తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kolkata Doctor Rape Case : వైద్యురాలి హత్యాచారం కేసులో మాజీ ప్రిన్సిపాల్, పోలీస్ అధికారికి సీబీఐ కస్టడీ పొడిగింపు

Kolkata Doctor Rape Case : వైద్యురాలి హత్యాచారం కేసులో మాజీ ప్రిన్సిపాల్, పోలీస్ అధికారికి సీబీఐ కస్టడీ పొడిగింపు

Anand Sai HT Telugu

18 September 2024, 6:36 IST

google News
    • Kolkata Doctor Rape Case : కోల్‌కతాలో వైద్యురాలి హత్యాచారం కేసులో మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, పోలీస్ అధికారి అభిజిత్ మోండల్‌కు సీబీఐ కస్టడీ పొడిగించారు. ఈ మేరకు మరో మూడు రోజులు వారిని సీబీఐ విచారించనుంది.
సీబీఐ కస్టడీకి సందీప్ ఘోష్, పోలీసు అధికారి మెుండల్
సీబీఐ కస్టడీకి సందీప్ ఘోష్, పోలీసు అధికారి మెుండల్ (HT_PRINT)

సీబీఐ కస్టడీకి సందీప్ ఘోష్, పోలీసు అధికారి మెుండల్

ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అభిజిత్ మోండల్‌ల సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కస్టడీని సిటీ కోర్టు మూడు రోజుల వరకు పొడిగించింది. ఆగస్టు 9న ఆసుపత్రిలోని సెమినర్ హాల్‌లో ట్రైనీ మహిళా డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో వారిని అధికారులు విచారిస్తున్నారు.

31 ఏళ్ల వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో ఘోష్, మోండల్‌లను సెప్టెంబర్ 14 న సీబీఐ అరెస్టు చేసింది. కోర్టు వారిని సీబీఐ కస్టడీకి రిమాండ్ చేసింది. సాక్ష్యాధారాలను ధ్వంసం చేసిన ఆరోపణలపై ఘోష్‌ను అరెస్టు చేయగా, సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడం, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం చేసినందుకు మోండల్‌ను అరెస్టు చేశారు. ఘోష్, మోండల్ విచారణకు సహకరించనందున కస్టడీని పొడిగించాలని సీబీఐ కోర్టును కోరింది.

ఆగస్టు 9న వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్యకు సంబంధించిన విషయంపై సీబీఐ విచారణ చేస్తుంది. వీరిద్దరి ప్రమేయంపై రుజువు చేసే ఎలాంటి ఆధారాలు దర్యాప్తు అధికారులు ఇంకా కనుగొనలేదని, అయితే వారి కాల్ వివరాలు, కొన్ని నంబర్‌లకు అనేక కాల్‌లు చేసినట్లు వెల్లడించాయని సీబీఐ.. కోర్టుకు తెలిపింది. వారిద్దరి రిమాండ్‌ను కోర్టు సెప్టెంబర్ 20 వరకు పొడిగించినట్లు వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.

తీవ్రమైన గాయాలతో ఉన్న వైద్యురాలి మృతదేహం ఆగస్టు 9న కనిపించింది. కోల్‌కతా పోలీసులు మరుసటి రోజు ఈ కేసుకు సంబంధించి పౌర వాలంటీర్ సంజయ్ రాయ్‌ను అరెస్టు చేశారు.

మాజీ ప్రిన్సిపాల్ ఘోష్ పాత్రతో సహా ఈ కేసులో కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని, ఆసుపత్రి అధికారుల తీరుపై దర్యాప్తు చేయాలని పిటిషన్లు దాఖలు అయ్యాయి. కలకత్తా హైకోర్టు ఆగస్టు 13న కోల్‌కతా పోలీసుల నుంచి కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేసింది. ఈ కేసును సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది.

మరోవైపు ఆర్థిక అవకతవకల కేసులో ఘోష్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఘోష్, అతని ఇద్దరు సహచరులను సీబీఐ సెప్టెంబర్ 2న అదుపులోకి తీసుకుంది. అతను ప్రిన్సిపాల్‌గా ఉన్న సమయంలో ఆర్‌జి కర్ ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టుగా తేలింది. ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ పిటిషన్‌పై హైకోర్టు.. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నుండి ఇన్‌స్టిట్యూట్‌లో ఆర్థిక అవకతవకల కేసును సీబీఐకి బదిలీ చేసింది. ఇప్పటికే సీబీఐ అధికారులు సందీప్ ఘోష్‌కు సంబంధించిన నివాసాల్లో సోదాలు చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం