Jagtial District : భార్య, భర్తల గొడవలో తలదూర్చిన ఎస్ఐ..! భర్త ఆత్మహత్య
భార్య, భర్త గొడవ కేసులో ఓ లేడీ ఎస్ఐ తలదూర్చారు. విచారణ పేరిట స్టేషన్ కు పిలిపించి.. భార్య ముందే లాఠీ ఝులిపించారు. మనస్థాపం చెందిన భర్త.. ఈనెల 23 న ఇంట్లో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఎస్ఐ తీరుపై మృతుడి కుటుంబసభ్యులు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో శివప్రసాద్ అనే వ్యక్తి ఆత్మహత్య కలకలం సృష్టిస్తుంది. కోరుట్ల ఎస్ఐ శ్వేత కొట్టడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 22న పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని శివప్రసాద్ ఆత్మహత్యకు యత్నించాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. శివప్రసాద్ ఆత్మహత్య కు ఎస్ఐ కారణమని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ల బావి ప్రాంతానికి చెందిన బొల్లారపు శివప్రసాద్ పై ఆయన భార్య కోరుట్ల పోలీసే స్టేషన్లో 19న పిర్యాదు చేశారు. భార్య పిర్యాదుతో భర్తను విచారణ పేరిట ఎస్సై శ్వేత ఠాణాకు పిలిపించారు. భార్య ముందే లాఠీ ఝులిపించి, దూషిస్తూ అవమానించారు. మనస్థాపం చెందిన శివప్రసాద్ ఈనెల 23న ఇంట్లో పెట్రోల్ పోసుకొని, నిప్పంటించుకున్నాడు.
పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి చనిపోయాడు. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. జరిగిన ఘటనపై మృతుడి సోదరి ప్రశాంతి వీడియో విడుదల చేశారు. భార్యభర్తల మధ్య గొడవ నేపద్యంలోఎస్ఐ శ్వేత, శివప్రసాద్ ను స్టేషన్ కు పిలిచి భార్య ముందే కొట్టడంతో మనస్థాపం చెంది సూసైడ్ చేసుకున్నాడని కుటుంబ సభ్యులు అంటున్నారు.
భార్య భర్తల మధ్య గొడవ ఉంటే కౌన్సిలింగ్ నిర్వహించాల్సింది పోయి ఎస్ఐ ఎలా చేయి వేసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఎస్ఐ తీరుపై మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తు, శివప్రసాద్ మృతికి కారణం అయిన ఎస్ఐ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎస్ఐ తీరు వివాదాస్పదం…
కోరుట్ల ఎస్ఐగా పని చేస్తున్న శ్వేత పనితీరు వివాదాస్పదంగా మారుతుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో అకారణంగా చితకబాదడంతో అవమానంతో ప్రాణాలు తీసుకున్న తీరు ఆమె దురుసు ప్రవర్తనను రుజువు చేస్తుందని స్థానికులు అంటున్నారు. చేతిలో అధికారం, లాఠీ ఉన్నాయనో.. లేక పోలీసును.. నాకేమవుతుందన్న ధీమానో తెలియదు గానీ.. ఎక్కడ విధులు నిర్వహించినా జనాలను వేధించే అధికారిగా ముద్ర వేసుకోవడం మానడంలేదు. తాజా ఘటనలో ఓ అమాయకుడు ఎస్సై శ్వేత కారణంగా ప్రాణాలు తీసుకోవడంతో జిల్లా ప్రజలు పోలీసు శాఖపై మండిపడుతున్నారు.
గతంలోనూ ఇదే తీరు..!
జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి ఠాణాలో ఎస్సైగా పని చేస్తున్న సమయంలో శ్వేత అదే మండలానికి ఓ ప్రజా ప్రతినిధిని అప్పటి మంత్రి సమావేశంలో ఉన్నప్పటికీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి, చితకబాదారు. దీంతో మంత్రి ఆగ్రహించి.. ఆమెను బదిలీ చేయించారు.
ఎస్సై శ్వేత జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న సమయంలో దరఖాస్తుదారులతోపాటు పోలీస్ స్టేషన్ కు వచ్చినవారితో దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలున్నాయి. మందలించాల్సిన పోలీస్ ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో ఆమె చెలరేగిపోతున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ ఉన్నతాధికారులు వెంటనే ఎస్ఐ శ్వేత పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.