AP TET Hall Tickets : ఏపీ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఈ నెల 22న హాల్ టికెట్లు విడుదల-ap tet 2024 hall ticket released on sep 22th mock tests available from sep 19th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tet Hall Tickets : ఏపీ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఈ నెల 22న హాల్ టికెట్లు విడుదల

AP TET Hall Tickets : ఏపీ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఈ నెల 22న హాల్ టికెట్లు విడుదల

Bandaru Satyaprasad HT Telugu
Sep 16, 2024 02:11 PM IST

AP TET Hall Tickets : మరో వారం రోజుల్లో ఏపీ టెట్ హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి హాల్ టికెట్లు టెట్ వెబ్ సైట్ లో విడుదల చేస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ నెల 19 నుంచి టెట్ మాక్ టెస్టులు అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది.

ఏపీ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఈ నెల 22న హాల్ టికెట్లు విడుదల
ఏపీ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఈ నెల 22న హాల్ టికెట్లు విడుదల (Pexels )

AP TET Hall Tickets : ఏపీ టెట్(TET) పరీక్షలకు సమయం దగ్గర పడుతుంది. టెట్ పరీక్షలను అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఈసారి టెట్ పరీక్షలకు 4.27 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆన్ లైన్ లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. రోజుకు రెండు సెషన్లలో టెట్ పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్‌ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. ఈ నెల 19 నుంచి ఆన్‌లైన్‌ లో మాక్‌ టెస్టులు అందుబాటులోకి రానున్నాయి.

సెప్టెంబర్ 22 నుంచి టెట్ హాల్ టికెట్లు

టెట్‌ హాల్‌ టికెట్లను సెప్టెంబర్‌ 22 నుంచి వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రకటన చేసింది. అక్టోబర్‌ 3వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కాగా... అక్టోబర్‌ 4 నుంచి పరీక్ష ముగిసిన ఒక రోజు తర్వాత ప్రాథమిక కీ లు వెబ్‌సైట్ లో విడుదల చేయనున్నారు. అలాగే అక్టోబర్‌ 5 నుంచి ప్రాథమిక కీలపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. టెట్ పరీక్షలు ముగిసిన అనంతరం అక్టోబర్‌ 27న ఫైనల్ కీ విడుదల చేయనున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. టెట్ తుది ఫలితాలను నవంబర్‌ 2న ప్రకటిస్తారు.

ఏపీ టెట్ హాల్ టికెట్ డౌన్ లోడ్ విధానం

  • ఏపీ టెట్ అభ్యర్థులు ముందుగా https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోంపేజీలో కనిపించే AP TET Hall Tickets(July) 2024 అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ అభ్యర్థి రిజిస్ట్రేషన్ ఐడీ, పుట్టిన తేదీతో పాటు Verification Code ను ఎంటర్ చేయాలి.
  • సబ్మిట్ చేస్తే టెట్ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

టెట్ అర్హత మార్కులు

టెట్ పరీక్షలో ఓసీ అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. అలాగే బీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్టీ, ఎస్సీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ 40 శాతం అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ఒక్కసారి అర్హత సాధిస్తే ఎప్పుడైనా డీఎస్సీ పరీక్షలు రాసుకోవచ్చు. టెట్ స్కోర్ పెంచుకునేందుకు అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా ఈ పరీక్ష రాయవచ్చు. డీఎస్సీలో టెట్ కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.

ఏపీలో కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. టెట్ - 2024(జులై) కోసం మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పేపర్‌ 1-ఏకు 1,82,609 మంది, సెకెండరీ గ్రేడ్‌ టీచర్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్ పేపర్‌-1బికు 2,662 మంది దరఖాస్తు చేసుకున్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్‌ పోస్టులు పేపర్‌ 2-ఎ లాంగ్వేజెస్‌కు 64,036 మంది, మ్యాథ్స్‌ అండ్‌ సైన్స్‌కు 1,04,788 మంది అప్లై చేసుకున్నారు.

సంబంధిత కథనం