Free bus scheme : ఉచిత బస్సు పథకంతో భారీ నష్టం- టికెట్ ధరల పెంపునకు ఏర్పాట్లు..
15 July 2024, 6:12 IST
- Free bus scheme effect : మహిళలకు ఇస్తున్న ఉచిత బస్సు స్కీమ్‌తో భారీ నష్టం వాటిల్లుతోంది. ఫలితంగా టికెట్ ధరలను పెంచాలని కేఎస్ఆర్టీసీ తీర్మానించుకుంది.
బస్సు టికెట్ ధరలు పెంపు..
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకంతో కేఎస్ఆర్టీసీ (కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్) ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మహిళలకు ఇస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో కేఎస్ఆర్టీసీ నష్టాలు మరింత పెరిగి, గత మూడు నెలల్లో రూ. 295 కోట్లకు చేరింది. ఫలితంగా టికెట్ ధరలను భారీగా పెంచాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.
బస్సు టికెట్ ధరల పెంపు..
శక్తి పథకంలో భాగంగా ఎన్నికల హామీని నెరవేర్చుతూ, కర్ణాటకవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలను అందిస్తోంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఇది కేఎస్ఆర్టీసీని దెబ్బతిస్తోంది. అందుకే టికెట్ ధరలను కనీసం 15శాతం నుంచి 20శాతం వరకు పెంచాలని కేఎస్ఆర్టీసీ వర్గాలు, ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
"ఈ విషయంపై శుక్రవారం ఓ బోర్డు మీటింగ్ జరిగింది. బస్సు టికెట్ ధరలు పెంచాలని తీర్మానించాము. ఈ విషయాన్ని సీఎం సిద్ధరామయ్య దృష్టికి తీసుకెళతాము. ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ నేపథ్యంలో ద్రవ్యోల్బణంతో పోటీపడాలంటే టికెట్ ధరలు పెంచక తప్పదు," అని కేఎస్ఆర్టీసీ ఛైర్మన్ ఎస్ఆర్ శ్రీనివాస్ తెలిపారు.
ఈ తరహా పథకాలతో సంస్థలోని సిబ్బందిపై ప్రభావం పడుతోందని, 2020 నుంచి వారి జీతాలను సవరించలేదని శ్రీనివాస్ పేర్కొన్నారు.
"బస్సు సేవలు చాలా అవసరం. బస్సు డ్రైవర్ బండి నడపకపోతే, ఒక గ్రామం మొత్తం రవాణా సేవలను కోల్పోతుంది. శక్తి పథకం వల్ల గత మూడు నెలల్లో మాకు రూ. 295కోట్ల నష్టం వచ్చింది. అందుకే టికెట్ ధరలను కనీసం 15 నుంచి 20శాతం వరకు పెంచాలని సీఎంకి విజ్ఞప్తి చేశాము. ఇది పెండింగ్‌లో ఉంది," అని శ్రీనివాస్ తెలిపారు.
ఇదీ చూడండి:- ఇండియాలో ఇక్కడ ఇకపై నాన్ వెజ్ ఉండదు.. మాంసాహారాన్ని నిషేధించిన తొలి నగరం ఇదే
ఒవేళ టికెట్ ధరలు పెంచకపోతే, కేఎస్ఆర్టీసీ మనుగడ కష్టం అని శ్రీనివాస్ తేల్చిచెప్పారు.
శక్తి పథకం వల్ల వచ్చిన నష్టాలపై నార్త్ వెస్టర్న్ కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఛైర్మన్ రాజు కగే సైతం స్పందించారు.
"10ఏళ్లల్లో మేము బస్సు టికెట్ ధరలను సవరించలేదు. చాలా నష్టాలు వస్తున్నాయి. కానీ మేనేజ్ చేస్తున్నాము," అని రాజు అన్నారు.
2023 మేలో బీజేపీని ఓడించి, ప్రభుత్వాన్ని స్థాపించింది కాంగ్రెస్ పార్టీ. అనంతరం ఎన్నికల మేనిఫెస్టోలో భాగమైన ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసింది. 2024 జూన్ 11కు.. ఉచిత బస్సు పథకానికి ఏడాది ముగిసింది.
కర్ణాటకలో ఈ స్కీమ్ సక్సెస్ అవ్వడంతో, తెలంగాణలో కూడా ఈ హామీని ఇచ్చింది కాంగ్రెస్. డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో గెలిచి, ప్రభుత్వాన్ని స్థాపించిన అనంతరం తెలంగాణలో సైతం మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసింది. టీఎస్ఆర్టీసీ సైతం భారీ నష్టాల్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే.
కానీ ఉచిత బస్సు పథకానికి రెండు రాష్ట్రాల్లో మహిళల నుంచి మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఈ పథకం వల్ల బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. సీటు కోసం గొడవ పడిన సందర్భాలు కూడా ఉంటున్నాయి. ఆ దృశ్యాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.