Car Accident : బీఎండబ్ల్యూ కారు ఢీకొని మహిళ మృతి.. కారు శివసేన పార్టీ నేతకు చెందినదిగా గుర్తింపు!-woman died hit by bmw car in mumbai politicians son involve in this case heres what police said ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Car Accident : బీఎండబ్ల్యూ కారు ఢీకొని మహిళ మృతి.. కారు శివసేన పార్టీ నేతకు చెందినదిగా గుర్తింపు!

Car Accident : బీఎండబ్ల్యూ కారు ఢీకొని మహిళ మృతి.. కారు శివసేన పార్టీ నేతకు చెందినదిగా గుర్తింపు!

Anand Sai HT Telugu
Jul 07, 2024 05:41 PM IST

Mumbai BMW Accident : చేపలు కొనుక్కుని ఓ మహిళ తన భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా బీఎండబ్ల్యూ కారు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ఈ కారు శివసేన నాయకుడిదని పోలీసులు చెబుతున్నారు.

మహిళను ఢీ కొట్టిన కారు
మహిళను ఢీ కొట్టిన కారు

ముంబైలోని వర్లి కోలివాడలో నివాసముంటున్న కావేరీ నఖ్వా (45) అనే మహిళ తన భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుంది. చేపలు కొనుక్కుని బైక్‌పై వెళుతున్న వారిని బీఎండబ్ల్యూ కారు ఢీకొనడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. కారు ఢీకొనడంతో వారి బైక్ బోల్తా పడి భార్యాభర్తలిద్దరూ కారు బానెట్‌పై పడిపోయారు.

yearly horoscope entry point

తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో భర్త బానెట్ నుండి దూకి ప్రాణాలను కాపాడుకున్నాడు. కాని మహిళ ఆ పని చేయలేకపోయింది. గాయపడిన మహిళను అక్కడికక్కడే వదిలి కారు డ్రైవర్ పరారయ్యాడు. అయితే అప్పటికే ఆమె మరణించింది.

ప్రస్తుతం భర్త చికిత్స పొందుతున్నాడని, హిట్ అండ్ రన్ కేసుపై దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. ఇటీవల పూణెలో 17 ఏళ్ల బాలుడు మద్యం మత్తులో తన ఖరీదైన కారును నడిపి బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. అయితే తాజా ఘటనలో బీఎండబ్ల్యూ శివసేన పార్టీకి చెందిన నేతదని అంటున్నారు.

బీఎమ్‌డబ్ల్యూ కారులో మిహిర్ షా (శివసేన రాజకీయ నాయకుడు రాజేష్ షా కుమారుడు), రాజ్‌రిషి బిదావర్ అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారని వర్లీ పోలీసులు హిందుస్థాన్ టైమ్స్‌కి తెలిపారు. రాజేష్ షాను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు, అతని కుమారుడు ఇప్పటికీ పరారీలో ఉన్నాడని తెలుస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 5:30 గంటలకు బైక్‌పై వెళ్తున్న దంపతులు వర్లీలోని అట్రియా మాల్ ఎదురుగా వెళుతుండగా ఈ ఘటన జరిగింది. వేగంగా వస్తున్న వాహనం ఢీ కొట్టడంతో ఇద్దరు కారుపై పడ్డారు. అయితే భర్త మాత్రం కారు నుంచి పక్కకు తప్పుకొన్నాడు. మహిళను కారు 100 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆమె మృతి చెందింది. ఘటన అనంతరం డ్రైవర్‌ తన కారుతో అక్కడి నుంచి పరారయ్యాడని పోలీసు అధికారులు తెలిపారు.

'ముంబయి హిట్ అండ్ రన్ కేసు చాలా దురదృష్టకరం. నేను పోలీసులతో మాట్లాడాను. ఎవరు అయినా దోషులైతే, వారిపై చర్యలు తీసుకుంటాం.. ఏం జరిగినా అందరినీ సమానంగా చూస్తాం.' మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అన్నారు.

ఇప్పటికే శివసేన నేత ఆదిత్య ఠాక్రే వర్లీ పోలీసు స్టేషన్‌కు వెళ్లి సంఘటనపై దర్యాప్తు చేస్తున్న సీనియర్ అధికారులతో మాట్లాడారు. 'నిందితుడిని పట్టుకుని బాధితులకు న్యాయం చేయడానికి పోలీసులు వేగంగా స్పందిస్తారని నేను ఆశిస్తున్నాను. రాజకీయ ప్రతీకారం ఉండదని ఆశిద్దాం. MLC సునీల్ షిండే, నేను కూడా బాధితురాలి భర్త నఖ్వాను కలిశాం. న్యాయం చేస్తామని హామీ ఇచ్చాం.' అని ఆదిత్య ఠాక్రే చెప్పారు.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.