బయటపడుతున్న ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అక్రమాలు.. కోల్‌కతాలో ఫ్లాట్లు, ఫామ్‌హౌస్‌లు
sandip ghosh : పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా ఆర్‌జి కర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు సంబంధించిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా ఈడీ అధికారులు అతడికి చెందిన ఇళ్లలో సోదాలు చేశారు. కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
కోల్‌కతా ఆర్‌జి కర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ఆర్థిక అవకతవకల కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది. ఇందులో భాగంగా ఈడీ అధికారులు సందీప్ ఘోష్, అతని సమీప బంధువులు, సహచరుల నివాసంతో సహా ఏడు ప్రదేశాల్లో ఇప్పటికే సోదాలు చేశారు. సందీప్ ఘోష్ భార్య ప్రభుత్వ అనుమతి లేకుండా రెండు స్థిరాస్తులు కలిగి ఉన్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వెల్లడించింది.
సందీప్ ఘోష్‌ను సెప్టెంబర్ 2న సీబీఐ అరెస్టు చేసింది. సెప్టెంబర్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఇందులో భాగంగా అతడు ఆర్‌జి కర్ ఆసుపత్రిలో ప్రిన్సిపాల్‌గా ఉన్న సమయంలో చేసిన ఆర్థిక అవకతవకలపై విచారణ జరుగుతుంది. మెుదట జూనియర్ వైద్యురాలి హత్యాచారం కేసులో సందీప్ ఘోష్‌ను విచారణ చేశారు. ఆ తర్వాత అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో ఆ విషయంపై కూడా దర్యాపు చేయాలని కోర్టు ఆదేశించింది.
కళాశాల, ఆసుపత్రిలో అవినీతి, ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలపై ప్రస్తుతం సందీప్ ఘోష్ విచారణ ఎదుర్కొంటున్నాడు. కలకత్తా హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాల మేరకు ఈ విషయంపై సీబీఐ విచారణకు ఆదేశించింది.
ED ప్రకారం సందీప్ ఘోష్ భార్య డాక్టర్ సంగీతా ఘోష్ రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నుండి సరైన అనుమతి లేకుండా రెండు స్థిరాస్తులను కొనుగోలు చేశారు. 2021లో ఆమె భర్త సందీప్ ఘోష్ ఆస్తిని కొనుగోలు చేయడానికి సంగీతా ఘోష్‌కు పోస్ట్ ఫాక్టో ఆమోదం లభించిందని ED తెలిపింది. ఈ సమయంలో సందీప్ ఘోష్ RG కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ హోదాలో, అతని భార్య అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమించబడ్డారని పేర్కొంది.
సోదాల్లో ముర్షిదాబాద్‌లోని ఒక ఫ్లాట్, కోల్‌కతాలోని మూడు ఫ్లాట్ల గురించి తెలిసింది. కోల్‌కతాలో సందీప్ ఘోష్, అతని భార్య సంగీత సంపాదించిన రెండు ఇళ్లతో సహా ఆస్తులకు సంబంధించిన పత్రాలు, దంపతులకు చెందిన ఫామ్‌హౌస్‌లకు సంబంధించిన పత్రాలు లభించాయని ఈడీ తెలిపింది.
'డాక్టర్ సందీప్ ఘోష్‌కు చెందిన అనేక ఇతర నేరారోపణ పత్రాలు, డిజిటల్ పరికరాలను సోదాల సమయంలో స్వాధీనం చేసుకున్నాం. అక్రమంగా కొనుగోలు చేశారన్న అనుమానంతో ప్రాపర్టీలకు సంబంధించిన ఈ పత్రాలను స్వాధీనం చేసుకున్నాం.' అని ఈడీ పేర్కొంది.