Canada crime: కెనడాలో వాల్ మార్ట్ ఓవెన్ లో శవమై తేలిన భారతీయ యువతి; హత్యగా అనుమానిస్తున్న ఫ్యామిలీ-indian teenager baked to death in canada walmart oven what we know so far ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Canada Crime: కెనడాలో వాల్ మార్ట్ ఓవెన్ లో శవమై తేలిన భారతీయ యువతి; హత్యగా అనుమానిస్తున్న ఫ్యామిలీ

Canada crime: కెనడాలో వాల్ మార్ట్ ఓవెన్ లో శవమై తేలిన భారతీయ యువతి; హత్యగా అనుమానిస్తున్న ఫ్యామిలీ

Sudarshan V HT Telugu

Canada crime: భారత్ కు చెందిన 19 ఏళ్ల యువతి కెనడాలోని ఒక వాల్ మార్ట్ స్టోర్ లోని భారీ ఓవెన్ లో శవమై కనిపించింది. కెనడాలోని హాలిఫాక్స్ లోని వాల్ మార్ట్ ఓవెన్ లో ఆ 19 ఏళ్ల యువతి మృతదేహం కనిపించింది. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

కెనడాలో వాల్ మార్ట్ ఓవెన్ లో శవమై తేలిన భారతీయ యువతి (AP)

Canada crime: కెనడా వాల్ మార్ట్ కు చెందిన వాక్ ఇన్ ఓవెన్ లో ఓ భారతీయ యువతి శవమై కనిపించింది. 19 ఏళ్ల గుర్ సిమ్రాన్ కౌర్ ఇటీవల హాలిఫాక్స్ కు వెళ్లి తన తల్లితో కలిసి వాల్ మార్ట్ లోని బేకరీ విభాగంలో పనిచేస్తోంది. కాగా, ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన కెనడాలోని సిక్కు కమ్యూనిటీని షాక్ కు గురి చేసింది. బాధిత కుటుంబానికి ఆర్థికంగా మద్ధతు ఇవ్వడానికి అక్కడి సిక్కు సమాజం డిజిటల్ ఫండ్ రైజర్ ను ప్రారంభించారు.

రాత్రి సమయంలో..

ఈ శనివారం రాత్రి 9:30 గంటల సమయంలో హాలిఫాక్స్ రీజనల్ పోలీసులను సంఘటనా స్థలానికి పిలిపించి చూడగా ఆమె మృతదేహం వాక్ ఇన్ ఓవెన్ లో కనిపించింది. ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఆ వాల్ మార్ట్ దుకాణాన్ని మూసివేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరణానికి గల కారణాలు దర్యాప్తులో తేలుతాయని పోలీసులు తెలిపారు. ఈ దర్యాప్తు సంక్లిష్టమైనదని పోలీసు కానిస్టేబుల్ మార్టిన్ క్రోమ్వెల్ అభివర్ణించారు. దర్యాప్తును త్వరగా ముగించడానికి ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేస్తున్నారని చెప్పారు.

ఓవెన్ లోపల మృతదేహం

19 ఏళ్ల గుర్ సిమ్రాన్ కౌర్ కుటుంబం భారత్ లోని పంజాబ్ నుంచి ఉపాధి నిమిత్తం కెనడాకు వెళ్లారు. గుర్ సిమ్రాన్ కౌర్ మృతదేహం ఆమె తల్లికి ఓవెన్ లోపల కనిపించింది. ఆ యువతి సాధారణంగా ఫోన్ స్విచ్ఛాఫ్ చేయదని, కానీ, ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ గా ఉందని ఆమె తల్లి పోలీసులకు తెలిపారు. దాంతో, ఆమె తన కుమార్తె ఆచూకీ కోసం పదేపదే ప్రయత్నించింది. అయితే, ఆ వాల్ మార్ట్ స్టోర్ లోని ఇతర ఉద్యోగులు ఆమె ఆందోళనలను తోసిపుచ్చారు. కౌర్ ఇతర కస్టమర్లకు సహాయం చేయడంలో బిజీగా ఉండవచ్చని సూచించారు. అయితే, ఆ ఓవెన్ నుంచి లీకేజీ కనిపించడంతో చివరకు ఆ ఓవెన్ ను తెరిచి చూశారు.

హత్యగా అనుమానం

19 ఏళ్ల గుర్ సిమ్రాన్ కౌర్ ను మరో వ్యక్తి ఆ భారీ ఓవెన్ లోపల ఉంచినట్లు అనుమానిస్తున్నారు. ఆ ఓవెన్ ఆన్ లో ఉందని, డోర్ హ్యాండిల్ ఉందని, లోపలి నుంచి దాన్ని మూయడం, తెరవడం అసాధ్యమని వాల్ మార్ట్ ఉద్యోగి ఒకరు పేర్కొన్నారు. లోపలినుంచి ఓవెన్ ను ఆన్ చేయడం కూడా సాధ్యం కాదని అన్నారు. కౌర్ ను ఎవరైనా హత్య చేసి కానీ, లేదా అపస్మారక స్థితిలో ఉండగా కానీ, ఆ భారీ ఓవెన్ లో పెట్టి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ భారీ వాక్-ఇన్ ఓవెన్లను క్యాబినెట్ లేదా బ్యాచ్ ఓవెన్లు అని కూడా పిలుస్తారు. సూపర్ మార్కెట్లు వంటి ప్రదేశాలలో, పెద్ద పెద్ద బేకరీలలో ఇవి తరచుగా కనిపిస్తాయి.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.