Sangareddy Crime : ఆస్తి కోసం ఓ కూతురి నిర్వాకం, తండ్రి బతికుండగానే చనిపోయాడని భూమి పట్టా చేయించుకున్నవైనం
30 September 2024, 16:57 IST
- Sangareddy Crime : ఆస్తి కోసం తండ్రి బతికుండగానే చనిపోయాడని చెప్పి, రెవెన్యూ అధికారుల సాయంతో కొంత భూమిని తన పేరిట రాయించుకుందో కూతురు. తనకు వారసత్వంగా రావాల్సిన భూమి విషయంపై మనవడు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది.
ఆస్తి కోసం ఓ కూతురి నిర్వాకం, తండ్రి బతికుండగానే చనిపోయాడని భూమి పట్టా చేయించుకున్నవైనం
Sangareddy Crime : ఆస్తి కోసం తండ్రి బతికుండగానే చనిపోయాడని ఓ కూతురు రెవెన్యూ అధికారులతో తప్పుడు పంచనామా చేయించి కొంత భూమిని తన పేరు మీద పట్టా చేయించుకుంది. ఆ తర్వాత కొంతకాలానికి తండ్రితో మిగతా భూమిని అదే అధికారులతో కలిసి సెల్ డిడ్ చేయించింది. ఈ విషయంపై ఆయన మనవడు తనకు వారసత్వంగా రావాల్సిన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
నారాయణఖేడ్ ఎస్‌ఐ విద్యాచరణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి ఈరప్ప, లచ్చమ్మ దంపతులకు ఒక కొడుకు కుమ్మరి విఠల్, ఒక కూతురు ఈశ్వరి ఉన్నారు. కాగా ఆయన కుమారుడు విఠల్ 2010లో మృతి చెందగా, కోడలు లింగమ్మ 2021లో మృతి చెందింది. విఠల్- లింగమ్మ దంపతులకు ఒక కుమారుడు సంతోష్ ఉన్నాడు.
రెవెన్యూ అధికారులతో కుమ్మకై
ఈరప్ప పేరిట గంగాపూర్ శివారులో వివిధ సర్వే నెంబర్లలో రెండు ఎకరాల భూమి ఉంది. ఈ భూమిపై కూతురి కన్ను పడింది. ఎలాగైనా ఆ భూమిని దక్కించుకోవాలనే దుర్బుద్ధితో తండ్రి ఈరప్ప బతికుండగానే చనిపోయాడని గ్రామానికి చెందిన పరమేశ్వర్, సాయన్న, గంగారాం, శంకర్, రెవెన్యూ అధికారులతో కుమ్మకైంది. ఈ క్రమంలో 2017లో ఈరప్ప మృతి చెందాడని, అతడికి వారసురాలు తానేనంటూ వారసత్వ పంచనామాతో 0.08 ఎకరాల భూమిని 2020 ఆగస్టు 29న ఆమె పేరిట ఫౌతిపట్టా మార్పిడి చేయించుకుంది.
మనువడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
తండ్రి చనిపోయాడని పట్టామార్పు చేసిన అధికారులే.. మిగిలిన భూమిని ఈరప్పతో 2021 మార్చి 30న ఈశ్వరి పేరిట సేల్‌డీడ్ రిజిస్ట్రేషన్ చేయించారు. అంటే ఒకసారి ఈరప్ప బతికి ఉండగానే చనిపోయాడని కొంతభూమిని, ఆతరువాత అతడితోనే మిగిలిని భూమిని కూతురు ఈశ్వరి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న మనువడు సంతోష్ తాత భూమికి తానూ వారసుడిని ఉండగా .. అధికారులతో కుమ్మకై తన తాత ఈరప్ప భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఈశ్వరి, పరమేశ్వర్, సాయన్న, గంగరాం, శంకర్ తోపాటు మరికొందరు రెవెన్యూ అధికారులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ వివరించారు.