Nizamabad News : నిజామాబాద్ జిల్లాలో విషాదం, సూపర్ మార్కెట్ లో ఫ్రిడ్జ్ షాక్ కొట్టి చిన్నారి మృతి-nizamabad four years kid died supermarket fridge electrocution ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nizamabad News : నిజామాబాద్ జిల్లాలో విషాదం, సూపర్ మార్కెట్ లో ఫ్రిడ్జ్ షాక్ కొట్టి చిన్నారి మృతి

Nizamabad News : నిజామాబాద్ జిల్లాలో విషాదం, సూపర్ మార్కెట్ లో ఫ్రిడ్జ్ షాక్ కొట్టి చిన్నారి మృతి

Bandaru Satyaprasad HT Telugu
Oct 02, 2023 06:06 PM IST

Nizamabad News : సూపర్ మార్కెట్ లో ఫ్రిడ్జ్ నాలుగేళ్ల చిన్నారిని బలిగొంది. చాక్లెట్ కోసం ఫ్రిడ్జ్ డోర్ తెరబోయిన చిన్నారికి విద్యుత్ షాక్ కొట్టింది.

ఫ్రిడ్జ్ షాక్ కొట్టి చిన్నారి మృతి
ఫ్రిడ్జ్ షాక్ కొట్టి చిన్నారి మృతి

Nizamabad News : నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సూపర్ మార్కెట్లో చాక్లెట్ కోసం ఫ్రిడ్జ్ తెరవబోయిన చిన్నారికి షాక్ కొట్టి మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్‌లోని నవీపేటకు చెందిన రాజశేఖర్ తన కూతురు రుషిత (4)తో కలిసి స్థానిక సూపర్ మార్కెట్ వెళ్లారు. తండ్రి రాజశేఖర్ సూపర్ మార్కెట్ లో ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి వస్తువులు తీసుకోడానికి చూస్తుండగా, చిన్నారి పక్కనే ఉన్న ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించింది. ఇంతలో డోర్ షాక్ కొట్టి చిన్నారి రుషిత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.

అసలేం జరిగింది?

నందిపేట్ పట్టణంలోని ఎన్ మార్ట్ అనే సూపర్ మార్కెట్ కు తండ్రితో కలిసి నాలుగేళ్ల చిన్నారి రుషిత వచ్చింది. తండ్రితో కలిసి వస్తువులు కొనుగోలు చేస్తున్న క్రమంలోనే మార్ట్ లోని ఫ్రిడ్జ్ లో చాక్లెట్లు గమనించి, వాటిని తీసుకునేందుకు డోర్ తాకింది. దీంతో ఫ్రిడ్జ్ డోర్ కరెంట్ షాక్ కొట్టింది. చిన్నారి రుషిత విద్యుత్ షాక్ తో గిలగిలా కొట్టుకుంటూ ఆ డోర్ వద్దే వేలాడిపోయింది. రుషితను గమనించిన తండ్రి... ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సూపర్ మార్కెట్ కు వెళ్లిన చిన్నారి విగతజీవిగా ఇంటికి రావడంతో ఆ కుటుంబ కన్నీరు మున్నీరు అవుతోంది. నిత్యం ఎంతో మంది సూపర్ మార్కెట్లో ఫ్రిడ్జ్ షాక్ కొట్టడం కలకలం రేపుతోది. మార్ట్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ చిన్నారి చనిపోయిందని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎన్ మార్ట్ యాజమాన్యం, సిబ్బంది సరైన పద్ధతులు పాటించకపోవటం వల్లే ఈ విషాద ఘటన జరిగిందని వాపోతున్నారు.

హోమ్ వర్క్ చేయలేదని పలకతో కొట్టిన టీచర్-విద్యార్థి మృతి

హైదరాబాద్‌ రామంతాపూర్‌ లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. హోమ్ వర్క్ చేయలేదని కొట్టడంతో యూకేజీ విద్యార్థి మృతి చెందాడు. రామంతాపూర్ పరిధిలోని వివేక్‌ నగర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. హోమ్‌వర్క్‌ చేయలేదని యూకేజీ విద్యార్థి హేమంత్ ను టీచర్ పలకతో తలపై కొట్టింది. దీంతో హేమంత్‌ స్పృహ తప్పి పడిపోయాడు. బాలుడిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... హేమంత్ ఇవాళ మృతి చెందాడు. దీంతో రామంతాపూర్‌లోని పాఠశాల వద్ద విద్యార్థి మృతదేహంతో తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేశారు.