Bengaluru: బెంగళూరులో పెరుగుతున్న చిల్లర దొంగలు; సూపర్ మార్కెట్లు ఏం చేశాయంటే..?-supermarket chains in bengaluru ban face masks amid rise in theft cases report ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bengaluru: బెంగళూరులో పెరుగుతున్న చిల్లర దొంగలు; సూపర్ మార్కెట్లు ఏం చేశాయంటే..?

Bengaluru: బెంగళూరులో పెరుగుతున్న చిల్లర దొంగలు; సూపర్ మార్కెట్లు ఏం చేశాయంటే..?

Sudarshan V HT Telugu
Sep 03, 2024 03:41 PM IST

చిల్లర దొంగతనాలు పెరుగుతుండడంతో బెంగళూరులోని సూపర్ మార్కెట్లు కొత్త నిర్ణయం తీసుకున్నాయి. వినియోగదారులు తమ సూపర్ మార్కెట్లలో ఫేస్ మాస్క్ లు ధరించకూడదని నిషేధం విధించాయి. ఆ చిల్లర దొంగలు తమ గుర్తింపును దాచడానికి ఫేస్ మాస్క్ లను ఉపయోగిస్తున్నారని, అందువల్ల ఫే్ మాస్క్ లను నిషేధిస్తున్నామని తెలిపాయి.

బెంగళూరులో పెరుగుతున్న చిల్లర దొంగలు
బెంగళూరులో పెరుగుతున్న చిల్లర దొంగలు (PTI)

Bengaluru news: బెంగళూరులో అనేక స్థానిక సూపర్ మార్కెట్లు ఇప్పుడు వినియోగదారులు ఫేస్ మాస్క్ ధరించకూడదని నిషేధం విధించాయి. చిల్లర దొంగల సమస్యతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు నివేదించాయి. సూపర్ మార్కెట్లోకి వచ్చి వస్తువులను దొంగతనంగా తీసుకువెళ్తున్నవారు మాస్కుల వెనుక తమ గుర్తింపును దాచుకుంటున్నారని వివరించాయి.

చిన్న, చిన్న దొంగతనాలే కానీ..

మాస్కులు ధరించిన వ్యక్తులు చేసిన దొంగతనాల కారణంగా తమ దుకాణాలు గణనీయంగా నష్టపోయాయని కెంగేరిలోని ఒక సూపర్ మార్కెట్ చైన్ సిబ్బంది వెల్లడించారు. గత నెల రోజుల్లో ఈ ప్రాంతంలోని రెండు సూపర్ మార్కెట్లలో సుమారు రూ.3 లక్షల విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయి. వీటిలో ఒక చోట రూ.1.2 లక్షల మేర నష్టం వాటిల్లింది. సీసీటీవీ ఫుటేజీల ద్వారా నిందితులు తమ గుర్తింపును దాచుకునేందుకు మాస్క్ లను ఉపయోగిస్తున్నారని గుర్తించిన సూపర్ మార్కెట్ యాజమాన్యం వాటిని నిషేధించాలని నిర్ణయించింది.

దుస్తుల్లో దాచుకుని..

ఆ చిల్లర దొంగలు తాము దొంగిలించిన వస్తువులను వ్యక్తిగత బ్యాగుల్లో లేదా దుస్తుల కింద దాచిపెడతారని ఓ సూపర్ మార్కెట్ ఉద్యోగి తెలిపారు. వారు సాధారణంగా చెక్అవుట్ వద్ద కొన్ని చవకైన వస్తువులకు డబ్బు చెల్లిస్తారు. ఖరీదైన వస్తువులను తమతో తెచ్చుకున్న హ్యాండ్ బ్యాగ్ ల్లోనో, లేక దుస్తుల కిందనో దాచుకుని బయటపడుతున్నారని పలు సందర్భాల్లో సూపర్ మార్కెట్ యాజమాన్యాలు గుర్తించాయి. కొన్ని దుకాణాల్లో పర్సనల్ బ్యాగులను లోపలికి అనుమతించకూడదనే విధానం ఉన్నప్పటికీ, చిన్న దుకాణాల్లో అలాంటి షరతులు ఉండవు.

పోలీసులకు చెప్పలేం..

ఇవి చిన్నచిన్న దొంగతనాలు కావడంతో, ఒక్కో సందర్భంలో నష్టపోయిన మొత్తం చిన్నదే కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోతున్నామని బెంగళూరు (bengaluru) లోని సూపర్ మార్కెట్ యాజమాన్యాలు చెబుతున్నాయి. చోరీకి గురైన వస్తువుల విలువ సాధారణంగా రూ.1,000 నుంచి రూ.2,000 వరకు ఉంటుందని, అందువల్ల పోలీసులు ఈ ఫిర్యాదులను సీరియస్ గా తీసుకోరని వివరించారు. అయితే, మొత్తంగా చూస్తే, నెలలో ఇలా నష్టపోయిన వస్తువుల విలువ లక్షల్లో ఉంటుందని వివరించారు. అదీకాక, ఒక చోట దొంగతనం చేసిన తరువాత, ఆ దొంగలు మళ్లీ చాలా రోజుల పాటు ఆ మార్కెట్ కు రాకుండా జాగ్రత్త పడ్తారని వివరించారు.

పోలీసుల స్పందన

మాస్కులు ధరించి చేసే దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి నేరాలను దర్యాప్తు చేయడం చాలా కష్టమని ఒక పోలీసు అధికారి తెలిపారు. మాస్క్ ల వల్ల దొంగలను గుర్తించడం కష్టమవుతుందని, ఇది అనుమానితులను గుర్తించే ప్రక్రియను క్లిష్టతరం చేస్తుందని వివరించారు.