PM Modi tributes to Heeraben : తల్లి హీరాబెన్‌కు మోదీ నివాళి
30 December 2022, 9:04 IST
- Heeraben Modi passed away : గుజరాత్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. తల్లి హీరాబెన్‌కు నివాళులర్పించారు. 100ఏళ్ల హీరాబెన్ మోదీ.. శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
హీరాబెన్ పార్థివదేహం వద్ద ప్రధాని మోదీ
PM Modi tributes to Heeraben : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. తన తల్లి హీరాబెన్ మోదీకి నివాళులర్పించారు. హీరాబెన్ మరణ వార్త అందిన వెంటనే.. ఢిల్లీ నుంచి గుజరాత్‌కు బయలుదేరిన మోదీ.. శుక్రవారం ఉదయం తన తల్లి భౌతికకాయానికి నమస్కారాలు చేశారు.
100ఏళ్ల హీరాబెన్ మోదీ.. అనారోగ్య సమస్యలకు చికిత్స పొందుతు.. శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా కొన్ని రోజుల క్రితమే.. అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహ్తా హార్ట్ హాస్పిటల్లో చేరారు హీరాబెన్. ఆ సమయంలో మోదీ కూడా ఆమెను పరామర్శించారు. ఆమె ఆరోగ్య వివరాలను అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. హీరాబెన్ మోదీ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఒకటి- రెండు రోజుల్లో డిశ్ఛార్జ్ కూడా అవుతారని వార్తలు వెలువడ్డాయి. కానీ ఆమె మరణవార్తను శుక్రవారం ఉదయం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు మోదీ.
ఆసుపత్రి నుంచి గాంధీనగర్ ఇంటికి హీరాబెన్ భౌతికకాయం చేరుకోగా.. అదే సమయంలో మోదీ కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తల్లి పార్థివదేహాన్ని ప్రధాని మోదీ స్వయంగా మోశారు. అనంతరం ఇంట్లో.. ఆమెకు నివాళులర్పించారు.
ప్రముఖుల సంతాపం..
Heeraben Modi passed away : హీరాబెన్ మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు పలువురు నేతలు. హీరాబెన్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు.
"ప్రధాని మోదీ తల్లి హీరా బా మరణ వార్త విని బాధ కలిగింది. ఓ వ్యక్తి జీవితంలో మొదటి స్నేహం, మొదటి టీచర్ మాతృమూర్తే. అలాంటి తల్లి కోల్పోవడం అనేది. ప్రపంచంలోనే అత్యంత బాధాకరమైన విషయం. కుటుంబాన్ని పోషించడం కోసం హీరా బా పడిన కష్టాలు స్ఫూర్తిదాయకం. ఆమె త్యాగాలు ఎప్పటికి గుర్తుండిపోతాయి. ఈ కష్టకాలంలో దేశం మొత్తం మోదీకి అండగా నిలుస్తుంది," అని ట్వీట్ చేశారు అమిత్ షా.
PM Modi Heeraben Modi news : "ప్రధాని మోదీ తల్లి హీరా బా మరణం చాలా బాధ కలిగించింది. ఇది తీరని లోటు. తల్లిలేని లోటును ఎవరు తీర్చలేరు. ప్రధాని మోదీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి," అని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
“ప్రధాని మోదీ తల్లి హీరా బా మరణ వార్త విని బాధ కలిగింది. ఈ కష్టకాలంలో ప్రధాని మోదీకి, ఆయన కుటుంబానికి నేను నా ప్రేమను పంచుతున్నాను,” అని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంక గాంధీలు కూడా మోదీకి సానుభూతిని తెలిపారు.