Canada Temple attack : కెనడా ఆలయంలో భక్తులపై దాడి- భయపెడుతున్న లైవ్ వీడియో..
04 November 2024, 7:21 IST
- Canada Temple attack : కెనడా బ్రాంప్టన్‌లో హిందూ-కెనడియన్ భక్తులపై ఖలిస్థాన్ వేర్పాటువాదులు దాడి చేశారు. ఈ హింసాత్మక దాడి కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాదం తీవ్రతను తెలియజేస్తుంది. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింి.
కెనడా ఆలయంపై దాడి- లైవ్ వీడియో..
కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాదం రోజురోజుకు ఆందోళనకరంగా మారింది. బ్రాంప్టన్‌లోని హిందూ సభ ఆలయం వద్ద ఖలిస్తాన్ తీవ్రవాదులు హిందూ-కెనడియన్ భక్తులపై దాడి చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కెనడా ఆలయంలో దాడి..
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ప్రకారం.. ఖలిస్తానీ జెండాలు పట్టుకున్న కొందరు, ఆలయం వద్ద ఉన్న భక్తులపై దాడికి పాల్పడ్డారు. చేతులతో కొట్టారు, కర్రలతో దాడి చేశారు. చాలా మంది భక్తులు అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు.
ఖలిస్థాన్ తీవ్రవాదులు రెడ్ లైన్ దాటారని కెనడా పార్లమెంటు సభ్యుడు చంద్ర ఆర్య అన్నారు.
“కెనడియన్ ఖలిస్తానీ తీవ్రవాదులు శృతి మీరారు. బ్రాంప్టన్‌లోని హిందూ సభ ఆలయ ప్రాంగణంలో హిందూ-కెనడియన్ భక్తులపై ఖలిస్తానీలు చేసిన దాడి, కెనడాలో ఖలిస్తానీ హింసాత్మక తీవ్రవాదం ఎంత లోతుగా మారిందో తెలియజేస్తుంది. ఇది సిగ్గుచేటు! కెనడియన్ రాజకీయ యంత్రాంగంతో పాటు ఖలిస్తానీలు మన జుడీషియల్ వ్యవస్థలోకి సమర్థవంతంగా చొరబడ్డారనే వార్తల్లో కొంత నిజం ఉందని నేను భావిస్తున్నాను,” అని ఆయన అభిప్రాయపడ్డారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోని ఇక్కడ చూడండి :
"భావప్రకటనా స్వేచ్ఛ' కింద ఖలిస్తానీ తీవ్రవాదులకు కెనడాలో ఫ్రీ పాస్ లభించడంలో ఆశ్చర్యం లేదు. నేను చాలా కాలంగా చెబుతున్నట్లుగా, హిందూ-కెనడియన్లు, మన సమాజ భద్రత కోసం, తమ హక్కులను ధృవీకరించడానికి, రాజకీయ నాయకులను జవాబుదారీగా ఉంచాల్సిన అవసరం ఉంది," అని ఆయన అన్నారు.
దాడిని తీవ్రంగా ఖండించిన పియరీ పొయిలీవ్రే..
కెనడా ప్రతిపక్ష నేత పియరీ పొయిలీవ్రే ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.
"బ్రాంప్టన్‌లోని హిందూ సభ మందిరంలో భక్తులను లక్ష్యంగా చేసుకుని హింస చెలరేగడం పూర్తిగా ఆమోదయోగ్యం కాదు,' అని పోయిలీవ్రే ట్వీట్ చేశారు.
“కెనడియన్లందరూ తమ విశ్వాసాన్ని శాంతియుతంగా ఆచరించడానికి స్వేచ్ఛగా ఉండాలి. ఈ హింసను సంప్రదాయవాదులు నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాను. ప్రజలందరినీ ఏకం చేసి అరాచకాలకు ముగింపు పలుకుతాను, అని చెప్పారు
గత ఏడాది విండ్సర్లోని ఓ హిందూ దేవాలయం భారత వ్యతిరేక గ్రాఫిటీతో ధ్వంసమవడంతో కెనడా, భారత అధికారుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. గతంలో మిస్సిసాగా, బ్రాంప్టన్లలో జరిగిన ఘటనల్లో ఆలయాలను కూడా ఇదే తరహాలో లక్ష్యంగా చేసుకోవడంపై కెనడాలోని భారతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
ఖలిస్తానీ వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణంతో వర్మ, ఇతర దౌత్యవేత్తలతో సహా భారత ప్రభుత్వ ఏజెంట్లకు సంబంధం ఉందని ప్రధాని జస్టిన్ ట్రూడో "విశ్వసనీయ ఆరోపణలను" ఉదహరించిన తరువాత ఇరు దేశాల మధ్య సంబంధాలు గత సంవత్సరం క్షీణించాయి. ఈ ఆరోపణలను భారత్ పదేపదే ఖండించింది. అవి అసంబద్ధమైనవని పేర్కొంది. కెనడా తమ దేశంలో తీవ్రవాద- భారత వ్యతిరేక శక్తులకు స్థానం కల్పిస్తోందని ఆరోపించింది.