TG Police Dismissed: ఆందోళనకు దిగిన పది మంది స్పెషల్ పోలీసులపై డిస్మిస్ వేటు, అధికారుల ఉత్తర్వులపై ఆందోళన
TG Police Dismissed: సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు దిగిన తెలంగాణ స్పెషల్ పోలీసులపై వేటు వేశారు. క్రమశిక్షణ ఉల్లంఘించారంనే అభియోగాలతో పదిమంది టీజీఎస్పీ పోలీసులను డిస్మిస్ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేయడం కలకలం రేపింది. మరికొందరిపై వేటు పడుతుందని ప్రచారం జరుగుతోంది.
TG Police Dismissed: వెట్టి చాకిరి ఆరోపణలతో పాటు సెలవులు డిమాండ్ చేస్తూ రోడ్డెక్కిన పోలీసులపై ఉన్నతాధికారులు క్రమశిక్షణా చర్యలు చేపట్టారు. కొద్ది రోజులుగా తెలంగాణలో సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో స్పెషల్ పోలీసుల కుటుంబాలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టడంతో కలకలం రేగింది. దీంతో ఆందోళనకు దిగిన పోలీసు సిబ్బందిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు.
నిరసనలు, ఆందోళనల పేరుతో పోలీసు శాఖ నిబంధలకు విరుద్ధంగా వ్యవహరించా రంటూ 30 మంది హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను శనివారం సస్పెండ్ చేయగా ఆదివారం ఏఆర్ ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ సహా ఏకంగా 10 మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకే రాష్ట్రం, ఒకే పోలీస్ నిబంధనల పేరుతో ఆందోళన నిర్వహించిన పోలీసులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు.
క్రమశిక్షణతో ఉండాల్సిన పోలీసు శాఖలో సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా నిరసన తెలిపారన్న కారణంతో ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ విభాగంలో ఉద్యోగులకు సెలవులతో పాటు ఇతర అంశాలకు సంబంధించిన విధివిధానాలపై అడిషనల్ డీజీపీ ఇటీవల జారీ చేసిన సర్క్యులర్‌ను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీజీఎస్పీ బెటాలియన్ల సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు నిరసనలకు దిగారు.
ఆర్డర్లీ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేయడంతో పాటు, సెలవులు ఇవ్వకపో వడం, ఇతర సమస్యలను పరిష్కరించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో దిగువ స్థాయి సిబ్బంది పరిధి దాటి వ్యవహరించినట్లు పోలీసు శాఖ అంతర్గత విచారణలో నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో పదిమంది సిబ్బందిని డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇబ్రహీంపట్నంలోని 3వ బెటాలియన్‌లో కానిస్టేబుల్ జి.రవికుమార్, భద్రాద్రి కొత్తగూడంలోని ఆరో బెటాలి యన్ కానిస్టేబుల్ కె.భూషణావు, అన్నెపర్తి 12వ బెటాలియన్‌లో హెడ్ కానిస్టేబుల్ వి.రామకృష్ణ, కానిస్టేబుల్ ఎస్.కె.షఫీ, సిరిసిల్లలోని 17వ బెటా లియన్లో ఏఆర్ ఎస్సై సాయిరామ్, కానిస్టేబుళ్లు కె.లక్ష్మీనారాయణ, ఎస్.కరుణాకర్ రెడ్డి, టి.వంశీ, బిఆశోక్, ఆర్ శ్రీనివాస్‌లను విధుల నుంచి తొలిగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు.
విధుల నుంచి తొలగిస్తున్న వారందరిపై ఆర్టికల్ 311(2)(బి) ప్రకారం చర్యలు తీసుకున్నట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. నిరసనల పేరుతో బెటాలియన్లలో చోటు చేసుకున్న పరిణామాలపై విచారణ కొనసాగుతోందని, నిబంధనలకు విరు ద్ధంగా వ్యవహరించిన వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. నిరసనలు తెలిపిన మరికొందరిపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టీజీఎస్పీ బెటాలియన్ సిబ్బంది తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని క్రమశిక్షణ ఉల్లంఘించరాదని ఉన్నతాధికారులు సూచించారు.
చర్చనీయాంశంగా ఉత్తర్వులు…
పోలీస్ శాఖలో ఆర్డర్లీ వ్యవస్థపై ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. పేరుకు పోలీస్ ఉద్యోగాలే అయినా స్పెషల్ పోలీస్ బలగాల సిబ్బందిని కట్టుబానిసల కంటే హీనంగా సొంత పనులకు వాడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆర్డర్లీ పేరుతో సీఐలు మొదలుకుని డీజీపీల వరకు తమ సొంత పనులు, సేవల కోసం సాటి పోలీసు సిబ్బందితో నిర్ధాక్షణ్యంగా సొంత పనులు చేయించుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి.
శాంతి భద్రతలను అదుపు చేయడం, అదనపు సిబ్బంది అవసరమైన సమయాల్లో వాడుకోడానికి యూనిఫాం సిబ్బంది సేవల్ని వాడుకోవాల్సి ఉన్నా ఇళ్లలో పాచిపనులు చేయడం, గార్డెనింగ్ చేయడం, వంట పని, అధికారుల పిల్లల్ని ఆడించడం, స్కూళ్లకు తీసుకెళ్లడం, డ్రైవింగ్ వంటి పనులకు పరిమితం చేస్తున్నారు. ఈ క్రమంలో వారి వ్యక్తిగత స్వేచ్ఛను, కుటుంబాలను కూడా దూరం చేస్తున్నారు.
ఇలా పోలీస్ అధికారుల వ్యక్తిగత సేవల కోసం వేల సంఖ్యలో పోలీస్ సిబ్బందిని అధికారులు సొంత సేవల కోసం వాడుకోవడంపై కింది స‌్థాయి సిబ్బందిలో అసంతృప్తి ఉంది. ఇటీవల సెలవులతో పాటు విధుల నిర్వహణపై జారీ చేసిన ఉత్తర్వులపై సిబ్బంది ఆందోళనకు దిగడంతో ఏకంగా డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.