IAS Officer's wife eloped : గ్యాంగ్‌స్టర్‌తో వెళ్లిపోయిన ఐఏఎస్ అధికారి భార్య- చివరికి..!
23 July 2024, 8:10 IST
- IAS Officer's wife eloped : ఓ ఐఏఎస్ అధికారి భార్య, ఓ గ్యాంగ్‌స్టర్‌తో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తొమ్మిది నెలల తర్వాత తిరిగొచ్చి, ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది.
గ్యాంగ్‌స్టర్‌తో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఐఏఎస్ అధికారి భార్య!
గుజరాత్ గాంధీనగర్‌లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వార్తల్లో నిలిచింది. గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారి భార్య, తొమ్మిది నెలల క్రితం ఓ గ్యాంగ్‌స్టర్‌తో వెళ్లిపోయింది. తాజాగా ఇంటికి తిరిగొచ్చి, ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది!
ఇదీ జరిగింది..
మీడియా కథనాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన మహిళ శనివారం నగరంలోని తన భర్త ఇంటికి తిరిగి వచ్చింది. అయితే పిల్లల అపహరణ కేసులో నిందితురాలిగా ఉన్న ఆమెను ఇంట్లోకి రానివ్వొద్దని ఆ ఐఏఎస్ అధికారి తన ఇంటి సిబ్బందికి సూచించినట్లు పోలీసులు తెలిపారు.
దీంతో మనస్తాపానికి గురైన మహిళ తన భర్త అధికారిక నివాసాకి ఎదురుగా ఉన్న తోటలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 45 ఏళ్ల ఆమెను గాంధీనగర్ సివిల్ ఆసుపత్రిలో చేర్పించారు. కానీ అక్కడ ఆమె మరుసటి రోజు మరణించింది.
కొన్నేళ్ల క్రితం వీరికి వివాహం జరగ్గా, 2023 నుంచి వీరిద్దరి మధ్య బంధం బలహీనపడిందని, విషయం విడాకుల వరకు వెళ్లిందని ఐఏఎస్ అధికారుల తరఫు న్యాయవాది తెలిపారు.
తొమ్మిది నెలల క్రితం 'మహారాజా హైకోర్టు'గా పిలిచే తన సొంత రాష్ట్రంలోని ఓ గ్యాంగ్‌స్టర్‌తో ఆ మహిళ వెళ్లిపోయింది. గ్యాంగ్‌స్టర్, అతని సహాయకుడితో కలిసి ఓ మైనర్‌ను కిడ్నాప్ చేసిన కేసులో ఆమె పేరు వెలుగులోకి వచ్చింది.
ఈ కేసులో తమిళనాడు పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకోవడానికే మహిళ తాజాగా తన భర్త ఇంటికి వెళ్లి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు రాసిన లేఖలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని, ఆవేదనను ఆమె వివరించింది. గ్యాంగ్‌స్టర్ వలలో తాను ట్రాప్ అయినట్టు, అతను ప్రధాన నిందితుడిగా ఉన్న రెండు క్రిమినల్ కేసుల్లో తాను చిక్కుకున్నానని ఆ మహిళ లేఖలో పేర్కొంది.
"గ్యాంగ్‌స్టర్ డబ్బులు ఇచ్చిన మహిళ నుంచి రుణం రికవరీకి సంబంధించి ఒక కేసు, బాలుడిని కిడ్నాప్ చేసిన మరో కేసు ఆమెపై ఉంది. కాగా తన భర్త గొప్ప వ్యక్తి అని, తాను లేని సమయంలో తమ పిల్లలను చూసుకునేవాడని ఆమె లేఖలో పేర్కొంది,' అని పోలీసు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.
ఈ కేసు ఆత్మహత్య కేసుగా కనిపించినప్పటికీ, గాంధీనగర్ సెక్టార్ -21 పోలీస్ స్టేషన్లో ప్రమాదవశాత్తు మరణించినట్లు కేసు నమోదైంది.
“ఆమె తనతో పాటు విషాన్ని తీసుకొచ్చిందో లేదో మాకు తెలియదు. ఆమె తన భర్తను కలిసిందా, ఆమె వచ్చినప్పుడు అతను ఇంట్లో ఉన్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. ఆమె మృతదేహాన్ని గాంధీనగర్‌లోని కోల్డ్రూమ్లో భద్రపరిచాము. లాంఛనాలు పూర్తి చేసి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు తమిళనాడు నుంచి ఆమె కుటుంబ సభ్యులు వస్తారు. ఆమె కోసం వెతుకుతున్న మదురై పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. వారి నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు,” అని పోలీసులు తెలిపారు.
అయితే తన భార్య మృతదేహాన్ని తీసుకునేందుకు ఆ ఐఏఎస్ అధికారి సిద్ధంగా లేరని తెలుస్తోంది.