Himachal Pradesh elections : ‘మోదీ మ్యాజిక్’తో బీజేపీ గట్టెక్కుతుందా?
29 October 2022, 11:29 IST
- Himachal Pradesh elections BJP : హిమాచల్ ప్రదేశ్‌లో మోదీ మ్యాజిక్ పనిచేస్తుందా? అనవాయితీకి బ్రేక్ వేసి ప్రజలు మళ్లీ కమలదళాన్ని గెలిపిస్తారా?
హిమాచల్‌లో ‘మోదీ మ్యాజిక్’ పనిచేస్తుందా?
Himachal Pradesh elections BJP : హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ఎప్పుడు రసవత్తరమే. 68 అసెంబ్లీ స్థానాల్లో పోరు హోరాహోరీగా సాగుతుంది. కొన్ని ఓట్ల తేడాతో సీట్లు చేజారిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పైగా.. ఏ ప్రభుత్వానికి కూడా వరుసగా రెండోసారి అధికారాన్ని అప్పగించకూడదని హిమాచల్ ప్రదేశ్ ప్రజలు బలంగా నిర్ణయించుకున్నట్టు ఇక్కడి పరిస్థితులు చూస్తే కనిపిస్తుంది. 30ఏళ్లుగా.. ఒక్క పార్టీ కూడా వరుసగా రెండోసారి సీఎం పదవిని దక్కించుకోలేకపోయింది. మరి ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది? రెండోసారి అధికారం దక్కించుకునేందుకు బీజేపీకి ఉన్న సానుకూలతలు ఏంటి?
జై మోదీ.. జై ఠాకూర్..
2017 అసెంబ్లీ ఎన్నికల్లో 44స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కమలదళం. కాంగ్రెస్.. 21 స్థానాలకు పరిమితమైంది. అయితే.. 20స్థానాల్లో గెలుపోటముల వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. ఆయా స్థానాల్లో సుమారు 3వేల ఓట్ల తేడాతో అభ్యర్థుల తలరాతలు మారిపోయాయి. ఈ 20 స్థానాల్లోని 6 సీట్లలో మెజారిటీ 1000, అంతకన్నా తక్కువగానే ఉండటం గమనార్హం. ఇక 34 నియోజకవర్గాల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల మధ్య ఓట్ల వ్యత్యాసం 5000, అంతకన్నా తక్కువగా ఉంది.
Himachal Pradesh elections 2022 : ఈసారి మాత్రం.. ఇలా జరగకూడదని బీజేపీ ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే అస్త్రాలను సిద్ధం చేసుకుని రంగంలోకి దిగింది!
అన్ని ఎన్నికల్లోలాగానే ఈసారి కూడా 'మోదీ మ్యాజిక్'తోనే ముందుకెళుతోంది కమలదళం. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం సాధించిన ఘనతలను జోరుగా ప్రచారాలు చేస్తోంది. తమకు మరో అవకాశం ఇస్తే.. 'డబుల్ ఇంజిన్' సర్కార పవర్ చూపిస్తామని చెబుతోంది.
ఈ నేపథ్యంలో.. ప్రజలను ఆకర్షించేందుకు బీజేపీ అగ్రనేతలందరు హిమాచల్ ప్రదేశ్‌కు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ప్రచారాల్లో చురుకుగా ఉంటున్నారు. ఐదేళ్లల్లో తొమ్మిది సార్లు హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటించి, ప్రజలకు చేరువయ్యారు మోదీ. ఈ నెలలో.. వారం రోజుల వ్యవధిలో అక్కడికి వెళ్లి పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించారు.
Himachal Pradesh elections date : సీఎం జైరామ్ ఠాకూర్‌కు రాజకీయ వర్గాల్లో మంచి పేరు ఉండటం కూడా బీజేపీకి కలిసి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మోదీ తర్వాత.. సీఎం అభ్యర్థిని చూసే ప్రజలు ఓట్లు వేస్తారని అంటున్నారు. క్లీన్ చిట్ ఉన్న జైరామ్ ఠాకూర్ చిత్రాలు.. ఎన్నికల ప్రచారాల్లో ఉండటం ప్రజలను ఆకర్షిస్తుందని చెబుతున్నారు.
వీటికి తోడు.. ఐదేళ్ల పాటు చేసిన అభివృద్ధి కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నారు కమలదళం నేతలు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారాలు సాగిస్తూ ముందుకెళుతున్నారు.
కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు ఉన్నాయన్న వార్తలు కూడా బీజేపీకి కలిసి వచ్చే విషయమే! ముఖ్యంగా పార్టీని ఇన్నేళ్లు ముందుడి నడిపించిన దివంగత మాజీ సీఎం వీర్‌భద్ర సింగ్ లేకపోవడంతో కాంగ్రెస్‌లో నాయకత్వ లోపం కనిపిస్తోంది. దీనిని బీజేపీ లబ్ధిచేసుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది.
ఆప్‌తో జాగ్రత్త..!
BJP Himachal Pradesh elections : సాధారణంగా.. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు తీవ్రంగా ఉంటుంది. 30ఏళ్లుగా ఒక పార్టీ తర్వాత మరొకటి ప్రభుత్వాన్ని స్థాపిస్తూ వస్తున్నాయి. ఈసారి కూడా బీజేపీ- కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు తప్పకపోవచ్చు! కానీ బీజేపీకి ఈసారి కాంగ్రెస్ కాకుండా ఆప్‌తోనే ఎక్కువ ముప్పు ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆప్ ఎంట్రీలో ఓట్లు చీలిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాంగ్రెస్ ఓట్లు చీలిపోతే.. బీజేపీకి కలసి వస్తుంది కానీ బీజేపీ ఓటు బ్యాంకు మీద దెబ్బపడితే.. తీవ్ర పరిణామాలు చూడాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
మరోవైపు 5ఏళ్ల పాటు పాలించిన ప్రభుత్వంపై వ్యతిరేక ఎదురవడం సాధారణమైన విషయమే. అయితే.. పాత పెన్షన్ స్కీమ్, నిరుద్యోగం వంటి సమస్యలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్టు కనిపిస్తోంది. వీటిని విపక్షాలు అందిపుచ్చుకుని ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. తమ హయాంలో మొదలు పెట్టిన ప్రాజెక్టులను ప్రారంభించడం తప్ప.. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి కొత్తగా చేసిందేమీ లేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
BJP Himachal Pradesh : వీటన్నింటికీ మించి.. బీజేపీకి ఇప్పుడున్న అసలు భయం హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల 'ఆనవాయితీ'పైనే! శిమ్లా ఆధారిత సంస్థ ఒకటి.. ఇటీవలే జరిపిన సర్వేలో.. బీజేపీకి ప్రభుత్వ వ్యతిరేకత ఎదురవుతుందని 72.6శాతం మంది అభిప్రాయపడినట్టు వెల్లడించింది.
నవంబర్ 12న హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడతాయి. మరి హిమాచల్ ప్రదేశ్ ప్రజలు 'ఆనవాయితీ'కి బ్రేక్ వేస్తారా? బీజేపీకి మరోమారు అధికారాన్ని అప్పగిస్తారా? అన్నది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే స్పష్టమవుతుంది!