Seeds : అధిక దిగుబడినిచ్చి.. వాతావరణ పరిస్థితులు తట్టుకునే 109 విత్తన రకాలు విడుదల
11 August 2024, 14:03 IST
- Climate Resilient Seed : ICAR అభివృద్ధి చేసిన 109 విత్తన రకాలను ప్రధాని మోదీ విడుదల చేశారు. ఈ విత్తనాలు అధిక దిగుబడిని ఇవ్వడమే కాకుండా రకరకాల వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకుంటాయి. రైతులకు మేలు చేసే విధంగా ఈ విత్తనాలు ఉండనున్నాయి. ఇందులో వ్యవసాయ, ఉద్యానవన పంటల విత్తనాలు ఉన్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
వ్యవసాయ ఉత్పాదకత, రైతుల ఆదాయాన్ని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 109 విత్తన రకాలను విడుదల చేశారు. ఇవి అధిక దిగుబడినివ్వడమే కాకుండా ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకోగలవు. అలాంటి వ్యవసాయ, ఉద్యానవన పంటల విత్తనాలను మోదీ విడుదల చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) ఈ విత్తనాలను అభివృద్ధి చేసింది.
ఢిల్లీలోని పూసా క్యాంపస్‌లోని మూడు ప్రయోగాత్మక వ్యవసాయ ప్లాట్‌లలో ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ విత్తనాలను ఆవిష్కరించారు. అక్కడ రైతులు, శాస్త్రవేత్తలతో కూడా సంభాషించారు. క్షేత్ర పంట రకాలలో తృణధాన్యాలు, మినుములు, మేత పంటలు, నూనెగింజలు, పప్పుధాన్యాలు, చెరకు, పత్తి, ఫైబర్ పంటలు ఉన్నాయి. హార్టికల్చర్ కోసం కొత్త రకాల పండ్లు, కూరగాయలు, తోటల పంటలు, దుంపలు, సుగంధ ద్రవ్యాలు, పువ్వులు, ఔషధ మొక్కల విత్తనాలను విడుదల చేశారు.
రైతుల ఆదాయాన్ని పెంపొందించేందుకు సుస్థిర వ్యవసాయ పద్ధతులు, వాతావరణ తట్టుకునే పద్ధతుల కోసం ఈ విత్తనాలు ఉపయోగపడతాయి. భారతదేశంలో పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడానికి మధ్యాహ్న భోజన పథకం, అంగన్‌వాడీ సేవల వంటి ప్రభుత్వ కార్యక్రమాలకు వాటిని అనుసంధానిస్తూ బయోఫోర్టిఫైడ్ పంట రకాలను ప్రోత్సహించే విషయాన్ని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు.
అంతకుముందు దేశ రాజధానిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ 109 విత్తన రకాలను విడుదల చేస్తారని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వాటిలో 23 రకాల తృణధాన్యాలు, వరి తొమ్మిది, గోధుమలు రెండు, బార్లీ ఒకటి, మొక్కజొన్న ఒకటి, జొన్న ఒకటి, మినుములు ఒకటి, రాగులు ఒకటి, చీనా ఒకటి, సాంబ ఒకటి, అర్హర్ రెండు ఉన్నాయి. శనగలు మూడు, కందులు, శనగలు ఒకటి, పచ్చిమిర్చి రెండు, నూనెగింజలు ఏడు అలాగే మేత, చెరకు ఒక్కొక్కటి ఏడు, పత్తి ఐదు, జనపనార ఒకటి, 40 రకాల ఉద్యానవనాల విత్తనాల గురించి ఆయన చెప్పారు.
అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా ఎరువులను తీసుకువెళ్లే నౌకలు ఎక్కువ సమయం తీసుకునే మార్గంలో ప్రయాణించాల్సి రావడంతో ఈ ఏడాది రూ.2,625 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చామని కేంద్రమంత్రి తెలిపారు. రైతుపై భారం పడకుండా ఉండేందుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని వెల్లడించారు.
వ్యవసాయాన్ని పునరుజ్జీవింపజేసి, ఆహార భద్రతను పెంపొందించే ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 109 రకాల విత్తనాలను విడుదల చేశారని ప్రభుత్వం చెబుతోంది. అధిక దిగుబడినిచ్చే, వాతావరణాన్ని తట్టుకోగల విత్తన రకాలను అభివృద్ధి చేయడం అనేది నిరంతర ప్రక్రియ అయినప్పటికీ, వాటిని మోదీ విడుదల చేయడం ద్వారా మెరుగైన ఉత్పాదకత కోసం విత్తన రంగంలో పరిశోధనలను ముందుకు తీసుకెళ్లడంపై ప్రభుత్వ దృష్టి పెడుతుందోని తెలుస్తోంది.