Heeraben Modi last rites : హీరాబెన్ అంత్యక్రియలు పూర్తి.. పాడె మోసిన మోదీ
30 December 2022, 10:40 IST
- Heeraben Modi last rites : గుజరాత్ గాంధీనగర్‌లోని ఓ శ్మశానవాటికలో హీరాబెన్ మోదీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. తల్లికి తుది వీడ్కోలు పలికారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
తల్లి హీరాబెన్ మోదీ పాడె మోసిన ప్రధాని మోదీ..
Heeraben Modi last rites : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. హీరాబెన్ మోదీ పాడె మోసిన ప్రధాని.. గాంధీనగర్‌లోని ఓ శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మోదీ కుటుంబసభ్యులు సైతం.. హీరాబెన్‌కు తుది వీడ్కోలు పలికారు.
100ఏళ్ల హీరాబెన్ మోదీ.. అనారోగ్యం కారణంతో చికిత్స పొందుతూ.. శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా కొన్ని రోజుల క్రితమే.. అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహ్తా హార్ట్ హాస్పిటల్లో చేరారు హీరాబెన్. ఆ సమయంలో మోదీ కూడా ఆమెను పరామర్శించారు. ఆమె ఆరోగ్య వివరాలను అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. హీరాబెన్ మోదీ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఒకటి- రెండు రోజుల్లో డిశ్ఛార్జ్ కూడా అవుతారని వార్తలు వెలువడ్డాయి. కానీ ఆమె మరణవార్తను శుక్రవారం ఉదయం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు మోదీ.
ఢిల్లీ నుంచి గాంధీనగర్‌కు..
PM Modi Mother Heeraben Death : తల్లి మరణవార్త తెలుసుకున్న మోదీ.. ఢిల్లీ నుంచి గుజరాత్‌కు బయలుదేరి వెళ్లారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో దిగిన మోదీ.. నేరుగా గాంధీనగర్‌లోని హీరాబెన్ నివాసానికి వెళ్లారు. ఆ సమయానికే హిరాబెన్ పార్థివదేహం సైతం అక్కడికి చేరుకుంది. అనంతరం తల్లి పాడె మోసిన ప్రధాని.. హీరాబెన్ భౌతికకాయాన్ని ఇంట్లోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత తల్లికి నివాళులర్పించారు. మోదీ కుటుంబసభ్యులు సైతం హీరాబెన్ నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు.
అనంతరం.. హీరాబెన్ మోదీ పార్థివదేహాన్ని గాంధీనగర్‌లోని ఓ శ్మశానవాటికకు తరలించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కుటుంబసభ్యులు.. హీరాబెన్‌కు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
Heeraben Modi death : గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మాజీ సీఎం విజయ్ రూపాణి, కేబినెట్ మంత్రులు.. హీరాబెన్ అంత్యక్రియలకు హాజరయ్యారు.
కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలతో పాటు విపక్షాలకు చెందిన పలువురు నేతలు సైతం హీరాబెన్ మృతి పట్ల సంతాపం తెలిపారు. కష్టకాలంలో మోదీ ధైర్యంగా ఉండాలని సానుభూతి ప్రకటించారు.
"ప్రధాని మోదీ తల్లి హీరా బా మరణ వార్త విని బాధ కలిగింది. ఓ వ్యక్తి జీవితంలో మొదటి స్నేహం, మొదటి టీచర్ మాతృమూర్తే. అలాంటి తల్లి కోల్పోవడం అనేది. ప్రపంచంలోనే అత్యంత బాధాకరమైన విషయం. కుటుంబాన్ని పోషించడం కోసం హీరా బా పడిన కష్టాలు స్ఫూర్తిదాయకం. ఆమె త్యాగాలు ఎప్పటికి గుర్తుండిపోతాయి. ఈ కష్టకాలంలో దేశం మొత్తం మోదీకి అండగా నిలుస్తుంది," అని ట్వీట్ చేశారు అమిత్ షా.
వర్చువల్‌గా..
PM Modi latest news : వాస్తవానికి.. ప్రధాని మోదీ.. నేడు పశ్చిమ్ బెంగాల్‌కు వెళ్లాల్సి ఉంది. అక్కడ పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించాల్సి ఉంది. తల్లి మరణం నేపథ్యంలో ఆయన అక్కడికి వెళ్లడం కుదరలేదు. అయితే.. ఆ ప్రాజెక్టులను.. మోదీ వర్చువల్‌గా లాంచ్ చేస్తారని తెలుస్తోంది.