Himachal Pradesh election : 'హిమాచల్'లో ఆప్ ఎంట్రీ.. బీజేపీ- కాంగ్రెస్ 'ఆనవాయితీ'కి బ్రేక్!
Himachal Pradesh assembly election : హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల హాడావుడి తారస్థాయిలో ఉంది. గెలుపు కోసం అన్ని పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. మరి గెలుపు అవకాశాలు ఏ పార్టీకి ఎక్కువగా ఉన్నాయి? ఆప్ ఎంట్రీతో బీజేపీ- కాంగ్రెస్‌కు షాక్ తగులుతుందా?
Himachal Pradesh assembly election 2022 :ఎన్నికల ప్రచారాలు, అగ్ర నేతల పర్యటనలు, హామీల వర్షాలు, అసంతృప్తి సెగల మధ్య హిమాచల్ ప్రదేశ్‌కు 'ఎన్నికల కళ' ఇప్పటికే వచ్చేసింది. బీజేపీ, కాంగ్రెస్, ఆప్.. గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. 68 అసెంబ్లీ సీట్ల కోసం వచ్చే నెల 12న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ మొదలైపోయింది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది పార్టీలపై ఒత్తిడి తీవ్రంగా పెరుగుతోంది. అధికారాన్ని నిలుపుకోవాలని బీజేపీ.. 'ఆనవాయితీ'పై ఆశలతో కాంగ్రెస్.. మార్పు అంటూ ఆప్.. ప్రజల్లోకి వెళుతున్నాయి. మరి ఈ పార్టీల్లో గెలుపెవరిది? రాజకీయ విశ్లేషకుల మాట ఏంటి?
హిమాచల్ 'ఆనవాయతీ'..
హిమాచల్ ప్రదేశ్‌లో మూడు దశాబ్దాలుగా ఒక ఆనవాయితీ నడుస్తోంది! ఇక్కడ.. 5ఏళ్లకోసారి అధికారం చేతులు మారుతూ ఉంటుంది. ఓసారి బీజేపీ వస్తే.. మరోసారి కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. ఇక 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. అయితే.. 20స్థానాల్లో గెలుపోటముల వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. ఆయా స్థానాల్లో సుమారు 3వేల ఓట్ల తేడాతో అభ్యర్థుల తలరాతలు మారిపోయాయి. ఈ 20 స్థానాల్లోని 6 సీట్లలో మెజారిటీ 1000, అంతకన్నా తక్కువగానే ఉండటం గమనార్హం. ఇక 34 నియోజకవర్గాల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల మధ్య ఓట్ల వ్యత్యాసం 5000, అంతకన్నా తక్కువగా ఉంది. దీని బట్టి.. హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల వేడి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
Himachal Pradesh election : ఇంత తక్కువ మార్జిన్లతో గెలుపోటములు మారిపోవడం అనేది అన్ని పార్టీలకు ఆందోళన కలిగించే విషయమే. దిగ్గజ నేతలు కూడా ఎన్నోసార్లు ఇదే విధంగా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అందుకే.. గెలుపుపై ఎంత ధీమాగా ఉన్నా.. ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు కూడా అభ్యర్థులపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది.
బీజేపీ- కాంగ్రెస్ హోరాహోరీ..
ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేయడంతో హిమాచల్ ప్రదేశ్‌లో హడావుడి తారస్థాయిలో నడుస్తోంది. అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారాలు చేస్తున్నాయి. అభ్యర్థుల లిస్ట్‌ను ఆచుతూచి తయారు చేస్తున్నాయి.
BJP Himachal Pradesh election : ముఖ్యంగా అధికార పక్షమైన బీజేపీ.. మరో విజయం కోసం తీవ్రంగా కృషిచేస్తోంది. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధినే నమ్ముకుని ఎన్నికల్లోకి వెళుతోంది. 'మిషన్ రిపీట్' అంటూ ప్రజల్లోకి వెళుతోంది. 'డబుల్ ఇంజిన్ సర్కార్' అంటూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.
