Rava cake: ఇంట్లో బర్త్‌డేలకు రవ్వ కేక్ ఈజీగా చేసేయొచ్చు.. ఓవెన్ కూడా అక్కర్లేదు, టేస్టీ స్నాక్ కూడా-how to make rava or sooji cake at home without oven and eggs ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rava Cake: ఇంట్లో బర్త్‌డేలకు రవ్వ కేక్ ఈజీగా చేసేయొచ్చు.. ఓవెన్ కూడా అక్కర్లేదు, టేస్టీ స్నాక్ కూడా

Rava cake: ఇంట్లో బర్త్‌డేలకు రవ్వ కేక్ ఈజీగా చేసేయొచ్చు.. ఓవెన్ కూడా అక్కర్లేదు, టేస్టీ స్నాక్ కూడా

Koutik Pranaya Sree HT Telugu
Sep 16, 2024 03:40 PM IST

Rava cake: ఇంట్లో రవ్వతోనే రుచికరమైన కేక్ తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ మీ వంటగదిలో ఉండేవే. ఓవెన్ కూడా అవసరం లేకుండా రవ్వ కేక్ తయారీ ఎలాగో చూడండి.

రవ్వ కేక్
రవ్వ కేక్ (pinterest)

కేక్ అనగానే భయపడిపోతారు చాలా మంది. దాని తయారీ చాలా కష్టం అనుకుంటారు. కానీ వెస్టర్న్ స్టైల్ కాకుండా ఇలా మనింట్లో ఉండే పదార్థాలతోనే సాంప్రదాయ రవ్వ కేక్ చేయొచ్చు. దీనికి పెద్దగా కొత్తవేమీ అవసరం లేదు. ఓవెన్ కూడా అవసరం లేదు. గుడ్లు వాడకుండా చేస్తాం. ఉప్మా చేసినంత సింపుల్‌గా ఈ రవ్వ కేక్ చేసేస్తారు. మీ కుటుంబ సభ్యుల, పిల్లల పుట్టిన రోజులకు ఈ కేక్ చేసి ఆశ్చర్చపర్చండి. తయారీ చూసేయండి.

రవ్వ కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

2 కప్పుల సన్నం రవ్వ

సగం కప్పు నూనె

1 కప్పు పంచదార

ఒకటిన్నర కప్పుల పాలు

చిటికెడు ఉప్పు

పావు చెంచా వంట సోడా

సగం టీస్పూన్ యాలకుల పొడి

2 చెంచాల రంగుల టూటీ ఫ్రూటీ

పావు చెంచా బేకింగ్ పౌడర్

రవ్వ కేక్ తయారీ విధానం:

  1. ముందుగా మిక్సీ జార్‌లో రవ్వను వేసుకుని సన్నగా మిక్సీ పట్టుకోవాలి. రవ్వ ఎంత సన్నగా ఉన్నా సరే ఇలా చేయడం తప్పనిసరి. 
  2. ఇప్పుడు ఒక పెద్ద పాత్రలో సగం కప్పు నూనె, పెరుగు, పంచదార వేసుకుని కలపండి
  3. దీనికోసం విస్కర్ వాడితే మంచిది. విస్కర్ లేకపోతే చెంచాతోనే వేగంగా గిలక్కొట్టుకుంటూ కలపాలి. పంచదార మొత్తం పూర్తిగా కరిగిపోయాక మరో కప్పు పాలు పోసి మళ్లీ అలాగే విస్కర్ తో వేగంగా కలపాలి. 
  4. మంచి క్రీమీ మిశ్రమం రెడీ అవుతుంది. ఇందులో పొడి చేసుకున్న రవ్వను, చిటికెడు ఉప్పు వేసి మరోసారి అన్నీ కలియబెట్టాలి.
  5. ఈ మిశ్రమాన్ని పావుగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు రవ్వ బాగా నానిపోతుంది. 
  6. ఇప్పుడు అడుగు కాస్త లోతుగా ఉన్న పల్లెం ఒకటి తీసుకోండి. ఏదైనా వెడల్పాటి పాత్ర అయినా పరవాలేదు. మీరు పిండి పోసుకున్నాక మీద కాస్త ఖాళీ మాత్రం ఉండేలా చూసుకోండి.
  7. ఈ పాత్రకు నూనె రాసుకుని బేకింగ్ పేపర్ పెట్టుకోండి. ఇది పెట్టుకుంటే కేక్ తొందరగా బయటకు వస్తుంది. ఈ పేపర్ లేకపోతే నూనె రాశాక పల్లెంలో కాస్త మైదా పొడి జల్లించాలి. దీంతో పిండి అంటుకోదు.
  8. పిండిలో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడ్, యాలకుల పొడి, పావు కప్పు పాలు పోసి మరోసారి కలపాలి. 
  9. ఇప్పుడు సగం చెంచా టూటీ ఫ్రూటీలు వేసి పిండిలో కలిపేయండి. మిగతావి పక్కనుంచండి.
  10. ఈ పిండిని పల్లెంలో పోసుకోండి. మీద మిగిలిన టూటీ ఫ్రూటీలు చల్లేయండి. 
  11. ఒక అడుగు మందం ఉన్న కడాయి లేదా ప్యాన్ పెట్టుకుని అందులో స్టాండ్ పెట్టండి. 
  12. దాన్ని మూత పెట్టి పది నిమిషాలు వేడి అవ్వనివ్వండి. వేడెక్కిన పాత్రలోపల కేక్ మిశ్రమం పోసుకున్న పల్లెం పెట్టేసి మూత పెట్టేయండి. వేడి బయటకు పోకుండా చూడండి.
  13. అరగంట తర్వాత ఒక టూత్ పిక్ తో గుచ్చి చూస్తే పిండి అంటుకోకూడదు. అలా అయితే రవ్వ కేక్ రెడీ అయినట్లే. 

 

టాపిక్