Kolkata Doctor Rape Case : మమతా బెనర్జీతో 2 గంటలపాటు వైద్యుల చర్చ.. 99 శాతం డిమాండ్లకు సీఎం ఓకే!
17 September 2024, 6:19 IST
- Kolkata Doctor Rape Case : కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం ఘటనపై నిరసన వ్యక్తం చేస్తున్న వైద్యులతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చర్చలు జరిపారు. ఇందులో భాగంగా సీఎం ముందు వైద్యులు పలు డిమాండ్లు పెట్టారు. వాటికి ఆమె అంగీకరించినట్టుగా తెలుస్తోంది.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, నిరసన తెలుపుతున్న వైద్యుల మధ్య గతంలో జరిగిన రెండు ప్రయత్నాలు విఫలమైన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం చర్చలు జరిగాయి. దాదాపు రెండు గంటల పాటు సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో వైద్యుల నిరసనలు రాష్ట్రంలోని ఆసుపత్రుల పనితీరుపై ప్రభావం చూపుతున్నందున తిరిగి విధుల్లోకి రావాలని ముఖ్యమంత్రి కోరారు. పని ప్రదేశాలలో భద్రత కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు.
కోల్‌కతాలో యువ వైద్యురాలిపై అత్యాచారం, హత్య జరిగినప్పటి నుండి జూనియర్ డాక్టర్లు నిరసనలు చేస్తున్నారు. కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్‌ను తొలగించాలన్న వారి డిమాండ్‌కు ముఖ్యమంత్రి కూడా అంగీకరించారు. త్వరలో కొత్త పోలీస్ కమిషనర్‌ని నియమించే అవకాశం ఉంది. గోయల్‌తో పాటు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌లను కూడా తొలగించారు.
తెల్లవారుజామున ఇద్దరు స్టెనోగ్రాఫర్లతో వైద్యులు ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. అంతకుముందు రోజు వైద్యులు సమావేశానికి సంబంధించిన సంభాషణలను రికార్డ్ చేయడానికి ఇరుపక్షాలను అనుమతిస్తేనే సమావేశం నిర్వహిస్తామని, అప్పుడే పాల్గొంటామని ముందస్తు షరతులు విధించారు. సోమవారం చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఇరుపక్షాలు కూడా సమావేశ వివరాలపై సంతకం చేస్తారని, వాటి వివరాలను ప్రతి పక్షాలకు అందజేస్తామని చెప్పారు. వైద్యులు చేసిన డిమాండ్లలో 99 శాతం డిమాండ్లకు మమతా బెనర్జీ ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది.
సీఎం ముందు వైద్యుల డిమాండ్లు
నేరానికి పాల్పడిన వారిని శిక్షించడం ద్వారా బాధితురాలికి న్యాయం. సంబంధిత అధికారులు, సీబీఐ, సుప్రీంకోర్టు విచారణను వేగవంతం చేయాలి
సందీప్ ఘోష్‌ను తప్పనిసరిగా సస్పెండ్ చేయాలి. అతనితో పాటు సాక్ష్యాలను తారుమారు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి.
అసమర్థ, ఆత్మసంతృప్తి పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి. పోలీసు కమిషనర్‌గా ఉన్న వినీత్ గోయల్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు.
అన్ని ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలలో ఆరోగ్య కార్యకర్తలకు భద్రత కల్పించాలని జూనియర్ వైద్యులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి ఆన్-కాల్ రూమ్‌లో పానిక్ బటన్‌లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఆరోగ్య శాఖల్లో ఇబ్బంది కలిగించే విషయాలకు స్వస్తి పలకాలని డాక్టర్లు డిమాండ్ చేశారు. ప్రతి మెడికల్ కాలేజీలో విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలన్నారు.
పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్, రెసిస్టెన్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం దిల్లీలో సమావేశం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో డాక్టర్ రాజేష్ పాండే మాట్లాడుతూ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో న్యాయమైన విచారణ జరగాలన్నదే తమ మొదటి డిమాండ్ అని అన్నారు. దేశంలోని మిగిలిన వైద్యులందరూ తమ నిరసనల్లో జూనియర్ డాక్టర్లతో ఉన్నారని చెప్పారు. నిరసనలో పాల్గొన్నందుకు పోలీసులు పిలిచి ప్రశ్నిస్తున్న విధానాన్ని మేము ఖండిస్తున్నామని చెప్పారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై ప్రభుత్వం ఇలాంటి చర్యలను ఆపాలని డిమాండ్ చేశారు.