Maharashtra rains : ‘మహా’ వర్షాలకు ఏడుగురు బలి.. ముంబైకి రెడ్​ అలర్ట్​!-maharashtra rains at least 7 dead as heavy rains wreak havoc across state red alert in mumbai ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Maharashtra Rains : ‘మహా’ వర్షాలకు ఏడుగురు బలి.. ముంబైకి రెడ్​ అలర్ట్​!

Maharashtra rains : ‘మహా’ వర్షాలకు ఏడుగురు బలి.. ముంబైకి రెడ్​ అలర్ట్​!

Sharath Chitturi HT Telugu
Jul 26, 2024 07:19 AM IST

మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు ఏడుగురు మరణించారు. ముంబై సహా ఇతర ప్రాంతాలకు ఐఎండీ రెడ్​ అలర్ట్​ జారీ చేసింది.

మహారాష్ట్రలో భారీ వర్షాలు
మహారాష్ట్రలో భారీ వర్షాలు

భారీ వర్షాలతో మహారాష్ట్ర ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గత 24 గంటల్లో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), పశ్చిమ మహారాష్ట్ర, కొంకణ్, విదర్భ ప్రాంతాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఫలితంగా పుణెలో ఆరుగురు సహా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఏడుగురు మరణించారు.

స్తంభించిన మహారాష్ట్ర..

వర్షాల కారణంగా రోడ్డు, రైల్వే, విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. మరోవైపు పలు నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. థానే, పాల్ఘర్, కల్యాణ్, కొల్హాపూర్, పుణె, వార్ధా, రాయ్​గడ్​లోని నదుల సమీపంలోని నివాస, వ్యవసాయ భూములు నీట మునిగాయి.

సతారా, రత్నగిరి, రాయ్ గఢ్, ముంబైల్లో శుక్రవారం భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ (కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది) జారీ చేసింది. కొల్హాపూర్, పుణె, సింధుదుర్గ్, థానే, పాల్ఘర్ లకు ఆరెంజ్ అలర్ట్ (కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు) జారీ చేశారు.

ముంబై, పుణె తదితర ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి ఏక్​నాథ్ షిండే అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆర్మీ, నేవీ అధికారులతో కూడా మాట్లాడానని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తమ యూనిట్లను సిద్ధంగా ఉంచామని చెప్పారు. సహాయక చర్యల్లో భాగంగా ప్రజలను తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని, వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా ప్రణాళిక, అభివృద్ధి నిధుల నుంచి డబ్బులను వినియోగించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు తెలిపారు.

ఎంఎంఆర్, పుణె, పశ్చిమ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో వరద పరిస్థితి ఉందని వార్తలు రావడంతో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గురువారం ఉదయం మంత్రాలయంలోని డిజాస్టర్ కంట్రోల్ రూమ్​కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రజల భద్రతకు మరిన్ని చర్యలు చేపట్టారు.

పుణెలో విధ్వంసం..

పుణెలో లోతట్టు ప్రాంతాల్లోని పలు ఇళ్లు, నివాస ప్రాంతాలు గురువారం నీట మునగడంతో అధికారులు వాటిని ఖాళీ చేయించారు.

డెక్కన్ ప్రాంతంలోని ఓ ఫుడ్ స్టాల్​లో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు విద్యుదాఘాతంతో బుధవారం రాత్రి మృతి చెందారు. మృతులను అభిషేక్ అజయ్ ఘనేకర్, ఆకాశ్ వినాయక్ మానే, శివ పరిహార్​గా గుర్తించారు. ముల్షి తహసీల్​లోని తహ్మిని ఘాట్ సెక్షన్​లో కొండచరియలు విరిగిపడటంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలైనట్లు జిల్లా అధికారులు తెలిపారు. మృతుడిని ముల్షీకి చెందిన శివాజీ భైరత్​గా గుర్తించారు. ఈ ఘటనలో ముల్షికి చెందిన జితేంద్ర జంభుర్పానే కూడా గాయపడ్డాడు.

గురువారం సాయంత్రం నగరంలో రెండు విషాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒకటి బిబ్వేవాడిలోని అంబిల్ ఓధా వాగు వద్ద ఒకరు నీట మునిగారు. మరొకటి నారాయణ్ పేట వద్ద ముత్తా నదిలో ఒకరు కొట్టుకుపోయారు. వారిని ఇంకా గుర్తించలేదు.

మరో ఘటనలో లావాసా ప్రాంతంలోని ఓ బంగ్లాలో కొండచరియలు విరిగిపడటంతో ముగ్గురు చిక్కుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానిక పోలీసులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయని అధికారులు తెలిపారు.

పుణె జిల్లా కలెక్టర్ సుహాస్ దివాసే ప్రకారం, ఖడక్వాస్లా ఆనకట్ట పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా దాని నుంచి నీటిని విడుదల చేయడం వల్ల ముత్తా నది చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.

పుణెలోని సింహగడ్ రోడ్, బవ్ధాన్, బనేర్, దక్కన్ జింఖానా వంటి ప్రాంతాలు తీవ్రమైన వరదలను ఎదుర్కొంటున్నాయి, అగ్నిమాపక దళం, పూణే మున్సిపల్ కార్పొరేషన్ విపత్తు నిర్వహణ విభాగం అధికారులు చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి పనిచేస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యగా సింహగఢ్ రోడ్డులోని ఏక్తా నగర్ వద్ద ఆర్మీ బృందాలను మోహరించామని, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఆ ప్రాంతంలో ఉన్నారని జిల్లా పర్యటన సందర్భంగా అధికారులు తెలిపారు.

ఇతర జిల్లాల్లో వరదలు..

గత 24 గంటల్లో పశ్చిమ మహారాష్ట్ర, థానే, పాల్ఘర్, వార్ధా, కొల్హాపూర్ ప్రాంతాల్లో వరద తరహా పరిస్థితులు నెలకొన్నాయని రాష్ట్ర విపత్తు నియంత్రణ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

రాయ్గఢ్ జిల్లాలోని అలీబాగ్​లో కమలాకర్ మత్రే అనే వ్యక్తి వరద నీటిలో మృతి చెందాడు. ఓ వాగు సమీపంలో అతని మృతదేహం లభ్యమైంది. కర్జాత్​లో జరిగిన మరో ఘటనలో వరద నీటిలో చిక్కుకున్న ఓ వ్యక్తిని పోలీసులు, స్థానిక యంత్రాంగం విజయవంతంగా కాపాడారు.

మరో ఘటనలో థానే జిల్లా ముర్బాద్ కు చెందిన ఇద్దరు గురువారం మధ్యాహ్నం బార్వీ డ్యామ్ బ్యాక్ వాటర్​లో చేపల వేటకు వెళ్లి మునిగి చనిపోయారు. వారి కోసం విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సిబ్బంది ఎంత ప్రయత్నించినా గురువారం సాయంత్రం వరకు ఆచూకీ లభించలేదు. శుక్రవారం నుంచి మళ్లీ గాలింపు చేపట్టనున్నారు.

సాంగ్లీ, కొల్హాపూర్, సతారా వంటి జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు వర్నా, కొయినా వంటి ఆనకట్టల నుంచి నీరు విడుదల కావడంతో పరిసర ప్రాంతాల్లోని వేలాది ఎకరాల పంటలు నీట మునిగాయి. సాంగ్లీ నగరంలో కృష్ణానది ప్రమాద స్థాయిని దాటింది. సురక్షిత ప్రాంతాలకు తరలించేటప్పుడు ప్రజలు యంత్రాంగానికి సహకరించాలని జిల్లా సంరక్షక మంత్రి సురేష్ ఖాడే కోరారు.

కొల్హాపూర్ లో రాధానగరి ఆనకట్ట ఉప్పొంగడంతో దాని ఆటోమేటిక్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఫలితంగా పంచగంగ నది ప్రమాదస్థాయిని తాకడంతో దాని ఒడ్డున ఉన్న సమీప ప్రాంతాల్లోకి నీరు చేరింది.

థానే, పాల్ఘర్, రాయ్గఢ్ జిల్లాల్లో అంబా, కుండలికా, సావిత్రి, ఉల్హాస్, కలు నదులు ప్రమాద స్థాయిని దాటగా, పాతాళగంగ హెచ్చరిక స్థాయిని మించి ప్రవహించింది. ఫలితంగా గ్రామీణ జిల్లాల్లోని పలు ప్రాంతాలు రహదారులకు దూరమయ్యాయి.

కల్యాణ్​లో ఉల్హాస్, వాల్ధునీ నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహించాయి. కల్యాణ్, బద్లాపూర్, అంబర్ నాథ్ నదుల ఒడ్డున ఉన్న పలు ప్రాంతాలు నీట మునిగాయి. విదర్భ, వార్ధా, గడ్చిరోలి, యావత్మాల్ లోని కొన్ని ప్రాంతాల్లో వరదలాంటి పరిస్థితి నెలకొంది.

భారీ వర్షాల కారణంగా గడ్చిరోలి-చంద్రాపూర్-నాగ్పూర్ హైవేను మూసివేశారు. కొన్ని ప్రాంతాల్లో వంతెనలపై వరద నీరు ప్రవహించింది. నాసిక్​లోని గంగాపూర్, దరానా, భవాలిలో నీటి మట్టాలు పెరిగాయని, దారానా, భవాలీ నుంచి డిశ్చార్జిని ప్రారంభించామని తెలిపారు.

వరదలకు రాష్ట్ర ప్రభుత్వ విధానాలే కారణమని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే విమర్శించారు. గత పదేళ్లలో బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో నిర్మాణాలకు అనుమతి సహజ వ్యవస్థలను నాశనం చేశాయని ఆరోపించారు. ఇప్పుడు ప్రజలు దానికి మూల్యం చెల్లించుకుంటున్నారని అన్నారు.

సంబంధిత కథనం