిన ఎంవీఎ ఎన్నికలకు ముందు తన వ్యూహాన్ని ఖరారు చేయడానికి కృషి చేస్తోంది.

అందుతున్న సమచారం ప్రకారం కాంగ్రెస్ 105 నుండి 110 స్థానాల మధ్య, శివసేన(యూబీటీ) 85 నుండి 90 స్థానాల మధ్య, ఎన్‌సిపి (శరద్ పవార్ నేతృత్వంలోని) 75 నుండి 80 స్థానాల్లో పోటీ చేయవచ్చని భావిస్తున్నారు. శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే వర్గాలు తమ అభ్యర్థులకు ఏ, బీ ఫారమ్‌లను పంపిణీ చేయడం మెుదలుపెట్టాయని తెలుస్తోంది. మంగళవారం, శరద్ పవార్ 17 ఏ,బీ ఫారమ్‌లను పంపిణీ చేశారు. ఉద్ధవ్ వర్గం కూడా 10 కంటే ఎక్కువ ఫారమ్‌లను పంపిణీ చేసినట్లు సమాచారం.

భారతీయ జనతా పార్టీ ఇప్పటికే 99 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి, ఫారమ్‌ల పంపిణీ ప్రక్రియను కూడా ప్రారంభించింది. శివసేనకు చెందిన ఏక్‌నాథ్ షిండే వర్గం మంగళవారం 45 సీట్లను ప్రకటించింది. ఈ అభ్యర్థులు బుధవారం నుండి తమ ఏ, బీ ఫారమ్‌లను స్వీకరించడం ప్రారంభిస్తారు.

మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరగనుంది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, బీజేపీ మహారాష్ట్రలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ మహాయుతి కూటమికి కాంగ్రెస్, ఎన్సీపీ(ఎస్పీ), శివసేన(యూబీటీ) మహా వికాస్ అఘాడీ కూటమి నుంచి సవాలు ఎదురవుతోంది.

2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 288 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 105 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన 56 సీట్లు గెలుచుకోగా, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ), కాంగ్రెస్ వరుసగా 54, 44 సీట్లు గెలుచుకున్నాయి.

సీట్ల పంపిణీకి సంబంధించి కాంగ్రెస్, శివసేన మధ్య విభేదాలు ఉన్నాయని కొన్ని నివేదికలు సూచించినప్పటికీ ఎంవీఏ కూటమిలో పెద్ద వివాదాలు లేవని బయటకు చెబుతున్నారు. ఇక సీట్ల పంపకం కొలిక్కి రావడంతో త్వరల ప్రకటించే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం