IMD rain alert : ఆంధ్రకు ఆరెంజ్ అలర్ట్.. ఈ రాష్ట్రాల్లో వడగండ్ల వర్షాలు!
19 March 2024, 7:21 IST
IMD alert Andhra Pradesh : దేశవ్యాప్తంగా రానున్న కొన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఈ రాష్ట్రాల్లో వర్షాలు..!
Andhra Pradesh rains : భానుడి భగభగలు రోజురోజుకు తీవ్రం అవుతున్న సమయంలో.. చల్లటి కబురు చెప్పింది భారత వాతావరణశాఖ (ఐఎండీ). ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో.. రానున్న కొన్ని రోజులు వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. ఒడిశా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో మంగళవారం వర్షాలు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఒడిశా తీరానికి సమీపంలో ఉన్న పశ్చిమ మధ్య, పొరుగున ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో.. వాతావరణంలో అల్పపీడన ద్రోణి నెలకొనడమే దీనికి కారణమని ఐఎండీ స్పష్టం చేసింది.
ఈశాన్య భారతంలో..
మార్చి 18 నుంచి 23 వరకు అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని కొన్ని రోజుల క్రితమే వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఉత్తర భారతదేశం..
Telangana rains today : పశ్చిమ హిమాలయ ప్రాంతంలో వాతావరణం మారుతోందని ఐఎండీ పేర్కొంది. మార్చ్ 20 రాత్రి నుంచి పశ్చిమ హిమాలయ ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మార్చ్ 20-23 మధ్య జమ్ముకాశ్మీర్, లద్దాఖ్, గిల్గిట్-బాల్టిస్థాన్, ముజఫరాబాద్‌లో, మార్చ్ 19న హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో, మార్చ్ 21 నుంచి మార్చి 23 వరకు అక్కడక్కడా తేలికపాటి వర్షాలతో పాటు మంచు కురిసే అవకాశం ఉంది.
మార్చ్ 21 వరకు పశ్చిమ్ బెంగాల్, జార్ఖండ్, ఒడిశాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
అదే సమయంలో.. 20వ తేదీ వరకు ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఒడిశా, విదర్భ, తూర్పు మధ్యప్రదేశ్‌లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మార్చ్ 19 నుంచి 21 వరకు బీహార్‌లోనూ ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది.
Rains in India IMD : అంతేకాకుండా.. మార్చ్ 19 వరకు విదర్భ, తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో, మార్చి 19న ఝార్ఖండ్. ఒడిశాలో కూడా వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తన రోజువారీ వాతావరణ బులెటిన్‌లో సూచించింది.
మార్చ్ 18 నుంచి 21 వరకు యానాంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 21 వరకు తెలంగాణలోనూ ఇదే తరహా వాతావరణ పరిస్థితులు ఉంటాయని స్పష్టం చేసింది. ఈ సమయంలో కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దీనికి తోడు మార్చ్ 20న ఈ సబ్ డివిజన్లలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.