కల్తీ మద్యం: 33కు చేరిన మృతుల సంఖ్య ఎస్పీని సస్పెండ్ చేసిన సీఎం స్టాలిన్-kallakurichi hooch tragedy death toll rises to 33 cm stalin suspends sp orders cid probe ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  కల్తీ మద్యం: 33కు చేరిన మృతుల సంఖ్య ఎస్పీని సస్పెండ్ చేసిన సీఎం స్టాలిన్

కల్తీ మద్యం: 33కు చేరిన మృతుల సంఖ్య ఎస్పీని సస్పెండ్ చేసిన సీఎం స్టాలిన్

HT Telugu Desk HT Telugu
Jun 20, 2024 10:21 AM IST

తమిళనాడులో కల్తీ మద్యం తాగి 33 మంది చనిపోయిన ఘటనపై క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ చేత విచారణకు సీఎం ఆదేశించారు.

చికిత్స పొందుతున్న వారితో మాట్లాడుతున్న అధికారులు
చికిత్స పొందుతున్న వారితో మాట్లాడుతున్న అధికారులు

తమిళనాడులోని కల్లకురిచ్చి జిల్లాలో మంగళవారం రాత్రి మిథనాల్ కలిపిన కల్తీ మద్యం తాగి 33 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

వివిధ ఆసుపత్రుల్లో ఎంతమంది చికిత్స పొందుతున్నారో అధికారులు ధృవీకరించనప్పటికీ, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ జిల్లా కలెక్టర్‌ను బదిలీ చేశారు. పోలీసు సూపరింటెండెంట్‌ను, జిల్లాలోని మొత్తం ప్రొహిబిషన్ విభాగాన్ని సస్పెండ్ చేశారు.

తమిళనాడులో పెను దుమారం రేపిన ఈ ఘటనపై సీబీసీఐడీ (క్రైమ్ బ్రాంచ్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్) చేత విచారణ జరిపించాలని సీఎం ఆదేశించారు.

కల్లకురిచ్చిలోని కరుణాపురం కాలనీకి చెందిన సుమారు 70 మంది దినసరి కూలీలు ప్యాకెట్లలో విక్రయించిన కల్తీ మద్యాన్ని సేవించారు. క్రిటికల్ పేషెంట్లను సేలం, తిరువణ్ణామలై, పుదుచ్చేరి ఆస్పత్రులకు తరలించారు.

వారు పాకెట్ లిక్కర్ (మార్కెట్లో అక్రమంగా అమ్మకాలు జరుగుతున్నాయి) సేవించినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు బుధవారం తెలిపారు.

కల్తీ మద్యం తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

సుమారు 200 లీటర్ల కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని, ల్యాబ్ రిపోర్టుల్లో మిథనాల్ కలిపినట్లు తేలిందని అధికారులు తెలిపారు.

ప్రతిపక్ష నేత, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి, రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు అయ్యి కల్లకురిచ్చి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శిస్తున్నారు.

Whats_app_banner

టాపిక్