Vemulavada Murder: వేములవాడలో దారుణం, ఆస్తి కోసం ఇద్దరు భార్యల మధ్య ఘర్షణ..దాడిలో భర్త మృతి..రెండో భార్య పరిస్థితి విషమం-atrocity in vemulawada clash between two wives for property husband killed in attack ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Vemulavada Murder: వేములవాడలో దారుణం, ఆస్తి కోసం ఇద్దరు భార్యల మధ్య ఘర్షణ..దాడిలో భర్త మృతి..రెండో భార్య పరిస్థితి విషమం

Vemulavada Murder: వేములవాడలో దారుణం, ఆస్తి కోసం ఇద్దరు భార్యల మధ్య ఘర్షణ..దాడిలో భర్త మృతి..రెండో భార్య పరిస్థితి విషమం

HT Telugu Desk HT Telugu
Published Sep 30, 2024 07:48 AM IST

Vemulavada Murder: ఇద్దరు భార్యలు.. ఏడుగురు పిల్లలు...ఇద్దరు భార్యల మద్య ఆస్తి పంపకాల గొడవ కత్తిపోట్లకు దారి తీసి భర్త ప్రాణం తీసింది. రెండో భార్యను ఆసుపత్రి పాలు చేసింది. ఈ దారుణ ఘటన ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ లో జరిగింది.

ఆస్తి గొడవలో మృతి చెందిన  మామిండ్ల మల్లయ్య
ఆస్తి గొడవలో మృతి చెందిన మామిండ్ల మల్లయ్య

Vemulavada Murder: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కు చెందిన మామిండ్ల మల్లయ్య కు ఇద్దరు భార్యలు ఉన్నారు.‌ మొదటి భార్య బాలవ్వకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండో భార్య పద్మకు ఒక కొడుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మొదటి భార్య పిల్లలందరికీ పెళ్ళిలు కూడా అయ్యాయి. మల్లయ్య కొద్ది రోజులుగా రెండో భార్య పద్మతో ఉంటున్నాడు.

ఆస్తి పంపకాలు చేయాలని మొదటి భార్య బాలవ్వ ఆమె కొడుకులు కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు.

మల్లయ్య కుటుంబ సభ్యులు కుల సంఘం పెద్ద మనుషుల సమక్షంలో ఆస్తి పంపకాలపై పంచాయతీ నిర్వహించారు. వ్యవసాయ భూమి విషయంలో ఇద్దరు భార్యలు గొడవ పడ్డారు. ఎవరూ పట్టు వీడక పోవడంతో పెద్ద మనుషులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇద్దరు భార్యల మధ్య మాటమాట పెరగడంతో మొదటి భార్య బాలవ్వ ఆమె కొడుకు బంధువులు ఆగ్రహావేశాలతో మల్లయ్య, అతని రెండో భార్య పద్మ పై దాడి కి పాల్పడ్డారు. కత్తులతో దాడి చేయడంతో మల్లయ్య, పద్మ రక్తం మడుగులో పడిపోయారు.

స్థానికులు వెంటనే ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా మార్గమద్యలోనే మల్లయ్య ప్రాణాలు కోల్పోయారు. పద్మ పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ప్రాణిపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు.

పరారీలో మొదటి భార్య బందువులు…

ఆస్తి కోసం ఘర్షణ చోటు చేసుకుని ఇంటి యజమాని ప్రాణం పోవడంతో కుటుంబం చిన్నాభిన్నం అయ్యింది. మొదటి భార్య పిల్లలు, బంధువులు పరారీలో ఉండగా రెండో భార్య ఆసుపత్రి పాలు కావడంతో వారి ముగ్గురు పిల్లలు తండ్రి శవం వద్ద బిక్కుబిక్కుమంటూ బోరున విలపించారు.

ఈ ఘటనపై స్థానికుల పిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆరుగురు దాడి చేసినట్లు రెండో భార్య పిల్లలు తెలిపారు. ఆస్తి కోసం కుటుంబ సభ్యులు గొడవపడి కత్తులతో దాడికి తెగిపడడం కలకలం సృష్టిస్తుంది.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner