Gujarat rains : గుజరాత్‌పై అస్నా తుపాను ప్రభావం ఎంత?
31 August 2024, 8:15 IST
- గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేడు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అయితే అస్నా తుపాను ప్రభావం పెద్దగా లేదని అధికారులు చెబుతున్నారు.
భారీ వర్షాలకు గాంధీ నగర్లో పరిస్థితి..
గుజరాత్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు జలమయం కావడంతో వందలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇక శనివారం కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయి. ఈ మేరకు పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో ఈ రోజు కూడా భారీ వర్షాలు కురుస్తాయి. దీనికితోడు గుజరాత్ తీరంలోని ఉత్తర అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
అస్నా తుపాను- గుజరాత్లో వర్షాలు..
1. అస్నా తుపాను ఈశాన్య అరేబియా సముద్రం మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా, భారత తీరానికి దూరంగా వచ్చే 24 గంటల్లో కదులుతుందని ఐఎండీ తెలిపింది. ఫలితంగా గుజరాత్‌పై అస్నా తుపాను ప్రభావం పెద్దగా ఉండదని పేర్కొంది.
2. పాకిస్థాన్ తీరానికి సమీపంలో ఈశాన్య అరేబియా సముద్రంలో ఏర్పడిన 'అస్నా' తుపాను గంటకు 14 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదిలిందని ఐఎండీ ట్వీట్ చేసింది. దీని ప్రస్తుత స్థానం నలియా (గుజరాత్) కు పశ్చిమంగా 250 కిలోమీటర్లు, కరాచీ (పాకిస్తాన్)కి దక్షిణ నైరుతి దిశగా 160 కిలోమీటర్లు, పస్ని (పాకిస్థాన్)కి తూర్పు-ఆగ్నేయంగా 350 కిలోమీటర్ల దూరంలో ఉంది.
3. అస్నా తుపాను నేపథ్యంలో ముందుజాగ్రత్తగా స్థానిక యంత్రాంగం సుమారు 3,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిందని, గుడిసెలు, మట్టి ఇళ్లలో నివసించేవారు బలమైన భవనాలకు వెళ్లాలని సూచించిందని కచ్ జిల్లా కలెక్టర్ అమిత్ అరోరా తెలిపారు. తుపాను ఇప్పటికే సముద్రంలోకి ప్రవేశించి ఒమన్ వైపు పయనిస్తుండటంతో తీరంపై ప్రభావం పడిందని అన్నారు. కొద్దిపాటి వర్షం, ఈదురుగాలులు మినహా ఇక్కడ ఎలాంటి ప్రభావం కనిపించలేదని వివరించారు. ఏ పెద్ద కట్టడం కూలినట్లు గానీ, ప్రాణనష్టం గానీ సమాచారం అందలేదని స్పష్టం చేశారు.
4. భారీ వర్షాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సౌరాష్ట్ర-కచ్‌లోని సురేంద్రనగర్, రాజ్‌కోట్, జామ్‌నగర్, పోర్బందర్, జునాగఢ్, అమ్రేలి, భావ్నగర్, మోర్బి, ద్వారకా, గిర్ సోమనాథ్, బోటాడ్, కచ్, డయ్యూలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
5. దక్షిణ గుజరాత్ ప్రాంతంలోని భరూచ్, సూరత్, డాంగ్, తాపి, నవ్సారి, వల్సాద్, డామన్, దాదర నగర్ హవేలీ జిల్లాల్లో భారీ వర్షాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు.
6. రాజ్‌కోట్ డివిజన్లోని ద్వారకా, భీమ్రానా మధ్య నీరు నిలిచిపోవడంతో 31.08.2024న నడవాల్సిన 09479 రాజ్‌కోట్-ఓఖా ప్యాసింజర్ స్పెషల్, అదే రోజు షెడ్యూల్ చేసిన 09480 ఓఖా-రాజ్‌కోట్ ప్యాసింజర్ స్పెషల్ రద్దు కాగా, 15667 గాంధీధామ్-కామాఖ్య ఎక్స్‌ప్రెస్ 31.08.2024 మలియా-హల్గామ్ మీదుగా మళ్లించడం జరిగింది. ఈ వివరాలను పశ్చిమ రైల్వే వెల్లడించింది.
7. గుజరాత్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షించి అధికార యంత్రాంగానికి అవసరమైన సూచనలు చేశారు.
8. గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్లే రహదారి వరదల కారణంగా దెబ్బతింది. దభోయ్ రోడ్డులోని రాజ్వి క్రాసింగ్ సమీపంలో హైవేలో భారీ పగుళ్లు కనిపించాయని, ప్రమాదాలను నివారించడానికి దానిని మూసివేయాల్సి వచ్చిందని నివేదికలు చెబుతున్నాయి.
9. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడి వరద పరిస్థితి, బాధితుల సహాయ చర్యలను వివరించారు.
10. ప్రజాజీవనాన్ని త్వరితగతిన పునరుద్ధరించడం వంటి విషయాల్లో ప్రధాని తనకు మార్గనిర్దేశం చేశారని సీఎం పటేల్ ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు. “గుజరాత్ వ్యాప్తంగా గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం మరోసారి నాతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని బాధితులకు సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. వడోదరలోని విశ్వామిత్రి నదికి వరద పోటెత్తడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన బాధితులకు అందుతున్న సహాయ, సహకారాల వివరాలను అడిగి తెలుసుకున్నారు,” అని సీఎం అన్నారు.