Crime news : రూ. 1.5లక్షల ఐఫోన్ ఆర్డర్ చేసి.. డెలివరీ బాయ్‌ని చంపేశారు! డబ్బులు లేక?
01 October 2024, 11:15 IST
- UP crime news : క్యాష్ ఆన్ డెలివరీతో రూ. 1.5లక్షలు విలువ చేసే ఐఫోన్‌ని ఆర్డర్ చేసిన ఓ వ్యక్తి, అది తెచ్చిన డెలివరీ బాయ్‌ని చంపేశాడు! తన సహచరుడితో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.
డెలివరీ బాయ్ దారుణ హత్య..
ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఐఫోన్ డెలివరీ చేసేందుకు వెళ్లిన డెలివరీ బాయ్‌ని ఇద్దరు అతి కిరాతకంగా చంపేశారు! అనంతరం అతడి మృతదేహాన్ని సమీపంలోని కాలువలో పడేశారు.
ఇదీ జరిగింది..
యూపీ రాజధాని లక్నోలో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి రూ. 1.5లక్షలు విలువ చేసే ఐఫోన్‌ని సీఓడీ (క్యాష్ ఆన్ డెలివరీ) కింద బుక్ చేశాడు. ఈ నెల 23న, ఐఫోన్‌ని డెలివరీ చేసేందుకు 30ఏళ్ల భరత్ సాహు, చిన్‌హట్‌లోని కస్టమర్ దగ్గరికి వెళ్లాడు. కానీ ఆ కస్టమర్ గజానన్, తన సహచరుడితో కలిసి డెలివరీ బాయ్‌ని చంపేశాడు. అనంతరం ఇద్దరు కలిసి మృతదేహాన్ని సమీపంలోని ఇందిరా కెనాల్ వద్ద పడేశారు.
సాహు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఇంట్లో వాళ్లు కంగారు పడ్డారు. రెండు రోజుల తర్వాత, సెప్టెంబర్ 25న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాహు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు సాహు కాల్ రికార్డులను పరిశీలించారు. చివరిగా అతను వెళ్లిన లోకెషన్ని కనుగొనేందుకు ప్రయత్నించారు. అప్పుడే, గజానన్ నంబర్ బయటకు వచ్చింది. ఆ తర్వాత అతని స్నేహితుడు ఆకాశ్ గురించి తెలిసింది. పోలీసులు అకాశ్ని అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా.. ఆకాశ్ నేరాన్ని అంగీకరించాడు. గజానన్‌తో కలిసి డెలివరీ బాయ్‌ని గొంతు నులిమి హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. అనంతం మృతదేహాన్ని గొనెసంచిలో వేసి, ఇందిరా కెనాల్లో వెసినట్టు పేర్కొన్నారు.
కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు గజానన్ని పోలీసులు అరెస్ట్ చేశారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.
మరోవైపు బాధితుడి మృతదేహం ఇంకా లభించలేదు. ఇందిరా కెనాల్లో మృతదేహాన్ని వెలికి తీసేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందం కృషి చేస్తోంది.
అయితే ఐఫోన్ డెలివరీ చేసేందుకు వెళ్లిన డెలివరీ బాయ్ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. డబ్బులు లేక ఐఫోన్ కోసం హత్య చేశారా? లేదే వేరే కారణాలు ఏవైనా ఉన్నాయా? అన్నది తెలియాల్సి ఉంది.
డెలివరీ బాయ్ హత్యకు గురవ్వడం ఇది మొదటిసారి కాదు! 2021లో బెంగళూరులో ఓ డెలివరీ బాయ్‌ని దొంగలు హతమార్చారు. 2022లో నోయిడాలో మరో డెలివరీ బాయ్ దారుణ హత్యకు గురయ్యాడు. పేమెంట్ విషయంలో వివాదంతో డెలివరీ బాయ్‌ని కస్టమర్ చంపేశాడు.
క్లాస్ 12 విద్యార్థి హత్య..
దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పుణెలోని బారామతి నగరంలోని ఓ జూనియర్ కాలేజీలో 12వ తరగతి విద్యార్థిని ఇద్దరు మైనర్లు హత్య చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి వయస్సు 17ఏళ్లు.
టీసీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, కామర్స్, సైన్స్ ఆవరణలో సోమవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
మృతుడు సైన్స్ విభాగానికి చెందిన విద్యార్థిగా గుర్తించారు.
నిందితుల్లో ఒకరు సైన్స్ విభాగానికి చెందినవారు కాగా, మరొకరు కామర్స్ విభాగానికి చెందినవారు.
ముగ్గురు ప్రయాణిస్తున్న రెండు బైక్‌లు ఒకదానికి ఒకటి తాగడంతో తొలుత గొడవ ప్రారంభమైందని, అనంతరం హత్యకు దారితీసిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని బారామతి పోలీస్ స్టేషనకు చెందిన ఓ పోలీసు అధికారి తెలిపారు.
ఒక మైనర్‌ను అదుపులోకి తీసుకున్నామని, రెండో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.
మైనర్లలో ఒకరు బాధితుడిపై కత్తితో దాడి చేయగా, మరొకరు కొడవలితో దాడి చేసిన దృశ్యాలు కళాశాల ఆవరణలోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.
దాడి అనంతరం తలెత్తిన గందరగోళం మధ్య ఇద్దరు నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
బాధితుడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను మరణించినట్లు ప్రకటించారు.