ఇక ప్రచారాల విషయానికొస్తే.. కమలదళం అగ్ర నేతలందరూ కొన్ని నెలలుగా హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి మిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ. నడ్డాలు విస్త్రతంగా ప్రచారాలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో కమలదళం జోరు మరింత పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. బీజేపీవైపు ప్రజలు స్వల్పంగా మొగ్గుచూపుతున్నట్టు పలు సర్వేలు చెబుతున్నాయి.
బీజేపీకి గట్టి పోటీని ఇచ్చేందుకు విపక్షాలు కూడా తీవ్రంగా కృషిచేస్తున్నాయి. కాంగ్రెస్, ఆప్‌లు తమ సొంత ప్రణాళికలతో ముందుకెళుతున్నాయి. బీజేపీ పాలనలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలను ప్రజల వద్ద లేవనెత్తుతున్నాయి. పాత పెన్షన్ స్కీమ్‌ని మళ్లీ తీసుకురావాలని ప్రజల్లో ఉన్న డిమాండ్‌ని లబ్ధి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ పాలనలో రాష్ట్రంలో ఆరోగ్య, విద్యా వ్యవస్థ క్షీణించిందని, అభివృద్ధి జరగలేదని ప్రజల్లో ప్రచారాలు చేస్తున్నాయి.
Congress Himachal Pradesh election : కాంగ్రెస్ తరఫున పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా.. ఎన్నికల ప్రచారాల్లో చురుకుగా ఉన్నారు. అయితే.. కాంగ్రెస్ దిగ్గజ నేత వీర్‌భద్ర సింగ్ మరణం.. కాంగ్రెస్‌కు కచ్చితంగా నెగిటివ్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ బాధ్యతలను ఆయన సతీమణి ప్రతిభ సింగ్‌కు అప్పగించింది కాంగ్రెస్. కానీ వీర్‌భద్ర సింగ్ స్థానాన్ని భర్తీ చేయడం అసాధ్యం అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. శక్తివంతమైన నేత లేకపోవడంతో కాంగ్రెస్‌లో చీలకలు వచ్చాయని, సీఎం కుర్చీ కోసం పోరు మొదలవుతుందని అంటున్నారు.
ఆప్ ఎంట్రీతో మరిన్ని సవాళ్లు..!
హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటివరకు బీజేపీ, కాంగ్రెస్ మధ్యే తీవ్ర పోటీ ఉండేది. కానీ ఈసారి హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల యుద్ధ భూమిలోకి ఆప్ ఎంట్రీ ఇచ్చింది. 'పంజాబ్' గెలుపుతో జోరు మీద ఉన్న అరవింద్ కేజ్రీవాల్ బృందం.. అటు గుజరాత్లో ఇటు హిమాచల్ ప్రదేశ్‌లో సత్తా చాటాలని తీవ్రంగా శ్రమిస్తోంది. వివిధ హామీలతో ప్రజలను ఆకట్టుకునేందుకు చూస్తోంది.
AAP Himachal Pradesh election ఎప్పటిలాగానే.. ఈసారి కూడా బీజేపీ- కాంగ్రెస్ మధ్య పోరు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఆప్ ఎంట్రీతో ఇతర పార్టీలకు గెలుపు అనేది మరింత కష్టమని చెబుతున్నారు. ముఖ్యంగా అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా చాలా తక్కువగా ఉంటుండటంతో పోటీ మరింత రసవత్తరంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. అనుకున్న దాని కన్నా కొన్ని ఓట్లైనా ఆప్‌కు ఎక్కువగా పడితే.. అది బీజేపీ- కాంగ్రెస్‌కు భారీ దెబ్బ అని అంటున్నారు.
2017 హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 43 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ 22 చోట్ల గెలిచింది. ఒక స్వతంత్ర అభ్యర్థి, ఒక సీపీఎం ఎమ్మెల్యేలు సైతం విజయం సాధించారు. మరి ఈసారి ఏం జరుగుతుంది? బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందా? ఆనవాయితీ ప్రకారం కాంగ్రెస్‌కు అధికారం దక్కుతుందా? లేక ఈ రెండు పార్టీలకు ఆప్ రూపంలో ఊహించని విధంగా షాక్ తగులుతుందా? అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే.. ఎన్నికల ఫలితాలు వెలువడేంత(డిసెంబర్ 8) వరకు వేచి చూడాల్సిందే..!
సంబంధిత కథనం