Hyderabad Murder: హైదరాబాద్‌లో ఆస్తికోసం మూడో భర్తను హత్య చేసి కర్ణాటకలో దహనం చేసిన భార్య
Hyderabad Murder: మూడో భర్త ఆస్తిపై కన్నేసిన భార్య ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. ఆపై శవాన్ని గుట్టు చప్పుడు కాకుండా కర్ణాటకలో కాల్చేసింది. ఈ కేసును కర్ణాటకలోని కొడగు పోలీసులు చేధించారు.
Hyderabad Murder: హైదరాబాద్‌లో భర్తను చంపేసి భార్య శవాన్ని కర్ణాటకలో దహనం చేసింది. గుర్తు తెలియని వ్యక్తి మర్డర్ మిస్టరీని చేధించిన కర్ణాటక పోలీసుల దర్యాప్తులో నిందితురాలి వ్యవహారం బయటపడింది. హత్యకు పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేశారు.
భువనగిరికి చెందిన నిహారికకు గతంలో రెండు పెళ్లిళ్లు అయ్యాయి. నిహారిక స్వస్థలం యాదాద్రి- భువనగిరి జిల్లాలోని మునీరాబాద్‌గా గుర్తించారు. హైదరాబాద్‌లో మొదటి పెళ్లి, హరియాణాకు చెందిన మరో వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. జైలులో ఉండగా హరియాణాలోని కర్నాల్ ప్రాంతానికి చెందిన మహిళతో నిహారికకు పరిచయమైంది.
ఆ మహిళను కలవడానికి తరచూ జైలుకు వచ్చే ఆమె కుమారుడు అంకుర్ రాణాతోనూ స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలో రెండో భర్తను కూడా నిహారిక వదిలేసి.. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి రమేష్ కుమార్ (54)ను వివాహం చేసుకుంది. బెంగళూరులో నివసిస్తూ ఓ ప్రముఖ సంస్థలో పని చేస్తున్నట్టు రమేష్‌ను నమ్మించింది.
రమేష్‌కుమార్‌కు పెళ్లై భార్యా కుమార్తె ఉన్నా వారికి దూరంగా ఉంటున్నాడు. 2018లో నిహారికను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఘట్కేసర్ పోచారంలోని సంస్కృతి టౌన్‌షిప్‌లో వీరిద్దరు కాపురం పెట్టారు. పెళ్లైనప్పటి నుంచి ఉద్యోగం పేరుతో నిహారిక తరచూ బెంగళూరుకు వెళ్లేది.ఈక్రమంలో నిహారిక అక్టోబర్ 4న పోచారంలోని ఇంటికి వచ్చింది. నిహారిక తీరుపై అనుమానంతో ఉన్న రమేశ్‌కుమార్ ఆమెతో గొడవ పడ్డాడు. అప్పటికే అతని నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజడంతో తన డబ్బు ఇవ్వాలని ఆమెపై ఒత్తిడి చేశాడు.
ఉద్యోగం పేరుతో బెంగుళూరులో ఉంటున్న నిహారిక ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా వాసవీ నగర్ నుంచి బెంగళూరులోని రామమూర్తి నగర్‌లో వెటర్నరీ డాక్టర్‌గా స్థిరపడిన నిఖిల్ మైరెడ్డితో ప్రేమాయణం సాగిస్తోంది. ఈ క్రమంలో రమేష్ కుమార్ ఇటీవల తన స్తిరాస్థిని విక్రయించగా వచ్చిన రూ.8 కోట్లు కాజేయాలని నిహారిక పథకం పన్నింది. రమేష్‌ను హత్య చేసేందుకు అంకుర్ రాణాను సంప్రదించింది.
ఈ నెల 1న అంకుర్‌తో కలిసి హైదరాబాద్ చేరుకున్న నిహారిక తన భర్త వద్ద ఉంది. 3వ తేదీన తమను బెంగళూరులో దింపి రావాలంటూ భర్తను కోరింది. దీనికి అంగీకరించిన రమేష్ కుమార్ తన మెర్సిడెజ్ బెంజ్ కారులో ఇద్దరినీ తీసుకుని బయలుదేరారు. అంకుర్ కారు నడుపుతుండగా.. పక్క సీటులో రమేష్, వెనుక నిహారిక కూర్చున్నారు. మార్గంమధ్యలో హైవేపై కారు ఆపి.. ఊపిరి ఆడకుండా చేసి రమేష్‌ను హత్య చేశారు. మృతదేహాన్ని కారులోనే ఉంచి బెంగళూరులోని హోరామావూ ప్రాంతం వరకు వెళ్లారు.
బెంగుళూరులో నిఖిల్‌ను సంప్రదించిన నిహారిక తన భర్త హత్య విషయం చెప్పింది. అతడి సలహా మేరకు మృతదేహాన్ని ఊటీ సమీపంలోని సుంటికొప్పలో ఉన్న కాఫీ ఎస్టేట్‌లోకి తీసుకువెళ్లారు. పెట్రోల్ పోసి నిప్పింటించి అక్కడి నుంచి కారులో ఉడాయించారు. ఈ నెల 8న సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు కొడగు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన అధికారులు వివిధ ప్రాంతాల్లోని దాదాపు 500 సీసీ కెమెరాల్లో ఈ నెల 1 తేదీ నుంచి రికార్డు అయిన దృశ్యాలను పరిశీలించారు.
కొడగు కాఫీ ఎస్టేట్‌కు వెళ్లే దారిలోని ఓ కెమెరాలో కారు కదలికలతో పాటు దాని నంబర్ కూడా పోలీసులకు కనిపించింది. ఆ నంబరు ఆధారంగా హైదరాబాద్ వచ్చిన కొడగు పోలీసులు హతుడు రమేష్ వివరాలు సేకరించారు. నిహారిక, నిఖిల్ రెడ్డిలను బెంగళూరులో, అంకుర్‌ను హరియాణాలో అరెస్టు చేశారు. రమేష్ బెంజి కారుతో పాటు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
సికింద్రాబాద్ తుకారాం గేట్ ప్రాంతానికి బజారు రమేశ్ కుమార్ (54) కుటుంబ కలహాలతో భార్య, కూతురును వదిలి మేడ్చల్-మ ల్కాజిగిరి పోచారం ఐటీ కారిడార్ పోలీస్టేషన్ పరిధిలోని సంస్కృతిటౌన్ షిప్‌లో మూడేళ్లుగా ఉంటున్నాడు. మ్యాట్రిమోనీ సైట్ ద్వారా రమేష్‌ను పెళ్లి చేసుకున్న నిహారిక తాను పనిచేస్తున్న సంస్థ ఏడాదిన్నరగా జీతం చెల్లిం చట్లేదని నమ్మించి గూగుల్ కంపెనీలో పని చేయడానికి జర్మనీ వెళ్తున్నానని చెప్పి రమేష్ నుంచి రూ.2.6కోట్లు తీసుకుంది. ఆ తర్వాత అనుమానం వచ్చిన భర్త ఆరా తీయడంతో అదంతా అబద్ధమని తేలింది. దీంతో రమేశ్ డబ్బులు తిరిగివ్వాలని ఆమెపై ఒత్తిడి చేస్తున్నాడు. హత్యకు పాల్పడిన నిహారిక ఆమె ప్రియులు నిఖిల్ రెడ్డి, రాణాలను అదుపులోకి తీసుకున్న కర్ణాటక పోలీసులు కేసును తెలంగాణకు బదిలీ చేస్తున్నారు.