Namo Bharat Rapid Rail : దేశంలో తొలి వందే మెట్రోకు 'నమో భారత్ రాపిడ్ రైల్'గా పేరు మార్పు
16 September 2024, 14:11 IST
- Namo Bharat Rapid Rail : మెట్రో నగరాల మధ్య సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఉద్దేశించిన వందే మెట్రో పేరు మారింది. ఇకపై దీనిని నమో భారత్ రాపిడ్ రైల్‌గా పిలుస్తారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
వందే మెట్రోకు 'నమో భారత్ రాపిడ్ రైల్'గా పేరు మార్పు
భారతదేశపు తొలి వందే మెట్రో సర్వీసు 'నమో భారత్ రాపిడ్ రైల్'గా పేరు మార్చారు. ఇది అహ్మదాబాద్, భుజ్ మధ్య నడుస్తుంది. తొమ్మిది స్టేషన్లలో ఆగి 5 గంటల 45 నిమిషాల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. భుజ్-అహ్మదాబాద్ మధ్య మొట్టమొదటి వందే భారత్ మెట్రో పేరును నమో భారత్ ర్యాపిడ్ రైల్‌గా నామకరణం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 16న సాయంత్రం 4:15 గంటలకు భుజ్ రైల్వే స్టేషన్ నుంచి వర్చువల్‌గా ప్రారంభిస్తారు.
ఈ రైలు గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
అహ్మదాబాద్-భుజ్ వందే మెట్రో సర్వీస్ తొమ్మిది స్టేషన్లలో ఆగి 360 కిలోమీటర్ల దూరాన్ని గంటకు 110 కిలోమీటర్ల గరిష్ట వేగంతో 5 గంటల 45 నిమిషాల్లో చేరుకుంటుంది.
రైలు నెంబర్ 94802 భుజ్ -అహ్మదాబాద్ వందే మెట్రో ఆదివారం మినహా ప్రతిరోజూ ఉదయం 05.05 గంటలకు భుజ్ నుంచి బయలుదేరి అదే రోజు ఉదయం 10:50 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది.
ఈ రైలు సబర్మతి, చండియోడియా, విరమ్గామ్, ధృంగద్ర, హల్వాడ్, సమఖిలీ, భచౌ, గాంధీధామ్, అంజర్ స్టేషన్లలో ఆగుతుంది.
ఇంటర్సిటీ కనెక్టివిటీని పెంచడానికి ర్యాపిడ్ రైల్ లక్ష్యంగా పెట్టుకుంది. రెగ్యులర్ సర్వీస్ సెప్టెంబర్ 17న అహ్మదాబాద్ నుండి ప్రారంభమవుతుంది. మొత్తం ప్రయాణానికి రూ.455 ఖర్చవుతుంది.
1,150 మంది ప్రయాణికులకు సీటింగ్‌తో కూడిన 12 బోగీలను కలిగి ఉన్న రాపిడ్ రైల్ అనేక ఫీచర్లను అందిస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఎర్గోనామిక్‌గా డిజైన్ చేసిన సీట్లు, పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ క్యాబిన్లు, మాడ్యులర్ ఇంటీరియర్స్ తో ఇది ఇతర మెట్రోల కంటే మెరుగైనదిగా కనిపిస్తుంది.
ప్రయాణికులు కొన్ని నిమిషాల ముందే టికెట్ కొనుక్కుని ఎక్కవచ్చు. కనీస టికెట్ ధర రూ.30గా నిర్ణయించారు.
వందేభారత్ రైళ్ల తరహాలోనే పూర్తి ఏసీ కోచ్‌లు, కవచ్ వంటి భద్రతా సౌకర్యాలు ఇందులో ఉంటాయి.